తెలంగాణ: 1,034 కేంద్రాలు.. 50,000 టీకాలు

19 Jan, 2021 01:23 IST|Sakshi

నేడు కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వడానికి ఏర్పాట్లు పూర్తి.. 

వేగం పుంజుకున్న టీకా కార్యక్రమం

జిల్లాలకు మరో 1.70 లక్షల డోసులు తరలింపు

పరిష్కారం కాని కోవిన్‌ యాప్‌ సమస్య

సాక్షి, హైదరాబాద్‌: వ్యాక్సినేషన్‌ వేగం పుంజుకుంది. మంగళవారం నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కరోనా టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ చేపట్టాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. 1,034 ప్రభుత్వ కేంద్రాల్లో టీకాలను పంపిణీ చేయడానికి సన్నాహాలు చేసింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఆ ప్రకారం ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆ శాఖ కార్యదర్శి రిజ్వీ ఆదేశాలు జారీచేశారు.

దీంతో ఒక్కో కేంద్రంలో వందమందికి చొప్పున టీకా వేస్తామని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు కరోనా వ్యాక్సినేషన్‌ బులెటిన్‌లో తెలిపారు. దాని ప్రకారం లక్ష మందికి టీకా వేయాల్సి ఉంది. కానీ కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని టీకా సెంటర్లలో అంతమంది సిబ్బంది ఉండబో రని, కాబట్టి సరాసరిగా అన్ని సెంటర్లలో కలిపితే దాదాపు 50 వేల మందికిపైగా టీకా వేస్తామని ఆయన ‘సాక్షి’కి వివరించారు. మంగళవారం నుంచి వెయ్యికి పైగా ఉన్న కేంద్రాల్లో ఒక్కోచోట 100 మంది లక్ష్యంగా టీకాలు వేయాలని అనుకున్నట్లు ఆయన తెలిపారు.  చదవండి: (‘ఢోకా’లేని ‘టీకా’ ఇదే అయితే..?!)

జిల్లాలకు 1.70 లక్షల డోసులు..
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బంది మొత్తంగా 3.30 లక్షల మంది ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1.40 లక్షలమంది, ప్రైవేటు ఆసుపత్రుల్లో 1.90 లక్షల మంది ఉన్నారు. వీరికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు 3.84 లక్షల టీకాలు రాష్ట్రానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అందులో ఇప్పటికే అన్ని జిల్లా కేంద్ర కోల్డ్‌ చైన్‌ కేంద్రాలకు 62 వేల వ్యాక్సిన్లను పంపించారు. తాజాగా మరో 1.70 లక్షల టీకాలను తరలిస్తున్నారు. కోఠిలోని స్టేట్‌ వ్యాక్సిన్‌ సెంటర్‌ నుంచి జిల్లాలకు, అక్కడి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని 866 కోల్డ్‌ చైన్‌ సెంటర్లకు తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 21, 22 తేదీల్లో రాష్ట్రానికి మరో 3.5 లక్షల కరోనా టీకాలు వస్తాయని టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ వర్గాలు తెలిపాయి. ఆ టీకాలను ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యసిబ్బందికి ఇస్తామని తెలిపారు. చదవండి: (డీఎన్‌ఏ పరీక్షకు నేను సిద్ధం.. కేసీఆర్‌ సిద్ధమా?)  

రెండోరోజు 82 శాతం మందికి టీకా...
సోమవారం 335 కేంద్రాల్లో టీకా కార్యక్రమం చేపట్టారు. ప్రతి కేంద్రంలో 50 మంది చొప్పున 16,750 మంది టీకా వేయాలని నిర్ణయించగా, 13,666 మందికి వేసినట్లు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. అంటే 82 శాతం మందికి టీకా వేసినట్లు పేర్కొన్నారు. గద్వాల జిల్లాలో 250 మంది లబ్ధిదారుల్లో అందరికీ మధ్యాహ్నానికే వేసినట్లు వెల్లడించారు. ఇక 1,821 మంది ఆర్మీలోని వైద్య సిబ్బందికి, 595 మంది రైల్వే వైద్య సిబ్బందికి కూడా టీకాలు వేసినట్లు వెల్లడించారు. రెండు రోజుల టీకాల పంపిణీ సరాసరి 84 శాతంగా ఉన్నట్లు శ్రీనివాసరావు తెలిపారు.

కాగా రెండో రోజు 15 మంది స్వల్ప అస్వస్థతకు గురయ్యారన్నారు. ఈ రెండ్రోజుల్లో ఎలాంటి సీరియస్‌ కేసులు నమోదుకాలేదని, కొద్దిపాటి సైడ్‌ ఎఫెక్ట్స్‌‌ వచ్చినవారికి వైద్యసేవలు అందించామని పేర్కొన్నారు. వారంతా సురక్షితంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో కోవిన్‌ యాప్‌ సాంకేతిక సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. అనేకచోట్ల యాప్‌ మొరాయిస్తుండటంతో అధికారులు మాన్యువల్‌ పద్ధతిలో లబ్ధిదారుల వివరాలను రాసుకొని తర్వాత వాటిని యాప్‌లో పొందుపరుస్తున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.  

మరిన్ని వార్తలు