తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బూర్గుల కన్నుమూత

19 Jan, 2021 05:05 IST|Sakshi
నర్సింగరావు (ఫైల్‌)

జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు

ప్రముఖుల సంతాపం

21న మఖ్దూం భవన్‌లో సీపీఐ సంతాప సభ

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, మేడ్చల్‌ జిల్లా: స్వాతంత్య్ర సమర యోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకుడు బూర్గుల నర్సింగరావు (89) సోమవారం తెల్లవారుజామున కేర్‌ ఆసుపత్రిలో కన్నుమూశారు. గుం డె సంబంధిత సమస్యలతో పాటు కరోనాకు చికిత్సకోసం వారం క్రితం ఆయనను హైదరాబాద్‌ కేర్‌ ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచా రు. జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో సోమవారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. బూర్గుల నర్సింగరావు విద్యార్థి దశలో ఆల్‌ హైదరాబాద్‌ స్టూడెంట్‌ యూనియన్‌ మొదటి అధ్యక్షుడిగా పనిచేశారు. సీపీఐ హైదరాబాద్‌ జిల్లాకమిటీ సభ్యుడిగా కీలకపాత్ర పోషించారు. ముంబైలోని సీపీఐ కార్యాలయంలో కూడా ఆయన పని చేశారు.

అలాగే తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు అధ్యక్షుడిగా పని చేశారు. హైదరాబాద్‌ స్టేట్‌ తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు సోదరుడు బి.వెంకటేశ్వరరావు కుమారుడే నర్సింగరావు. 1932 మార్చి14న ఉమ్మడి మహబూబ్‌నగర్‌జిల్లా షాద్‌నగర్‌ సమీపంలోని బూర్గుల గ్రామంలో స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబంలో ఆయన జన్మించారు. రజాకార్ల వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నందుకు అరెస్టయి చంచల్‌గూడ జైలుకు వెళ్లారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. 1952లో జరిగిన ముల్కీ ఉద్యమంలో ముందుండి పోరాడారు. 1955లో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్‌) మొదటి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై 1959 వరకు బాధ్యతలు నిర్వహించారు. సొంతూరు బూర్గులలో రైల్వేస్టేషన్‌ ఏర్పాటులో కీలకపాత్ర పోషిం చారు. ఊర్లో స్కూల్‌ స్థాపనకు భూమిని విరాళంగా ఇచ్చారు. ఆయనకు భార్య డాక్టర్‌ మంజూత, కుమార్తె మాళవిక, కుమారులు అజయ్, విజయ్‌లున్నారు.

సీఎం సంతాపం
తెలంగాణ పోరాట యోధుడు బూర్గుల నర్సింగరావు మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో పాటు, తొలి.. మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల్లో నర్సింగరావు పాత్ర మరువలేనిదని ముఖ్యమంత్రి అన్నారు. ఆయన మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని పేర్కొన్నారు. బూర్గుల కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మంత్రులు, ప్రముఖుల సంతాపం
బూర్గుల మృతి పట్ల మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు సంతాపం ప్రకటించారు. అలాగే సీపీఐ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, కె.నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి, అజీజ్‌ పాషా, పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, తెలంగాణ అమరవీరుల ట్రస్టు కార్యదర్శి కందిమల్ల ప్రతాపరెడ్డి, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం సంతాపం తెలిపారు. ఈ నెల 21న మఖ్దూంభవన్‌లో సంతాప సభ నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర సమితి ప్రకటించింది.


బూర్గుల భౌతికకాయం వద్ద నివాళులర్పిస్తున్న సీపీఐ నేత నారాయణ, (ఇన్‌సెట్‌)

మరిన్ని వార్తలు