శ్రీశైలంపై ఉమ్మడి సమ్మతి!

4 Dec, 2022 04:15 IST|Sakshi
రవికుమార్‌ పిళ్లై

విభేదాలు పక్కన పెట్టిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌

శ్రీశైలం రూల్‌కర్వ్‌పై ఏకాభిప్రాయం వ్యక్తీకరణ 

సాగర్‌ రూల్‌కర్వ్‌పై మళ్లీ సీడబ్ల్యూసీతో సంప్రదింపులు

తాగు, సాగునీటి అవసరాలు తీరాకే శ్రీశైలంలో విద్యుదుత్పత్తి

రిజర్వాయర్ల నిర్వహణ కమిటీ చివరి భేటీలో కీలక నిర్ణయాలు

సోమవారం కొనసాగనున్న సమావేశం.. ఆపై తుది నివేదిక 

సాక్షి, హైదరాబాద్‌: శ్రీశైలం జలాశయం నిర్వహణపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విభేదాలు పక్కనపెట్టి ఏకాభిప్రాయానికి వచ్చాయి. జలాశయం నిర్వహణ విధివిధానాల (రూల్‌కర్వ్‌)కు స్వల్పమార్పులతో ఉమ్మడిగా సమ్మతి తెలిపాయి. కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఆధ్వర్యంలోని రిజర్వాయర్ల నిర్వహణ కమిటీ (ఆర్‌ఎంసీ) శనివారమిక్కడ జలసౌధలో నిర్వహించిన చివరి సమావేశంలో ఈ మేరకు కీలక ముందడుగు పడింది. అయితే, నాగార్జునసాగర్‌ జలాశయం రూల్‌కర్వ్‌పై రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి.

తదుపరి మార్పుల కోసం తమ అభ్యంతరాలను కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) దృష్టికి తీసుకెళ్లాలని ఆర్‌ఎంసీ సూ­చించింది. పలు అంశాలపై ఏకాభిప్రాయం వచ్చి­నా చర్చలు సంపూర్ణం కాలేదు. ఈ నేపథ్యంలో సోమవారం సమావేశం కొనసాగించాలని నిర్ణయించారు. సోమవారం తుది నిర్ణయం తీసుకుని రెండు రాష్ట్రాల సంతకాలతో సిఫార్సులను కృష్ణా బోర్డుకు సమర్పిస్తామని ఆర్‌ఎంసీ కన్వీనర్‌ రవికుమార్‌ పిళ్లై విలేకరులకు తెలిపారు. 

జలాశయాలకు ఇక పర్మినెంట్‌ కమిటీ
సోమవారం భేటీ తర్వాత ఆర్‌ఎంసీ తదుపరి సమావేశాలు ఉండవు. ఆపై ఈ కమిటీ ఉనికిలోనే ఉండదు. జలాశయాల నిర్వహణ, విద్యుదుత్పత్తిపై పర్యవేక్షణకు రెండు రాష్ట్రాల నీటిపారుదల, విద్యుత్‌ శాఖల అధికారులతో పర్మినెంట్‌ రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ ఏర్పాటు చేయాలని కృష్ణా బోర్డుకు సిఫారసు చేయాలని ఆర్‌ఎంసీ నిర్ణయించింది. 

జల విద్యుత్‌పై తొలగిన పేచీ
శ్రీశైలం జలాశయం నిల్వల వినియోగం విషయంలో తొలుత తాగు, సాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ అవసరాలకు నష్టం కలగకుండా జలవిద్యుదుత్పత్తి జరపాలని రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. శ్రీశైలంలో నిల్వలు 854 అడుగులకు పడిపోయిన సందర్భంలో తాగు, సాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ అవసరాలు తీరిన తర్వాతే విద్యుదుత్పత్తి జరపాలి. ఇక శ్రీశైలంలో 50:50 నిష్పత్తిలో సమంగా జలవిద్యుదుత్పత్తి జరపాలని రూల్‌కర్వ్‌లోని నిబంధనలకు రెండు రాష్ట్రాలు సమ్మతి తెలిపాయి. ఈ నిబంధనలను రెండు రాష్ట్రాలు అనుసరిస్తే భవిష్యత్తులో వివాదాలు, ఇబ్బందులు ఉండవని రవికుమార్‌ పిళ్లై పేర్కొన్నారు.

