పోలీసింగ్‌లో తెలంగాణ ‘స్మార్ట్‌’

19 Nov, 2021 05:29 IST|Sakshi

స్మార్ట్‌ పోలీసింగ్‌ సూచీలో రెండో స్థానంలో రాష్ట్రం 

11 అంశాలపై దేశవ్యాప్తంగా ఐపీఎఫ్‌ సర్వే 

తొలిస్థానంలో ఏపీ 

ఢిల్లీలో నివేదిక విడుదల  

సాక్షి, హైదరాబాద్‌/న్యూఢిల్లీ: తెలంగాణ పోలీసులకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కింది. పోలీసింగ్‌లో టాప్‌లో నిలిచింది. దేశంలో ఎంపిక చేసిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో స్మార్ట్‌ పోలీసింగ్‌ విధానాల అమలుపై ప్రతిష్టాత్మక ఇండియన్‌ పోలీసు ఫౌండేషన్‌ (ఐపీఎఫ్‌) సంస్థ సమగ్ర సర్వే నిర్వహించింది. మొత్తం 11 అంశాలపై చేసిన ఈ సర్వేలో తెలంగాణకు ఐదింటిలో మొదటి స్థానం, మరో ఐదింటిలో రెండో స్థానం లభించింది.

కేవలం ఒక్క దాంట్లో మూడో స్థానం వచి్చంది. ఈ నివేదికను ఫౌండేషన్‌ చైర్మన్‌గా ఉన్న ఉత్తరప్రదేశ్‌ మాజీ డీజీపీ ప్రకాష్‌ సింగ్‌ గురువారం ఢిల్లీలో విడుదల చేశారు. అస్సాం, బీఎస్‌ఎఫ్‌లకూ డీజీగా పని చేసిన ఈయన గతంలో పోలీసు సంస్కరణలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీకి నేతృత్వం వహించారు. ఈ సర్వేలో మొత్తం 1,61,192 నమూనాలు సేకరించి విశ్లేంచారు. అవసరమైన స్థాయిలో, సంతృప్తికరంగా నమూనాలు రాని నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను దీని ఫలితాల్లో చేర్చలేదు.

ఆయా అంశాలన్నీ కలిసి పది పాయింట్లకుగాను ఐపీఎఫ్‌ స్మార్ట్‌ పోలీసింగ్‌ సూచీ–2021లో 8.11 స్కోరుతో ఏపీ తొలిస్థానంలో, 8.10 స్కోరుతో తెలంగాణ రెండో స్థానంలో నిలిచాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల పోలీస్‌ వ్యవస్థ పనితీరు బాగుందని నివేదిక ప్రశంసించింది. 

2014లో దిశానిర్దేశం చేసిన మోదీ 
దేశంలో స్మార్ట్‌ పోలీసింగ్‌ విధానాలు అమలుకావాలని, జవాబుదారీతనం, పాదర్శకత, అవినీతిరహితంగా ఇవి సాగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో దిశానిర్దేశం చేశారు. ఆ సంవత్సరం గువాహటిలో జరిగిన డీజీపీల కాన్ఫరెన్స్‌లో ఈ లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇది జరిగి ఏడేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఏ మేరకు లక్ష్యసాధన జరిగిందో తెలుసుకోవడానికి ఐపీఎఫ్‌ ఈ సర్వే నిర్వహించింది. ఇందులో ఐపీఎఫ్‌ ప్రతినిధులు ప్రజలను రెండు వర్గాలుగా విభజించి నమూనాలు సేకరించారు.

ఇప్పటికే పోలీసులను ఆశ్రయించడం లేదా వారితో సంబంధాలు కలిగి ఉన్న వారితోపాటు ఇప్పటివరకు ఈ రెండూ చేయని వారి నుంచీ నమూనాలు సేకరించారు. శుక్రవారం నుంచి లక్నోలో ఈ సంవత్సరానికి సంబంధించిన డీజీపీల సదస్సు ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం ఫలితాలు విడుదల చేశారు. ఈ సర్వే నేపథ్యంలో స్మార్ట్‌ పోలీసింగ్‌కు, పోలీసులపై ప్రజలకు ఉన్న నమ్మకానికి మధ్య అవినాభావ సంబంధం ఉన్నట్లు గుర్తించారు.

స్మార్ట్‌ పోలీసింగ్‌లో ఉత్తమ స్కోర్‌ సాధించిన రాష్ట్రానికి ప్రజల నమ్మకం పొందడంలోనూ అదే స్థాయి ఫలితాలు రావడం దానికి నిదర్శనమని ఐపీఎఫ్‌ పేర్కొంది. తమ సర్వే నమూనాలో ఇచి్చన చిరునామాకు 25,671 సలహాలు, సూచనలు వచ్చాయని, వాటిని విశ్లేíÙస్తున్నామని తెలిపింది.  

తెలంగాణలో ఇలా..
పోలీసుల సున్నితత్వంలో 8.27 స్కోరుతో, ప్రజలతో సత్ప్రవర్తన (8.14), సౌలభ్యం (8.29), పోలీసుల స్పందన (8.28), టెక్నాలజీ వినియోగం (8.17) అంశాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో 8.08 స్కోరుతో, స్మార్ట్‌ పోలీసింగ్‌ (8.10)లో, నిష్పాక్షిక పోలీసింగ్‌ (7.97)లో, జవాబుదారీతనం (7.95)లో, పోలీసులపై ప్రజల నమ్మకం (8.07)లో రెండోస్థానంలో, అవినీతిరహిత సేవల అంశంలో 7.78 స్కోరుతో మూడో స్థానంలో నిలిచింది.

ఏపీలో ఇలా..
మొత్తం 11 అంశాలకుగాను ఏపీ మూడింటిలో మొదటి స్థానంలో నిలిచింది. స్మార్ట్‌ పోలీసింగ్‌లో 8.11 స్కోర్‌తో, జవాబుదారీతనంలో 8 స్కోర్‌తో, పోలీసులపై ప్రజల నమ్మకంలో 8.15 స్కోర్‌తో తొలిస్థానంలో నిలిచింది. ప్రజలతో స్రత్పవర్తనలో 8.14 స్కోరుతో రెండు తెలుగు రాష్ట్రాలు పట్టికలో పైభాగాన నిలిచాయి.   

మరిన్ని వార్తలు