మ్యారేజ్‌ బ్యూరో: ఇక్కడ పెళ్లి సంబంధాలు రైతులకు మాత్రమే

21 Jan, 2021 02:30 IST|Sakshi
అంజిరెడ్డి

తిమ్మాపూర్‌ వద్ద ప్రారంభించిన కరీంనగర్‌ వాసి

రైతుల పట్ల వివక్షను తొలగించేందుకే: అంజిరెడ్డి

►సూర్యాపేటకు చెందిన 35 ఏళ్ల రైతుకు పది ఎకరాల సాగు భూమి ఉంది. కాలాలకు అనుగుణంగా పంట దిగుబడి వస్తుంటుంది. ఆయనకు వివాహం కాలేదు.. పెళ్లి కాలేదనే కంటే.. పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఎందుకంటే.. అతను వ్యవసాయం చేస్తున్నాడు కాబట్టి..

►మంథనిలో ఐదు ఎకరాలున్న మరో యువకుడు ఉన్నత చదువులున్నా వ్యవసాయం మీద మక్కువతో రైతుగా మారాడు. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా.. సేద్యం చేస్తున్నాడనే సాకుతో అతడికి పిల్లనివ్వడానికి ఎవరూ రావట్లేదు. 

సాక్షి, కరీంనగర్‌: రైతును పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు అంతగా ఆసక్తి చూపడం లేదు.. ఎకరాల కొద్దీ భూములున్నా, లక్షల కొద్దీ ఆదాయమున్నా వివాహం అనే విషయం వచ్చేసరికి వ్యవసాయదారులు వెనకబడిపోతున్నారు. ఏదిఏమైనా రైతులకు పెళ్లి సంబం ధాలు దొరకడం చాలా కష్టంగా మారుతోంది.. ఈ పరిస్థితుల్లో కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌కు చెందిన రైతు కేతిరెడ్డి అంజిరెడ్డి (40) ‘రైతు మ్యారేజ్‌ బ్యూరో’ ఏర్పాటు చేసి శభాష్‌ అనిపించుకున్నారు.. దేశంలో రైతులకు మాత్రమే పెళ్లి సంబంధాలు కుది ర్చే తొలి బ్యూరో తనదేనని అంజిరెడ్డి అంటున్నారు.. ‘15 ఎకరాలున్న నా మిత్రుడికి పెళ్లి విషయంలో ఎదురైన అనుభవం తో రైతు కోసమే ప్రత్యేకంగా మ్యారేజీ బ్యూరో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నా.. అందుకోసం రైతును పెళ్లి చేసుకో వాలనుకునే వారు సంప్రదించాలని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టా. మంచి రెస్పాన్స్‌ వచ్చింది. దీంతో హైదరాబాద్‌ రోడ్డులో తిమ్మాపూర్‌ వద్ద రైతు మ్యారేజ్‌ బ్యూరో తెరిచా’ అని అంజిరెడ్డి చెప్పుకొచ్చారు. 

ఫీజు ఐదొందల రూపాయలు..
గత అక్టోబర్‌లో ఈ బ్యూరో ఏర్పాటు చేసిన అంజిరెడ్డి.. సోషల్‌ మీడియాను వీలైనంత ఎక్కువగా ఉపయోగించుకున్నారు. ఫేస్‌బుక్‌లో వ్యవసాయంతో లింక్‌ అయిన అన్ని గ్రూపుల్లో తన ఆలోచనను పంచుకున్నారు. యూట్యూబ్‌ చానల్‌ ద్వారా విస్తృత ప్రచారం చేశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి చాలా దరఖాస్తులు వచ్చాయి. అందులో వ్యవసాయం మాత్రమే చేసే వ్యక్తుల దరఖాస్తులను పరిగణనలోకి తీసుకున్నారు. అలాగే వ్యవసాయదారుడు భర్తగా కావాలనుకుంటున్న యువతులు, వారి తల్లిదండ్రుల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు అంజిరెడ్డి చెప్పారు. సంబంధాలు కుదిర్చేందుకు రూ.500 ఫీజుగా తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినులు వస్తున్నారు..
కులం, మతంతో సంబంధం లేకుండా పెళ్లి విషయంలో రైతు పట్ల వివక్ష అత్యంత దయనీయంగా ఉంది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో రైతు కుటుంబానికి పెద్ద కష్టమేమీ లేదు. సాధారణ ఉద్యోగి సంపాదిస్తున్న దాని కన్నా ఐదెకరాల రైతు ఆదాయం ఎక్కువే.. ఈ విషయాలను ఇప్పుడిప్పుడే ఆడపిల్లలు అర్థం చేసుకుంటున్నారు. ఎంటెక్, ఎంసీఏ చదివిన వారు, సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తున్న వారు కూడా పల్లెల్లో వ్యవసాయం చేసే చదువుకున్న భర్త కావాలని కోరుకుంటున్నారు. మా దగ్గరికి వచ్చిన బయోడేటాలను బట్టి ఈ విషయం తెలుస్తోంది. కొన్ని సంబంధాలు కూడా కుదిరాయి. మంచి రోజులు రాగానే పెళ్లిళ్లు జరుగుతాయి. – కేతిరెడ్డి అంజిరెడ్డి, రైతు మ్యారేజ్‌ బ్యూరో నిర్వాహకుడు 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు