మళ్లీ అలజడి.. ఆదిలాబాద్‌ జిల్లాలో పెద్దపులుల కదలికలు

22 Nov, 2022 08:25 IST|Sakshi

ఆదిలాబాద్‌ జిల్లా సరిహద్దుల్లో, ఆసిఫాబాద్‌ అడవుల్లో సంచారం

ఇటీవల ఆసిఫాబాద్‌లోని పత్తి చేనులో రైతును చంపిన పులి

పొలాల్లోకి వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలని స్థానికులకు సూచన

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పెద్దపులుల కదలికలు మళ్లీ అలజడి రేపుతున్నాయి. ఇటీవల ఐదారు పులుల సంచారం పెరగడంతో సరిహద్దు గ్రామాల ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఆసిఫాబాద్‌ అటవీ ప్రాంతంలోని ఓ పత్తిచేనులో పులి ఒకరిని చంపి కిలోమీటర్‌ దాకా ఈడ్చుకెళ్లిన ఉదంతంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.

అదీగాక తరచుగా జనావాసాలకు దగ్గరగా పులి కదులుతూ లేదా రోడ్డు దాటుతూ కనిపిస్తుండటంతో ఇక్కడి వారిలో భయం మరింత పెరిగింది. మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్‌ల నుంచి ఆదిలాబాద్‌ అడవి పరిధిలోకి ఒక పెద్దపులి, ఏడాదిన్నర వయసున్న మూడు పులిపిల్లలు, వాంఖిడి నుంచి ఆసిఫాబాద్‌ అటవీ ప్రాంతంలోకి మ రో మగ పులి కొత్తగా ప్రవేశించాయి.  

కొత్త పులులతోనే సమస్య 
వాంఖిడి నుంచి వచి్చన పులి కాగజ్‌నగర్‌ అడవిలో స్థిరనివాసం ఏర్పరచుకునేందుకు యతి్నంచింది. అయితే ఇప్పటికే అక్కడ స్థిరపడిన మరో మగపులి దానిని తరిమేసిందని అటవీ అధికారులు చెబుతున్నారు. దీంతో ఆ పులి కాగజ్‌నగర్‌ అడవి నుంచి బయటకు వచ్చాక ఆసిఫాబాద్‌లో ఒకరిపై దాడి చేసింది. ఆ తర్వాత అది ఈద్‌గామ్‌ గ్రామం నుంచి ప్రస్తుతం బెజ్జూర్‌ మండలంలోని మారేపల్లి, కాటేపల్లి గ్రామాలకు సమీపంలో సంచరిస్తుండటం సమస్యగా మారింది.

ఇప్పటికే ఈ ప్రాంతంలో స్థిరనివాసం ఏర్పరుచుకున్న పులులతో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావడం లేదు. మహారాష్ట్ర నుంచి పులుల రాకపోకలు పెరగడంతో ఈ సమస్య తీవ్రమైంది. ఏటా అక్టోబర్‌ నుంచి ఫిబ్రవరి దాకా సరిహద్దుల నుంచి తెలంగాణలోకి పులులు రాకపోకలు సాగిస్తుండటం మామూలేనని అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఒకేసారి రెండు, మూడు ప్రాంతాల్లో ఐదారు పులులు సంచరిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన ఎక్కువైందని అంటున్నారు. అయితే, ప్రజలు భయపడకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు చెప్పారు. 

గ్రామస్తులను అప్రమత్తం చేశాం 
ఆసిఫాబాద్‌ చుట్టుపక్కల తిరుగాడుతున్న పులిని ట్రాక్‌చేసేందుకు బెజ్జూరు నుంచి రెండు, కార్జోలి నుంచి రెండు బృందాలను పెట్టాం. ఈ పులి జనావాసాలు, పొలాలకు దగ్గరగా వస్తున్నపుడు ప్రజలను అలర్ట్‌ చేస్తున్నాం. ఆ పులి కూడా పూర్తిగా అడవిలోకి వెళ్లేందుకే ప్రయతి్నస్తోంది. రెవెన్యూ ప్రాంతాల్లో పులి బోన్లు పెట్టడంతోపాటు ప్రత్యేక వెటర్నరీ బృందాన్ని కూడా సిద్ధం చేశాం. ఒకట్రెండు రోజుల్లో అది బోనులో చిక్కడమో లేదా దానిని మత్తుమందిచ్చి అడవిలోకి పంపడమో జరుగుతుంది. ఇప్పటికైతే ఎలాంటి సమస్య లేదు. సాయంత్రం 6 గంటల తర్వాత బయట తిరగొద్దని, ఉదయం 10 గంటల తర్వాతనే పొలాల్లోకి వెళ్లాలని ప్రజలకు చెప్పాం. మారెడు, మార్కిడి, కాటేపల్లి గ్రామస్తులను అప్రమత్తం చేశాం. 
–దినేష్‌, ఆసిఫాబాద్‌ డీఎఫ్‌వో 

40 కెమెరా ట్రాప్‌లు పెట్టాం 
కొత్తగా వచి్చన పులులు తిప్పేశ్వర్‌ నుంచి వచి్చనట్లు గుర్తించాం. సరిహద్దుల నుంచి ఆదిలాబాద్‌లోకి ప్రవేశించిన ఈ పులుల ట్రాకింగ్‌కు రెండు బేస్‌క్యాంప్‌లు, ట్రాకర్స్‌ ఏర్పాటుచేశాం. 40 కెమెరా ట్రాప్‌లను పెట్టి పర్యవేక్షిస్తున్నాం. ఎన్జీవోల సాయం కూడా తీసుకుంటున్నాం. ఈ పులులు తిప్పేశ్వర్‌ వైపు మళ్లీ మనవైపు అటూ ఇటూ తిరుగాడుతున్నాయి. టాస్క్‌ఫోర్స్, ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌ల ద్వారా రాత్రిళ్లూ పర్యవేక్షిస్తున్నాం. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పొలాలకు గుంపులుగా వెళ్లాలని సూచించాం. ఉదయం పూట పొదలు, తుప్పల్లోకి బహిర్భూమికి వెళ్లొద్దని చెప్పాం. సాయంత్రం 4 గంటలకే పొలాల నుంచి తిరిగి వచ్చేయాలని చెబుతున్నాం.  
–రాజశేఖర్, ఆదిలాబాద్‌ డీఎఫ్‌వో
చదవండి:  తోడు కోసం అడవి దాటుతున్న మగ పులులు

మరిన్ని వార్తలు