కొత్త రెవెన్యూ చట్టంలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసు

27 Aug, 2020 01:40 IST|Sakshi

పీఆర్, నీటిపారుదల శాఖల్లోకి వీఆర్వో, వీఆర్‌ఏల విలీనం

సబ్‌ రిజిస్ట్రార్, తహసీల్దార్‌ వ్యవస్థ అనుసంధానం

రిజిస్ట్రేషన్‌ పూర్తయిన రోజే మ్యుటేషన్, పాస్‌బుక్‌

అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ), తహసీల్దార్‌ అధికారాల్లో కోత

రెవెన్యూ వ్యాజ్యాలను పరిష్కరించే బాధ్యత కలెక్టర్లకు

సాక్షి, హైదరాబాద్‌: ఇకపై రాష్ట్రంలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసు (టీఏఎస్‌) విధానం రాబోతోంది. దీని ద్వారా రాష్ట్ర పరిపాలన అధికారులను నియమించే కొత్త విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. కొత్తగా రూపుదిద్దుకుంటున్న రెవెన్యూ చట్టంలో ఈ సర్వీసు విధి విధానాలను పొందుపరుస్తోంది. ప్రస్తుతం గ్రూప్‌–1 పరీక్ష విధానంతో ఎంపికవుతున్న డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులను ఇకపై టీఏఎస్‌ ద్వారా భర్తీ చేస్తారు. అలాగే టీఏఎస్‌ ద్వారా ఎంపికైన వారికి నేరుగా రెవెన్యూ, వాణిజ్య పన్నులు, పోలీసు, ఎక్సైజ్, రవాణా శాఖల్లో పోస్టింగ్‌ ఇస్తారు. 

మహారాష్ట్ర రెవెన్యూ చట్టం తరహాలో...
ప్రస్తుతం కర్ణాటక సహా వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఈ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేసింది. వచ్చే శాసనసభ సమావేశాల తరువాత అమల్లోకి రానున్న కొత్త రెవెన్యూ చట్టం శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఇది మహా రాష్ట్ర రెవెన్యూ చట్టం తరహాలో ఉంటుందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. రెవెన్యూ శాఖలో ఉన్న వీఆర్వోలను పంచాయతీరాజ్‌ శాఖలో, వీఆర్‌ఏలను నీటిపారుదల శాఖలో విలీనం చేయనున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం తహసీల్దార్‌లకు ఉన్న అధికారాల్లో కోతపెట్టనున్నారు. కొనుగోలు చేసిన లేదా వంశపారంపర్యంగా సంక్రమించిన భూముల మ్యుటేషన్‌ను సరళీకృతం చేస్తారు. సబ్‌ రిజిస్ట్రార్‌– తహసీల్దార్‌ కార్యాలయాలను అనుసంధానం చేస్తారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముగియగానే ఆటోమేటిక్‌గా మ్యుటేషన్‌ జరిగిపోవడంతో పాటు పాసు పుస్తకాన్ని కూడా జారీ చేస్తారు. భూమి రిజిస్ట్రేషన్‌ తరువాత రోజులు, నెలల తరబడి మ్యుటేషన్‌ కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఇకపై ఉండదు. రైతు పాసు పుస్తకాల్లోనూ మార్పులు తీసుకురానున్నారు. (బడికి పోయేదెట్లా..!)

భూముల వర్గీకరణ...
ఇకపై భూములను నాలుగు రకాలుగా వర్గీకరిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజావసరాలు, గ్రామ కంఠం భూములుగా ఉంటాయి. పాసు పుస్తకాల్లో సైతం భూమి కేటగిరీని పొందుపరుస్తారు. భూ వివాదాలు తలెత్తితే పరిష్కరించే బాధ్యత ఇకపై కలెక్టర్లు తీసుకుంటారు. రెవెన్యూ వ్యాజ్యాలను కలెక్టర్లు 40 రోజుల్లో పరిష్కరించాల్సి ఉంటుంది. అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) అధికారాల్లో కూడా కోత పడనుంది.  

మరిన్ని వార్తలు