ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించే విధంగా ఉంది: హైకోర్టు

19 Feb, 2021 08:43 IST|Sakshi

లాయర్ల హత్యోదంతం ప్రభుత్వంపై విశ్వాసం సన్నగిల్లేలా చేస్తోం

ప్రజల్లో నమ్మకం పెంచే విధంగా దర్యాప్తు చేయాలి

పోలీసులు అన్ని ఆధారాలను పకడ్బందీగా సేకరించాలి

సర్కారుకు, డీజీపీకి హైకోర్టు ఆదేశం

విచారణ మార్చి 1కి వాయిదా  

సాక్షి, హైదరాబాద్‌: న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, పీవీ నాగమణిల దారుణ హత్య తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ ఘటన ప్రభుత్వంపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తోందని పేర్కొంది. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోరాదన్న గట్టి సందేశాన్ని ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపింది. ప్రజలు న్యాయం కోసం ప్రభుత్వంవైపు ఆశగా చూస్తున్నారని, ప్రభుత్వంపై, న్యాయవ్యవస్థపై నమ్మకం, విశ్వాసం పెంచే విధంగా దర్యాప్తు చేయాలని స్పష్టం చేసింది. నిర్దిష్ట కాలపరిమితిలోగా దర్యాప్తు పూర్తి చేయాలని, ఘటనాస్థలం నుంచి పోలీసులు అన్ని ఆధారాలను పకడ్బందీగా సేకరించాలని ఆదేశించింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి. విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం ప్రభుత్వాన్ని, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, రామగుండం మున్సిపల్‌ కమిషనర్‌తోపాటు పెద్దపల్లి ఎస్‌హెచ్‌వోను ఆదేశించింది. న్యాయవాద దంపతుల హత్య నేపథ్యంలో విధులు బహిష్కరిస్తున్నట్లు హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ సూర్యకరణ్‌రెడ్డి, హత్య ఘటనపై లోతుగా దర్యాప్తు చేయిం చాలని న్యాయవాది స్రవంత్‌ శంకర్‌ ధర్మాసనానికి నివేదించగా.... ఈ వ్యవహారాన్ని సుమోటోగా విచారణకు స్వీకరి స్తున్నామని, ఈ ఘటనపై ఎలా చర్యలు తీసుకోవాలో తమకు తెలుసని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

రాష్ట్ర ప్రతిష్టకు, ప్రజల భద్రతకు సంబంధించింది
న్యాయవాద దంపతుల హత్యోదంతాన్ని రాష్ట్ర ప్రతిష్టకు, ప్రజల భద్రతకు సంబంధించిన కేసుగా పరిగణించాలని ఏజీకి ధర్మాసనం సూచించింది. ‘‘హత్య జరిగిన ప్రదేశంలో రెండు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. ఆ బస్సుల్లో ఉన్న వారు హత్యకు ప్రత్యక్ష సాక్షులు. వారిని గుర్తించి సాక్షులుగా వాంగ్మూలాలను నమోదు చేయాలి. నిర్దిష్ట కాలపరిమితిలో దర్యాప్తు పూర్తి చేయాలి. హత్యా స్థలంలో స్థానికులు రికార్డు చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వామన్‌రావు చనిపోయే ముందు తనపై దాడి చేసిన వారి పేర్లను చెబుతున్నారు. దాన్ని మరణవాంగ్మూలంగా భావించాలి.

అన్ని వీడియో ఆధారాలను భద్రపర్చాలి. హంతకులకు శిక్షపడేందుకు అన్ని ఆధారాలను పకడ్బందీగా సేకరించాలి. చట్టబద్ధమైన వ్యవస్థలో ఇటువంటి దారుణమైన ఘటనలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది’’అని కోర్టు వ్యాఖ్యానించింది. హత్య జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందని, ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేస్తోందని... హంతకులను వెంటనే అదుపులోకి తీసుకుంటామని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ నివేదించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం... కేసు దర్యాప్తులో తీసుకున్న చర్యలను వివరిస్తూ స్థాయీ నివేదిక సమరి్పంచాలని ప్రభుత్వాన్ని, పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది. కేసు తదుపరి విచారణను మార్చి 1కి వాయిదా వేసింది.
చదవండికారు, కత్తులు సమకూర్చింది అతడే..
 

చదవండిపెద్దపల్లి హత్యలు: సంచలనం రేపుతున్న ఆడియో క్లిప్‌  

>
మరిన్ని వార్తలు