తర‘గది’కి ఇరవై మంది..! అమలు సాధ్యమేనా?

1 Feb, 2022 04:36 IST|Sakshi

కోవిడ్‌ నిబంధనల అమలుపై సందేహాలు 

బెంచ్‌కు ఒకరు చొప్పున గదికి 20 మంది ఉండేలా నిబంధన

అమలు సాధ్యం కాదంటున్న టీచర్లు

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలు మంగళవారం నుంచి పునః ప్రారంభం కానున్నాయి. కరోనా దృష్ట్యా ఇప్పటికే స్కూళ్ళు, కాలేజీల్లో పెద్ద ఎత్తున శానిటైజేషన్‌ కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు రెండు రోజులుగా గదులు, పరిసరాలను దగ్గరుండి శుభ్రం చేయిస్తున్నారు. విద్యార్థులు కోవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించేందుకు స్కూల్‌ పరిధిలో కమిటీలను కూడా ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.

గతంలో విడుదల చేసిన కోవిడ్‌ నిబంధనలే ఇప్పుడూ అమలులో ఉంటాయని వారు చెప్పారు. అయితే తరగతి గదిలో పరిమిత సంఖ్యలో విద్యార్థులను కూర్చోబెట్టడం కష్టమని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా బెంచ్‌కు ఒకరు చొప్పున, గదికి 20 మందిని మాత్రమే అనుమతించాలనే నిబంధన అమలు కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొదట్లో విద్యార్థులు పెద్దగా రాకపోవచ్చనే అభిప్రాయం ఉన్నప్పటికీ కొన్ని స్కూళ్ళల్లో తక్కువ మంది వచ్చినా సామాజిక దూరం పాటించడానికి అవసరమైన మౌలిక వసతులు లేవని చెబుతున్నారు.  

వారం వరకు కష్టమే 
ప్రభుత్వ విద్యాసంస్థలు తెరిచినా వారం వరకు పెద్దగా క్లాసులు నిర్వహించలేమని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. టీచర్లలో చాలామంది ఇప్పటికీ జలుబు, జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, వారిని ఇప్పటికిప్పుడు స్కూలుకు రమ్మనడం సరికాదని ఓ టీచర్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటింటి జ్వర సర్వేలో కూడా ప్రతి ఇంట్లో ఒకరిద్దరికి అనారోగ్య సమస్యలున్నట్టు గుర్తించారని, దీనిని బట్టి చూస్తూ మొదటి వారం రోజుల వరకు విద్యార్థుల హాజరు పెద్దగా ఉండకపోవచ్చని ప్రధానోపాధ్యాయులు అంటున్నారు. అయితే టెన్త్‌ క్లాస్‌ విద్యార్థులకు ఏప్రిల్‌లో పరీక్షలుంటాయి. వారికి సకాలంలో సిలబస్‌ పూర్తి చేయాల్సి ఉంది. అందువల్ల వీరి హాజరు మాత్రం పెరిగే వీలుందని చెబుతున్నారు.  

వర్సిటీల్లో ఆన్‌లైనే 
విశ్వవిద్యాలయాల పరిధిలో మరో వారం పాటు ఆన్‌లైన్‌ బోధనే నిర్వహించాలని ఉస్మానియా, జేఎన్‌టీయూ యూనివర్సిటీలు నిర్ణయించాయి. ఉన్నత విద్యా సంస్థల్లో చదివే వాళ్ళంతా 20 ఏళ్లు పైబడిన యువతే. వీరిలో చాలామందికి కరోనా లక్షణాలున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా వర్సిటీ క్యాంపస్‌లలోని హాస్టళ్ళకు వీరిని అనుమతిస్తే ఇతరులకు వేగంగా కరోనా వ్యాప్తి జరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో వారంపాటు ఆన్‌లైన్‌ క్లాసులు తీసుకోవాలని నిర్ణయించినట్టు ఓయూ వీసీ రవీందర్‌ తెలిపారు. 

ఎక్కువ బెంచీలు వేయడానికి గదులు సరిపోవు  
పాఠశాలల్లో కోవిడ్‌ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలనే ఆదేశాలొచ్చాయి. అయితే విద్యార్థుల హాజరు పెరిగితే నిబంధనల ప్రకారం క్లాసుకు 20 మందినే ఉంచడం సాధ్యం కాదు. ఎక్కువ బెంచీలు కావాల్సి ఉంటుంది. ఒకవేళ అవి ఉన్నా వేయడానికి తరగతి గదులు సరిపోవు. విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో హాజరైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక తప్పదు.  
 – అరుణ శ్రీ, ప్రధానోపాధ్యాయురాలు, నల్లగొండ  

మరిన్ని వార్తలు