ఆహార భద్రత కార్డుదారులకూ ఆరోగ్యశ్రీ

18 Aug, 2022 03:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆరోగ్యశ్రీ– ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద అందించే ఉచిత వైద్య చికిత్సలు ఆహారభద్రత కార్డుపై కూడా చెల్లుబాటయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్యశ్రీ ట్రస్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో తెల్లరేషన్‌ కార్డు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకం కింద కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను అందజేశారు. అయితే తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ కోసం తెల్లకార్డుల స్థానంలో 10లక్షల ఆహార భద్రత కార్డులను పంపిణీ చేసింది.

వాటిని కేవలం రేషన్‌ సరుకుల కోసం మాత్రమే పరిమితం చేసింది. ఆరోగ్యశ్రీ–ఆయుష్మాన్‌ భారత్‌ కింద చికిత్సలు పొందాలంటే సంబంధిత కార్డుగానీ, లేదా తెల్ల రేషన్‌ కార్డుగానీ ఉండాలనే నిబంధన ఉంది. దీనివల్ల ఆహార భద్రత కార్డుదారులు ఆరోగ్యశ్రీ సేవలను పొందలేకపోతున్నారు. దీనిపై ప్రజల నుంచి వినతులు రావడంతో.. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రత కార్డుదారులకు కూడా ఇక నుంచి ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద ఉచిత సేవలు లభిస్తాయి.  

మరిన్ని వార్తలు