పీవీకి భారతరత్న పురస్కారం.. సభ ఏకగ్రీవ తీర్మానం

9 Sep, 2020 02:23 IST|Sakshi

సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన అసెంబ్లీ

కాంగ్రెస్, బీజేపీ మద్దతు...ఏకగ్రీవ ఆమోద ప్రకటన చేసిన స్పీకర్‌

పీవీ దార్శనికతను కొనియాడిన కేసీఆర్‌

అసెంబ్లీలో పీవీ విగ్రహం: స్పీకర్‌ పోచారం 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముద్దుబిడ్డ, భారత మాజీ ప్ర«ధాన మంత్రి పాములపర్తి వెంకట నరసింహారావుకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని రాష్ట్ర అసెంబ్లీ కోరింది. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. మంగళవారం సభ ప్రారంభం కాగానే పీవీకి భారతరత్న పురస్కారం ఇవ్వాలని, పార్లమెంటులో ఆయన విగ్రహాన్ని పెట్టాలని, హైదరా బాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టి స్వల్ప కాలిక చర్చను ప్రారంభించారు. పీవీ దార్శనికతను కొనియాడుతూ ఆయనకు భారతరత్న ఇవ్వాల్సిన ఆవశ్యకతను ఉటంకిస్తూ ప్రసంగించారు. అనంతరం కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీల తరఫున మల్లు భట్టి విక్రమార్క, కేటీఆర్, సత్యవతి రాథోడ్, రాజాసింగ్, గంగుల కమలాకర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, రాజయ్య, శ్రీధర్‌ బాబు, శ్రీనివాస్‌గౌడ్, రెడ్యానాయక్‌లు ప్రసంగించి సీఎం ప్రవేశపెట్టిన తీర్మా నానికి మద్దతు తెలిపారు. ఎంఐఎం తరఫున ఎవరూ చర్చలో పాల్గొనలేదు. తీర్మానానికి అన్ని పార్టీలు మద్దతి వ్వడంతో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమో దించినట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. అనంతరం సభను బుధవారానికి వాయిదా వేశారు.

తీర్మాన ప్రసంగంలోసీఎం ఏమన్నారంటే...
‘దేశ ప్రధాని కాగలిగే అవకాశం చాలా తక్కువ మందికి లభించే గొప్ప అవకాశం. వ్యక్తిగత ప్రతిభ, అకుంఠిత దీక్ష ద్వారా మంచి కార్యసాధకుడిగా పేరు తెచ్చుకున్న తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు ఈ పదవి దక్కింది. కానీ ఆయనకు లభించాల్సిన మర్యాద లభించలేదనే బాధ, వెలితి తెలంగాణ బిడ్డలకు ఉంది. అందులో సందేహం లేదు. దానికి బాధ్యులెవరూ, మంచి, చెడు గురించి మాట్లాడుకునే సందర్భం కాదు. పీవీ శతజయంతి ఉత్సవల సందర్భంగా తెలంగాణ ఠీవీ.. మన పీవీ అని చెప్పుకుంటున్న సమయంలో ఆయనకు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ డిమాండ్‌ చేస్తూ ఈ తీర్మానాన్ని పెడుతున్నాం. అపార రాజనీతిజ్ఞతకు పర్యాయపదంగా నిలిచిన మేధోసంపన్నుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు. నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి సంపన్న భారతదేశం రూపొందడానికి బాటలు నిర్మించిన అసాధారణ నేతగా, స్థితప్రజ్ఞుడిగా ఆయన చిరకీర్తిని పొందారు. పీవీ శతజయంతి దేశ చరిత్రలో ఒక విశిష్ట సందర్భం. తెలంగాణ అస్తిత్వ ప్రతీక, ఆత్మగౌరవ పతాక అయిన పీవీ శతజయంతి ఉత్సవాలను ఏడాదిపాటు నిర్వహించడానికి ప్రభుత్వం సÜంకల్పించి జూన్‌ 28న జ్ఞానభూమిలో ఘనంగా ప్రారంభోత్సవాన్ని నిర్వహించింది. ఈ ఉత్సవాల నిర్వహణ ద్వారా ఆయన దేశానికి చేసిన సేవలను ప్రజలంతా స్మరించుకునేలా చేయాలని ప్రభుత్వం ఆశిస్తోంది.

