మూడు వారాలు గడిచినా అందని ‘ఆసరా’.. ఇక కొత్త పింఛన్లు వచ్చేదెప్పుడో?

24 Apr, 2022 03:47 IST|Sakshi

రాష్ట్రవ్యాప్తంగా 2–3 నెలలుగా ఇదే పరిస్థితి

మందులకు ఇబ్బంది పడుతున్నామంటున్న వృద్ధులు

బ్యాంకులు, పోస్టాఫీసుల చుట్టూ తిరగలేకపోతున్నామని వెల్లడి 

చార్జీలు, తిండికి అదనపు ఖర్చులవుతున్నాయని ఆవేదన

ప్రతి నెలా తొలి వారంలో ఇచ్చేలా చూడాలని వినతి   

ఈమె పేరు నర్సమ్మ. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మున్సి పాలిటీలో విలీనమైన తుప త్రాల్ల గ్రామానికి చెందిన నర్సమ్మకు ఆసరా పింఛనే ఆధారం. భర్త ఇదివరకే మృతిచెందగా ఇద్దరు కుమారులు బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లారు. ప్రతినెలా ఆలస్యంగా వస్తున్న పింఛన్‌ వల్ల కాళ్ల నొప్పుల మందులు కొనుక్కోనేందుకు ఇబ్బంది పడుతోంది. గత నెల 22న పింఛన్‌ రాగా ఈ నెల ఇప్పటివరకు రాలేదని చెప్పింది. పింఛన్‌ పడిందేమోనని ఇప్పటికే నాలుగుసార్లు 4 కి.మీ. దూరంలోని అయిజ బ్యాంకుకు వెళ్లానని.. ప్రతిసారీ భోజనానికి రూ.50, చార్జీలు రూ. 20 అవుతున్నాయని తెలిపింది.

ఈ గిరిజన మహిళ పేరు బుడ్డమ్మ. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలంలోని పెద్దతండా గ్రామంలో నివసిస్తోంది. ఉన్న ఒక్క కొడుకు, కోడలు బతుకుదెరువుకు హైదరాబాద్‌ వలస వెళ్లారు. భర్త కాలం చేయగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో ఉన్న పొలం ముంపునకు గురైంది. ఉన్న కొద్దిపాటి పొలం చూసుకుంటూ జీవిస్తోంది. ప్రభుత్వం ఇచ్చే ఆసరా పింఛనే ఆమెకు అండగా మారింది. కానీ గత కొన్ని నెలలుగా పింఛన్‌ సకాలంలో అందక ఇబ్బంది పడుతోంది. పింఛన్‌ కోసం గ్రామ పంచాయతీకి రోజూ వెళ్లి వాకబు చేస్తోంది.

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఇది ఒకరిద్దరి వ్యథ మాత్రమే కాదు... రాష్ట్రవ్యాప్తంగా ఆసరా పింఛన్‌ లబ్ధిదారులందరి దీన గాథ ఇదే. ఆసరా లేని పేదలకు సాయం అందించి ఆదుకోవాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నెలనెలా ఆసరా పింఛన్లు అందిస్తోంది. అయితే కొంతకాలంగా ప్రతి నెలా పింఛన్‌ డబ్బు లు సకాలంలో అందక వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులతో పాటు మరికొన్ని వర్గాల లబ్ధిదారులు ఇబ్బం దులు పడుతున్నారు.

2–3 నెలల నుంచి మరీ ఆలస్యం..
రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, ది వ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు, బీడీ వర్కర్లు, ఫైలేరియా బాధితు లు సుమారు 38.75 లక్షల మందికి నెలనెలా ఆస రా పింఛన్లు అందుతున్నాయి. గతంలో వీరికి ప్రతి నెలా మొదటి వారంలోనే పింఛన్‌ డబ్బులు అందేవి. కరోనా కాలంలో అంటే 2020 నుంచి పెన్షన్‌ పంపిణీలో జాప్యం చోటుచేసుకుంది.

2021లో ఆర్థిక వ్యవస్థ గాడి న పడిన తర్వాత పెద్దగా ఆలస్యం జరగలేదు. కానీ ఇటీవల 2–3 నెలల నుంచి పింఛన్‌ డబ్బులు 20వ తేదీ తర్వాతే బ్యాంకులు, పోస్టాఫీసు ఖాతాల్లో జమ వుతున్నాయి. గత నెలలో 25 తర్వాతే డబ్బులు జమవగా వరుస సెలవుతో 28వ తేదీ నుంచి లబ్ధిదారులకు అందాయి. ఈ నెలలో ఇప్పటి వరకూ డబ్బులు ఖాతాల్లో జమకాకపోవడంతో పింఛ న్‌దారులు ఆందోళనలో కొట్టుమిట్టాడు తు న్నారు. పోస్టాఫీసులు, మండల కేంద్రాల్లోని బ్యాంకుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

ఇంకా నెరవేరని ‘కుదింపు’ హామీ
రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు కనీస వయసు పరిమితిని 65 నుంచి 57 ఏళ్లకు కుదించింది. 2018లో ఎన్నికల సమయంలో వృద్ధులకు ఈ మేరకు అధికార టీఆర్‌ఎస్‌ హామీ ఇచ్చింది. మేనిఫెస్టోలో సైతం పెట్టింది. ఈ మేరకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు సైతం స్వీకరించినా కార్యరూపం దాల్చలేదు. మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆసరా పింఛన్లకు రూ. 11,728 కోట్లు కేటాయిస్తున్నామని.. కుదించిన వయసు మేరకు లబ్ధిదారులకు ఏప్రిల్‌ నుంచి పింఛన్లు ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. అయినా ఇప్పటివరకు పురోగతి లేదు. మొత్తానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13 లక్షల మంది కొత్త పింఛన్లు ఎప్పుడొస్తాయా అని మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్నారు.

కొడుకులు పట్టించుకోవట్లేదు..
నాకు బీపీ, షుగర్‌ ఇతర మందులకు నెలకు రూ. 1,500 వరకు ఖర్చవుతుంది. పింఛన్‌ వస్తదని నా కొడుకులు పట్టించుకోవట్లేదు. కానీ 3 నెలలుగా ఆలస్యంగా వస్తుండటంతో ఇబ్బంది పడుతున్నా.
– పోచయ్య, వృద్ధుడు, జంగరాయి, చిన్నశంకరంపేట, మెదక్‌

ముసలోళ్లమని ఎవరూ చేబదులివ్వట్లేదు
గత రెండు నెలలుగా ఆలస్యంగా పింఛన్‌ రావడంతో సకాలంలో మందులు కొనుక్కోలేకపోతున్నా. ఈ నెల ఇప్పటివరకు పింఛన్‌ రాలేదు. ఎవరినైనా డబ్బులు బదులు అడిగితే ముసలోళ్లమని ఇవ్వట్లేదు.
– నాగవ్వ, వృద్ధ్యాప్య పింఛన్‌ లబ్ధిదారురాలు, బాల్కొండ, నిజామాబాద్‌ 

మరిన్ని వార్తలు