పంటపొలాల్లో పేరుకుపోయిన భాస్వరం

16 May, 2022 02:36 IST|Sakshi

6 వేల మట్టి నమూనాలపై వ్యవసాయ విశ్వవిద్యాలయం సర్వే

208 మండలాల్లో మోతాదుకు మించి నిల్వలున్నట్లు గుర్తింపు 

భాస్వరం నిల్వలు కరిగించడంపై రైతులకు వ్యవసాయ శాఖ అవగాహన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పంటపొలాల్లో భాస్వరం నిల్వలు పేరుకుపోయాయని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం సర్వేలో తేలింది. రాష్ట్రవ్యాప్తంగా 6 వేల మట్టి నమూనాలను సేకరించి పరీక్షించగా 53 శాతం నేలల్లో అధిక భాస్వరం నిల్వలు ఉన్నట్లు తేలింది. 208 మండలాల్లో అధిక భాస్వరం నిల్వలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఇందులో 54 మండలాల్లో ఓ మోస్తరు, 154 మండలాల్లో అత్యధికస్థాయిలో ఉన్నట్లు తేల్చింది. నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో 90 శాతం కన్నా ఎక్కువ మండలాల్లో భాస్వరం నిల్వలు అధికంగా ఉన్నట్లు తేల్చారు. నిజామాబాద్‌లో 27 మండలాలకుగానూ 26 మండలాల్లో అధికనిల్వలు ఉన్నట్లు తేలింది. కామారెడ్డి జిల్లాలో 22 మండలాలకుగానూ 20 మండలాల్లో, కరీంనగర్‌లో 16 మండలాలకుగానూ అన్నిచోట్లా, పెద్దపల్లిలో 14 మండలాలకుగానూ అన్నిచోట్లా, సిరిసిల్లలో 13 మండలాలకుగానూ అన్ని మండలాల్లోనూ అధిక భాస్వరం నిల్వలు పేరుకుపోయాయని తేలింది.

పంటకు అవసరమైన భాస్వరాన్ని డీఏపీ లేదా కాంప్లెక్స్‌ ఎరువుల రూపంలో అందిస్తారు. పంటకు వేసిన ఎరువులో కేవలం 15–20 శాతం ఎరువునే పంట వినియోగించుకుంటుంది. మిగిలిన 80 శాతం కరగని స్థితిలో భూమిపొరల్లో ఉండిపోతుంది. అయినప్పటికీ రైతులు విచ్చలవిడిగా ఎరువులను వినియోగిస్తూనే ఉన్నారని విశ్వవిద్యాలయం అధికారులు చెబుతున్నారు.

కాగా, ఎరువుల ధరలను కూడా కేంద్రం భారీగా పెంచింది. దీంతో రైతుకు పెట్టుబడి ఖర్చు అధికమయ్యే ప్రమాదం ఏర్పడింది. పొలాల్లో పేరుకుపోయిన భాస్వరం నిల్వలను కరిగించి మళ్లీ పంటకు ఉపయోగపడేలా చేసేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా ఫాస్పేట్‌ సాల్యుబింగ్‌ బ్యాక్టీరియా(పీఎస్బీ) తయారు చేశారు. ఇది పౌడర్, ద్రవరూపంలో అన్ని ఎరువుల షాపుల్లో లభిస్తుందని వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు రైతులకు అవగాహన పెంచేలా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.   

మరిన్ని వార్తలు