Telangana: ఆర్టీసీలోనూ 95% పోస్టులు స్థానికులకే 

5 Nov, 2022 08:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీలోనూ ఇకపై 95 శాతం పోస్టులను స్థానికులకే కేటాయించనున్నారు. జోనల్, మల్టీజోనల్‌ పద్ధతిలో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ‘95 శాతం స్థానికత’ను పరిగణనలోకి తీసుకొనేలా శాసనసభ ఇటీవల ఆమోదించడంతో దాన్ని ఆర్టీసీలో అమలు చేయనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ పాలకమండలి శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమైంది. స్థానికులకే పోస్టుల ప్రక్రియ అమలు విధివిధానాలకు సంబంధించి కొన్ని అంశాలను ప్రతిపాదించింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 33 రెవెన్యూ జిల్లాలు ఉండగా ఆర్టీసీలో మాత్రం 11 రీజియన్లే ఉన్నాయి. అలాంటప్పుడు స్థానికతను ఏ రకంగా పరిగణనలోకి తీసుకోవాలనే విషయమై పాలకమండలి సభ్యులు చర్చించారు. ఓ ప్రతిపాదనను ఖరారు చేసి ప్రభు త్వానికి ప్రతిపాదించాలని నిర్ణయించారు. ప్రభు త్వం ఆమోదించాక కొత్త రిక్రూట్‌మెంట్‌ చేపట్టనున్నారు. ప్రస్తుతానికి డిపో మేనేజర్‌ కంటే దిగువ అధికార పోస్టుల్లో ఖాళీలు ఉండగా త్వరలో డ్రైవర్, కండక్టర్‌ పోస్టుల్లో కూడా ఖాళీలు ఏర్పడనున్నాయి. 

ఆర్టీసీ ఆసుపత్రికి ఐదుగురు వైద్యులు.. 
తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో ఐదుగురు వైద్యులను ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా తీసుకోవాలని పాలకమండలి సభ్యులు నిర్ణయించారు. ఆసుపత్రికి అనుబంధంగా ఏర్పాటైన నర్సింగ్‌ కాలేజీకి ప్రిన్సిపల్, వైస్‌ ప్రిన్సిపల్, కొత్తగా అందిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ సేవలకు సంబంధించి డయాలసిస్‌ టెక్నీషియన్లు, నర్సులను ఔట్‌ సోర్సింగ్‌ కింద నియమించుకొనేందుకు ఆసుపత్రి పాలకమండలికి బోర్డు అనుమతించింది.  
చదవండి: మునుగోడుపై టీఆర్‌ఎస్‌ పోస్ట్‌మార్టం.. ‘పోలైన ఓట్లలో 50శాతం మనకే’

మరిన్ని వార్తలు