శ్రీశైలంలో 200 టీఎంసీలు కావాలి
శ్రీశైలం నుంచి దిగువకు విడుదల చేసేందుకు 512 టీఎంసీలు లభ్యతగా ఉండగా, 312 టీఎంసీలను నాగార్జునసాగర్‌లో నిల్వ చేసేందుకు వీలుంది. మిగిలిన 200 టీఎంసీలను శ్రీశైలం నుంచి కృష్ణా బేసిన్‌లోని తమ ప్రాజెక్టుల అవసరాలకు వాడుకోవడానికి అవకాశం కల్పించాలని తెలంగాణ కోరినట్టు తెలిసింది.

75శాతం డిపెండబిలిటీ ఆధారంగా రెండు రాష్ట్రాలకు గరిష్ట ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకున్నట్టు రవికుమార్‌ పిళ్లై తెలిపారు. మిగుల జలాలను గుర్తించి లెక్కించే మెకానిజాన్ని ఆర్‌ఎంసీ రూపకల్పన చేసింది. తెలంగాణ సరిహద్దులోకి వచ్చే ప్రతి చుక్కనూ లెక్కించనున్నారు. వరదలు ఉన్నప్పుడు ఎంత జలాలు(మిగులు) వచ్చాయి? లేనప్పుడు(డిపెండబుల్‌) ఎంత జలాలు వచ్చాయి? అని గుర్తించి కచ్చిత లెక్కలను నమోదు చేయనున్నారు. వరద (మిగులు) జలాల వినియోగాన్ని కోటా కింద పరిగణించరు. 

ఎవరికైనా అవసరముంటే వాడుకుంటాం: సి.మురళీధర్, ఈఎన్‌సీ, తెలంగాణ నీటిపారుదల శాఖ
శ్రీశైలంలో విద్యుదుత్పత్తి, సాగునీటి అవసరాల కోసం జలాశయంలో నిల్వల నిర్వహణ, శ్రీశైలం జలాశయం రూల్‌కర్వ్‌ విషయంలో ఏపీ, తెలంగాణ ఏకాభిప్రాయానికి వచ్చాయి. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ 34 టీఎంసీలను మాత్రమే తరలించుకోవాలన్న షరతుతో మేము సమ్మతి తెలిపాం. 50:50 నిష్పత్తిలో జలవిద్యుదుత్పత్తి చేయాలని గతంలోనే ఒప్పుకున్నాం. ఎవరికైనా ఎక్కువ అవసరాలుంటే వాడుకుంటాం. 

మిగులు జలాల వాడకం లెక్కలోకి రాదు: సి.నారాయణ రెడ్డి, ఈఎన్‌సీ, ఏపీ జలవనరుల శాఖ 
శ్రీశైలం జలాల్లో తొలుత తాగునీరు, సాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ తర్వాతే విద్యుత్‌ ఉత్పత్తి జరపాలని నిర్ణయించాం. మిగులు జలాల వినియోగాన్ని లెక్కించాలి. కోటా కింద పరిగణించరాదు. శ్రీశైలం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు అన్ని జలాశయాలు నిండిన తర్వాత వృథాగా వెళ్లే జలాలనే మిగులు జలాలుగా పరిగణిస్తారు. వీటిని సాధ్యమైనంత ఎక్కువ వాడుకోవాలని నిర్ణయించాం. 

రూల్‌కర్వ్‌ అంటే...?
రిజర్వాయర్ల నిర్వహణకు స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ప్రామాణిక పద్ధతి)గా రూపొందించిందే రూల్‌కర్వ్‌. జలాశయాల్లో లభ్యత మారుతూ అన్నిసార్లు మన అవసరాలు తీరడానికి అవకాశం ఉండదు. ఎంత వ్యత్యాసం ఉంటే అందుకు తగ్గట్లు మన అవసరాలను ఎంత మేరకు కుదించుకుని నీళ్లను వాడుకోవాలి అన్న విషయం రూల్‌కర్వ్‌లో ఉంటుందని రవికుమార్‌ పిళ్లై తెలిపారు.

జలాశయాల నిర్వహణతోపాటు భద్రతకు ఇవి చాలా అవసరమన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల ముసాయిదా రూల్‌కర్వ్‌ను సీడబ్ల్యూసీ రూపొందించి రెండు రాష్ట్రాలకు పంపిందని తెలిపారు. వీటిపై రెండు రాష్ట్రాలు తమ అభిప్రాయాలను తెలపగా, వాటిపై చర్చించి తుదిరూపం ఇవ్వడానికి ఆర్‌ఎంసీ ప్రయత్నిస్తోందన్నారు.  

మరిన్ని వార్తలు