మూలకారకుడు పీవీ...
ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్‌ నిలవడానికి, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా పురోగమించడానికి మూలకారకుడు పీవీ. దేశ ప్రధాని పదవిని అధిష్టించిన మొట్టమొదటి దక్షిణ భారతీయుడిగా, తెలంగాణ ముద్దుబిడ్డగా ఆయన చరిత్ర çసృష్టించారు. అందుకే ఇది పీవీ మన ఠీవి అని తెలంగాణ సగర్వంగా చాటుకుంటున్న సందర్భం. ఆధునిక భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన నాయకులు ఇద్దరే ఇద్దరు. ఒకరు మోడరన్‌ ఇండియా నిర్మాత జవహర్‌ లాల్‌ నెహ్రూ.. రెండో నేత గ్లోబల్‌ ఇండియా నిర్మాత పీవీ. ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో దేశం సమస్యల సుడిగుండంలో చిక్కి సతమతమయ్యేది. కాలానుగుణంగా ఆర్థిక దృక్పథంలో మార్పులు తేవాల్సిన ప్రత్యేక పరిస్థితుల్లో దేశం ఉంది. మైనారిటీలో ఉన్న ప్రభుత్వానికి సారథ్యం వహిస్తూ రాజకీయ స్థిరత్వాన్ని నెలకొల్పాలి. కాలం విసిరిన ఇన్ని సవాళ్ల నడుమ తనదైన దార్శనికతతో పీవీ ధైర్యంగా ముందడుగు వేశారు. నూతన ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి అత్యంత సాహసోపేతంగా, వేగంగా, చాకచక్యంగా, సమర్థంగా అమలు చేశారు.

ఆయన దార్శనికతే కారణం
భారతీయ మేధావులు విదేశాల్లో ఉన్నతోద్యోగాలు చేస్తున్నారన్నా... దేశానికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు భారీగా సమకూరాయన్నా... దేశానికి ప్రపంచం నలుదిక్కుల నుంచీ పెట్టుబడులు తరలి వస్తున్నాయన్నా... స్వదేశీ కంపెనీలు విదేశీ కంపెనీలను కొనే స్థాయికి ఎదిగాయన్నా... ప్రభుత్వరంగ సంస్థల్లో సైతం పోటీతత్వం పెరిగిందన్నా... ప్రైవేటు రంగంలో ఉపాధి పెరిగిందన్నా... సగటు భారతీయుని జీవనశైలి ఎంతో మారిందన్నా.... వీటన్నిటి వెనకా పీవీ దార్శనికత ఉంది. ఆయన సంస్కరణలనే మొక్కలు నాటితే ప్రస్తుతం మనం వాటి ఫలాలు అనుభవిస్తున్నాం. అందుకే ఆయన నూతన ఆర్థిక విధానాల విధాత, గ్లోబల్‌ ఇండియాకు రూపశిల్పి. విదేశాంగ విధానంలో మేలి మలుపులు పీవీ దౌత్యనీతి ఫలితమే. ‘లుక్‌ ఈస్ట్‌ పాలసీ’ప్రవేశపెట్టి సింగపూర్, మలేసియా, ఇండోనేసియా వంటి ‘ఏషియన్‌ టైగర్స్‌’కి భారత్‌ను చేరువ చేసి వ్యాపారాభివృద్ధికి దోహదం చేసింది ఆయన దూరదృష్టే. ఇప్పుడు ఆ విధానాన్నే ‘యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీ’గా కొనసాగిస్తున్నారు. చైనాతో సరిహద్దు సమస్యను పక్కనపెట్టి వాణిజ్య సంబంధాలు పెంపొందించుకోవాలని ప్రతిపాదించి, బీజింగ్‌ వెళ్లి ఒప్పందం కుదుర్చుకొని వచ్చింది పీవీనే. దాదాపు మూడు దశాబ్దాలు భారత్‌–చైనా సరిహద్దు ప్రశాంతంగా ఉండటానికి పీవీ దౌత్యమే కారణం. రెండో అణు పరీక్షకు రంగం సిద్ధం చేసిన దక్షత కూడా పీవీదే.

