విజయవాడకు మరో హైవే

19 Sep, 2021 04:01 IST|Sakshi

భారత్‌మాల పరియోజన పథకంలో భాగంగా నిర్మాణం 

మంచిర్యాల–వరంగల్‌–ఖమ్మం మీదుగా నాలుగు వరుసల రోడ్డు  

ఇది పూర్తి కొత్త రోడ్డు.. 310 కి.మీ. మేర రూ.7,612 కోట్లతో పనులు 

2023 నాటికి అందుబాటులోకి 

కొత్త జాతీయ రహదారికి ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ–విజయవాడ మధ్య మరో కొత్త జాతీయ రహదారి నిర్మాణం కాబోతోంది. పాత రోడ్లతో సంబంధం లేకుండా పూర్తి కొత్తగా నిర్మించబోతున్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ మీదుగా రూపుదిద్దుకుంటున్న జాతీయ రహదారికి కొనసాగింపుగా మంచిర్యాల నుంచి ఈ కొత్త రోడ్డు మొదలై విజయవాడ వరకు సాగుతుంది. నాలుగు వరుసలు  ఉండే ఈ జాతీయ రహదారి మన రాష్ట్రం పరిధిలో 310 కి.మీ. మేర ఉంది.

దేశంలోని అన్ని రాష్ట్రాలు, ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ భారత్‌మాల పరియోజన పథకానికి కేంద్రం రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. ఇందులోభాగంగా, కొన్ని ప్రాంతాల్లో ఉన్న జాతీయ రహదారులనే అనుసంధానిస్తుండగా, వీలుపడని చోట్ల పూర్తిగా కొత్త రోడ్లను నిర్మిస్తున్నారు. వరంగల్‌ నుంచి ఖమ్మం మీదుగా విజయవాడకు రైల్వేలైన్‌ ఉన్నట్టుగా రోడ్డు మార్గం సౌకర్యవంతంగా లేదు. దీంతో పాతరోడ్లను వదిలేసి పూర్తిగా కొత్తరోడ్డును నిర్మించాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్ణయించింది.

ఈ క్రమంలో ఉత్తరభారతం నుంచి ప్రారంభమయ్యే రోడ్డు నాగ్‌పూర్‌ మీదుగా తెలంగాణలోని మంచిర్యాల–వరంగల్‌–ఖమ్మం–విజయవాడ మీదుగా దక్షిణంలోని దిగువభాగానికి చేరుతుంది. మంచిర్యాలకు ముందు కొంత పాత జాతీయ రహదారిని అనుసంధానిస్తూ మిగతా చోట్ల కొంత కొత్త రోడ్డును నిర్మిస్తున్నారు. మంచిర్యాల నుంచి పూర్తిగా కొత్త రోడ్డు అయినందున ఏకంగా 1,450 హెక్టార్ల భూమిని సమీకరిస్తున్నారు. ఇతరత్రా ప్రక్రియలకు ఆరు నెలలు పడుతుందని, ఆ తర్వాత పనులు ప్రారంభించి 24 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. కేంద్ర ఉపరితల రవాణాశాఖ 2023 నాటికి రోడ్డు సిద్ధమవుతుందని చెబుతోంది.  

హైదరాబాద్‌పై తగ్గనున్న భారం 
విజయవాడకు రోడ్డు మార్గాన వెళ్లాలంటే ఎక్కువ మంది హైదరాబాద్‌ మీదుగానే సాగుతున్నారు. దీంతో ఆ రోడ్డుపై విపరీతంగా ట్రాఫిక్‌ పెరుగుతోంది. ప్రత్యామ్నాయంగా మెరుగైన మరో మార్గం లేకపోవటంతో దూరప్రాంతాల నుంచి వచ్చేవారికి ప్రయాణ సమయం పెరుగుతోంది. ఈ కొత్త రోడ్డు అందుబాటులోకి వస్తే కొన్నిప్రాంతాల ట్రాఫిక్‌ హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేకుండా వరంగల్‌ మీదుగా సాగిపోవచ్చు.  

స్వరూపం ఇలా
రాష్ట్రంలో రోడ్డు నిడివి: 310 కి.మీ 
సేకరించే భూమి: 1,450 హెక్టార్లు 
మొత్తం వ్యయం అంచనా: రూ.7,612 కోట్లు 
ఇందులో భూసేకరణ ఖర్చు రూ.1,078 కోట్లు 
వంతెనలు: 181 (అందులో పెద్దవి 10) 

ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ 
సాక్షి, న్యూఢిల్లీ: నాగ్‌పూర్‌–విజయవాడ కారిడార్‌లో భాగంగా మంచిర్యాల–విజయవాడ మధ్య కొత్త జాతీయ రహదారికి ముసాయిదా నోటిఫికేషన్‌ జారీచేసినట్టు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్‌ చేశారు. గ్రీన్‌ఫీల్డ్‌ అలైన్‌మెంట్‌ ద్వారా జాతీయ రహదారిని అభివృద్ధి చేయనున్నట్టు వెల్లడించారు. అలాగే ఏపీలోని అమలాపురం నుంచి పలివెల మీదుగా రావులపాలెం వరకు ఉన్న రహదారిని, పెడన నుంచి విస్సన్నపేట మీదుగా లక్ష్మీపురం వరకు ఉన్న మార్గాన్ని కొత్త జాతీయ రహదారులుగా ప్రకటిస్తూ ముసాయిదా జారీచేసినట్టు చెప్పారు.  

మంచిర్యాల–వరంగల్‌ మధ్య..
నిడివి: 112 కి.మీ. ఖర్చు: రూ.2,500 కోట్లు 
సేకరించే భూమి: 589 హెక్టార్లు 
పరిధి: మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్‌ జిల్లాలు 
ప్రధాన పట్టణాలు: మంచిర్యాల, మంథని, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, వరంగల్, పర్కాల, ఆత్మకూరు, శాయంపేట, దామెర 

వరంగల్‌–ఖమ్మం మధ్య  
నిడివి: 107 కి.మీ., ఖర్చు: రూ. 2,250 కోట్లు 
సేకరించే భూమి: 568 హెక్టార్లు 
పరిధి: వరంగల్, మహబూబాబాద్, 
ఖమ్మం జిల్లాలు 
ముఖ్య పట్టణాలు: ఊరుగొండ, గీసుగొండ, మచ్చాపూర్, సంగ్యెం, నెక్కొండ, పర్వతగిరి, వెంకటయ్యపాలెం 

ఖమ్మం–విజయవాడ 
నిడివి 91 కి.మీ., ఖర్చు: రూ.1,820 కోట్లు 
సేకరించే భూమి: 295 హెక్టార్లు 
పరిధి: ఖమ్మం, కృష్ణా జిల్లాలు 
ముఖ్య ప్రాంతాలు: సిరిపురం, తునికిపాడు, ఆత్కూరు, రెమిడిచెర్ల, దుగ్గిరాలపాడు, జక్కంపూడి  

మరిన్ని వార్తలు