కరోనా టీకా కోసం మరో వెయ్యి ఆస్పత్రులు

16 Mar, 2021 02:06 IST|Sakshi

వ్యాక్సినేషన్‌ వేగవంతం కోసం సర్కారుకు వైద్యశాఖ ప్రతిపాదన

రోజుకు లక్ష టీకాలు వేసేందుకు ప్రణాళిక

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసేందుకు వీలుగా ప్రస్తుతమున్న ప్రైవేటు, ప్రభుత్వ టీకా కేంద్రాలకుతోడు మరో వెయ్యి ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా టీకా కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపించింది. ప్రస్తుతం 225 ప్రభుత్వ ఆస్పత్రులు, 179 ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా కేంద్రాలున్నాయి. వాటిల్లో 60 ఏళ్లు పైబడిన వృద్ధులతోపాటు 45–59 ఏళ్ల వయసుగల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులందరికీ టీకాలు వేస్తున్నారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు రెండో విడత వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఇప్పటివరకు మొదటి, రెండు విడతలు కలిపి 7,51,639 కరోనా టీకాలు వేశారు.

20 పడకలకుపైగా ఉన్న ఆస్పత్రులకు..
రాష్ట్రంలో వృద్ధులు, 45–59 ఏళ్ల వయసులోని దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు 50 లక్షల మంది ఉంటారని లెక్కగట్టారు. అయితే టీకా వేయించుకునే వారిలో ఎక్కువ మంది ప్రైవేటు ఆస్పత్రులకే వెళ్తున్నారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లోని టీకా కేంద్రాలకు జనం పోటెత్తుతున్నారు. కొన్ని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులకు రోజుకు 400 మంది వరకు కూడా వస్తున్నారు. లబ్ధిదారులు పోటెత్తుతుండటం, 24 గంటలూ టీకా వేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించడంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మరో వెయ్యి ప్రైవేటు ఆస్పత్రులను గుర్తించింది. 20 పడకలకుపైగా ఉన్న ఆస్పత్రుల్లో టీకాలు వేసేలా ప్రణాళిక రచించారు. తమకు టీకాలు వేసేందుకు అనుమతి ఇవ్వాలని, ప్రభుత్వం నిర్దేశించిన కరోనా ప్రొటోకాల్స్‌ ప్రకారమే వేస్తామని ఇప్పటికే 100 ప్రైవేటు ఆస్పత్రులు దరఖాస్తు చేసుకున్నాయి. మరో వెయ్యి ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతి ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో మొత్తంగా ప్రతిరోజూ దాదాపు లక్ష మందికి టీకా వేయొచ్చని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

మరిన్ని వార్తలు