భూస్వామ్య కుటుంబంలో పుట్టిన ఆయన భూ సంస్కరణలకు నాంది పలికారు. దేశంలో భూ సంస్కరణలను అత్యంత నిజాయితీగా అమలు చేసిన ముఖ్యమంత్రి ఆయన. భూ సంస్కరణలను చిత్తశుద్ధితో అమలు చేసినందుకు, ముల్కీ రూల్స్‌ను సమర్థించినందుకు ఆయన్ను సీఎం పదవి నుంచి తప్పించారు. అయినా పీవీ చలించలేదు. అనన్య సామాన్యమైన మేధో సంపత్తి, సామాజిక సమస్యలపై లోతైన అవగాహన ఉన్న పీవీ... విద్యా మంత్రిగా గురుకుల పాఠశాలలు ప్రారంభించారు. కేంద్రంలో మానవవనరుల శాఖ మంత్రిగా నవోదయ పాఠశాలలు నెలకొల్పారు. ఈ విద్యాలయాలు గ్రామీణ విద్యార్థులకు నేటికీ ఉచితంగా ఉన్నత ప్రమాణాల విద్యను అందిస్తున్నాయి. ఇక్కడ శిక్షణ పొందిన వారెందరో ఉన్నతస్థాయి పదవులు పొందారు. ఉన్నత ఉద్యోగాలలో రాణించారు. అన్ని కోర్సుల అకడమిక్‌ పుస్తకాలన్నీ తెలుగులో లభించాలనే ఉద్దేశంతో తెలుగు అకాడమీని పీవీ నెలకొల్పారు. పీవీ వ్యక్తిత్వం ఒక సహస్రదళ పద్మం. అనేక కోణాలున్న సమున్నత వ్యక్తిత్వం. భారతీయ భాషలతోపాటు ఇంగ్లిష్, ఫ్రెంచ్‌ వంటి విదేశీ భాషలలోను అనర్గళంగా ప్రసంగించగలిగిన మహాపండితుడు. రాజకీయాల్లో మునిగి తేలుతూనే కవి సామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ రచించిన ’వేయి పడగలు’బృహన్నవలను హిందీలోకి సహస్ర ఫణ్‌ పేరుతో అనుసృజించారు. ఎన్నో కథలు, పద్యాలు, గేయాలు, నవలికలు రాశారు. చిన్న గ్రామంలో పుట్టి విద్యార్థి దశలోనే నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమించి ఓయూ నుంచి బహిష్కరణకు గురైనా పీవీ వెరవలేదు. మహారాష్ట్ర వెళ్లి నాగపూర్, పుణెలో ఇంటర్, బీఎస్సీ, లా డిగ్రీలలో అత్యున్నత శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యారు. పేదలపట్ల సానుభూతి, ప్రయోగశీలత, పార్టీపట్ల, ఆదర్శాలపట్ల అంకితభావంతో ఉన్న ఆయన రాజీవ్‌గాంధీ హత్యానంతరం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడై ప్రధానిగా సర్వోన్నత పదవిని అధిష్టించారు. అటువంటి మహనీయుడికి, తెలంగాణ ముద్దుబిడ్డకు, ప్రపంచ మేధావికి, బహుభాషావేత్తకు, అపర చాణక్యుడికి, ప్రగతిశీలికి, సంపన్న భారత నిర్మాతకు జాతిరత్నమై భాసిల్లిన నాయకునికి భారతరత్న పురస్కారం ఇచ్చి భారతజాతి తనను తాను గౌరవించుకోవాలి. ఇప్పటికే ఆలస్యమైంది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రకటించడం సముచితంగా ఉంటుంది.’

తీర్మానం ఇదే..
’తెలంగాణ బిడ్డ, దక్షిణాది నుంచి తొలిసారి ప్రధాని పదవికి ఎన్నికైన రాజనీతిజ్ఞుడు, నూతన ఆర్థిక సంస్కరణల సారథి, అరుదైన దౌత్యనీతి కోవిదుడు, బహుభాషావేత్త, దేశ ప్రగతికి ఉజ్వల దారులు నిర్మించిన మహోన్నత దార్శనికుడు, భారత రాజకీయాల్లో మేరునగధీరుడు, అసాధారణ ప్రజ్ఞాశాలి పాములపర్తి వెంకట నరసింహారావు గారికి మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రకటించాలని, పార్లమెంటు ప్రాంగణంలో ఆ మహనీయుని విగ్రహాన్ని, చిత్తరువునూ ప్రతిష్టించాలని, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నది’అని సీఎం కేసీఆర్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. కాగా, కేసీఆర్‌ సూచన మేరకు శాసనసభ ప్రాంగణంలో పీవీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు స్పీకర్‌ పోచారం ప్రకటించారు.

మండలిలోనూ ఏకగ్రీవంగా ఆమోదం
పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనకు భారతరత్న ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర శాసనమండలి సైతం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. సీఎం కేసీఆర్‌ తరఫున వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టి పీవీ దార్శనికతను కొనియాడారు. ఆ తర్వాత ఎమ్మెల్సీలు టి. జీవన్‌రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, పురాణం సతీష్, భానుప్రసాద్, నారదాసు లక్ష్మణరావు ప్రసంగించారు. నెక్లెస్‌ రోడ్డుకు ‘పి.వి. నరసింహారావు నెక్లెస్‌ రోడ్డు’గా నామకరణం చేయాలని, పదో తరగతి పాఠ్యాంశాల్లో పీవీపై ఒక చాప్టర్‌ను పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం ఈ తీర్మానాన్ని మండలి ఏకగ్రీవంగా ఆమోదించినట్లు మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రకటించారు.  

మరిన్ని వార్తలు