అంగన్‌వాడీ.. ఇక డిజిటల్లీ రెడీ 

28 Dec, 2021 02:06 IST|Sakshi

అంగన్‌వాడీల్లో ఇక పకడ్బందీగా చిన్నారుల ఎత్తు, బరువు కొలిచే ప్రక్రియ 

వివరాలన్నీ ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేసేలా వ్యవస్థ ఏర్పాటు 

80 శాతం లక్ష్యం సాధించిన టీచర్లకు ప్రోత్సాహకాలు  

సాక్షి, హైదరాబాద్‌: అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారుల ఆరోగ్య స్థితిని అంచనా వేసే పద్ధతిని ప్రభుత్వం మరింత పకడ్బందీ చేస్తోంది. ప్రస్తుతం నెల వారీగా పిల్లల ఎత్తు, బరువు కొలిచే ప్రక్రియ ఉన్నా అంతంతగానే జరుగుతుండటం, సర్కారుకు నివేదికలు సమర్పించే నాటికి ఆలస్యమవుతుండటంతో సాంకేతికతను వాడి ఈ జాప్యానికి చెక్‌ పెట్టాలనుకుంటోంది.

ఇకపై ప్రతి చిన్నారి ఎత్తు, బరువును నెలవారీగా తూచి వివరాలను వెబ్‌ పోర్టల్‌లో అప్‌డేట్‌ చేయాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది. దీని వల్ల పిల్లల ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు గుర్తించడంతో పాటు పౌష్టికాహార లోపాలున్న పిల్లలకు అదనపు పోషకాలు అందించే వీలుంటుందని భావిస్తోంది. 80 శాతం లక్ష్యం సాధించిన అంగన్‌వాడీ టీచర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని అనుకుంటోంది. 

వెబ్‌ పోర్టల్, యాప్‌ ద్వారా.. 
రాష్ట్రంలో 149 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. వీటిల్లో 31,711 ప్రధాన, 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో మూడేళ్లలోపు చిన్నారులు 10.34 లక్షల మంది, 3 నుంచి 6 ఏళ్ల లోపు చిన్నారులు 6.67 లక్షల మంది ఉన్నారు.

ప్రతి నెలా వీరి ఎత్తు, బరువును కొలిచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వాడబోతోంది. రాష్ట్ర స్థాయిలో వెబ్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తోంది. దీనికి అనుబంధంగా ఓ యాప్‌నూ రూపొందించనుంది.

దీని ఆధారంగా వివరాలను నమోదు చేసే వీలుంటుంది. ఇందుకోసంప్రతి అంగన్‌వాడీ టీచర్‌కు అత్యాధునిక స్మార్ట్‌ ఫోన్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 

యాప్‌లో ఏమేముంటాయ్‌? 
ఫోన్‌లో యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసి పిల్లల ఎత్తు, బరువు, వయసు వివరాలను నమోదు చేసిన వెంటనే ప్రధాన సర్వర్‌లో గణాంకాలు నిక్షిప్తమవుతాయి. పిల్లల వయసు, ఎత్తు, బరువులో తేడాలుంటే వెంటనే సూచనలు ఇస్తుంది.

దీంతో సదరు అంగన్‌వాడీ టీచర్‌ అప్రమత్తమై ఆయా చిన్నారులకు అదనపు పోషకాహారం అందించడం, వైద్యుల దృష్టికి తీసుకెళ్లే ఏర్పాటు చేసుకోవడం లాంటి అవకాశం ఉంటుంది. వచ్చే నెల నుంచి ఎత్తు, బరువు తూచే ప్రక్రియను క్రమం తప్పకుండా కొనసాగించాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ భావిస్తోంది.  అంగన్‌వాడీ టీచర్లకు ఇప్పటికే శిక్షణ, అవగాహన పూర్తయింది.    

మరిన్ని వార్తలు