షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు: కిషన్‌ రెడ్డి

9 Sep, 2023 08:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలతోపాటే రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఉంటాయనే భ్రమల్లో ఎవరూ ఉండొద్దని.. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు వేర్వేరుగానే జరుగుతాయని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను, బీఆర్‌ఎస్‌ను ఓడించాలనే కసి, పట్టుదల బీజేపీ నాయకులు, కార్య కర్తల్లో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.

బీఆర్‌ఎస్‌తో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి ఎలాంటి పొత్తు ఉండబోదని చెప్పారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాల యంలో జరిగిన బీజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నేతల సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. బీఆర్‌ఎస్‌–బీజేపీ మధ్య స్నేహం లేదని, ఉండబోదని.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటేనని క్షేత్రస్థాయిలో ప్రచారం చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

పార్టీలో మార్పు కనిపిస్తోంది..
గతంలో తాను ఉమ్మడి ఏపీ బీజేపీ ఇన్‌చార్జిగా ఉన్నప్పటికి, ఇప్పుడున్న పార్టీకి ఎంతో మార్పు కనిపిస్తోందని రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి, ఎంపీ ప్రకాశ్‌ జవదేకర్‌ చెప్పారు. బీఆర్‌ఎస్‌పై పోరాడి కచ్చితంగా గెలుపొందాలనే పట్టుదల బీజేపీ శ్రేణుల్లో కనిపిస్తోందన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కావని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షా ఇప్పటికే స్పష్టం చేశారని.. ఈ విషయాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

వివిధ అంశాలపై ఆందోళనలు, నిరసనలు
పదాధికారుల భేటీలో తీసుకున్న నిర్ణయాల మేర కు.. సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయ నిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ నెల 11న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తారు. నిరుద్యోగుల సమస్యలపై ఈ నెల 13న ఉదయం 11 గంటల నుంచి 14న ఉదయం వరకు 24 గంటల పాటు ఇందిరా పార్క్‌ దగ్గర నిరసన దీక్ష చేపడతారు. 15వ తేదీన తెలంగాణ సాయుధ పోరాట వీరులను స్మరిస్తూ అన్ని మండల కేంద్రాల్లో బైక్‌ ర్యాలీలు నిర్వహిస్తారు.

అదే రోజున కిషన్‌రెడ్డి నాయకత్వంలో సికింద్రాబాద్‌ క్లాక్‌ టవర్‌ నుండి పరకాల అమరధామం వరకు బైక్‌ ర్యాలీ చేపట్టి.. అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈనెల 17న ఉదయం హైదరాబాద్‌ విమోచన దినో త్సవం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పోలింగ్‌బూ త్‌ కేంద్రాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. ఆ రోజున పరేడ్‌ గ్రౌండ్స్‌లో అమిత్‌ షా ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం, బహిరంగ సభ నిర్వహి స్తారు.

ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 17 నుంచి అక్టోబర్‌ 2 వరకు సేవా కార్యక్రమాలు చేపడతారు. ఈ భేటీలో పార్టీ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, డీకే అరుణ, మురళీధర్‌రావు, ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్సీ ఏవీఎన్‌ రెడ్డి, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, ఏపీ జితేందర్‌రెడ్డి, ఎం.రవీంద్రనాయక్, బూర నర్సయ్యగౌడ్, జి. విజయరామారావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి తదితరులు పాల్గొన్నారు.

మూడు రథయాత్రలు.. మోదీ సభ..
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఈ నెల 26, 27, 28 తేదీల్లో రాష్ట్రంలో మూడు వైపుల నుంచి మూడు జోన్లుగా రథయాత్ర (బస్సుయాత్ర)లను ప్రారంభించాలని బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో నిర్ణయించారు. కొమురంభీం పేరిట బాసర నుంచి హైదరాబాద్‌ వరకు (ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్‌ జిల్లాల్లో) ఒక యాత్ర.. కృష్ణా యాత్ర పేరిట సోమశిల నుంచి హైదరాబాద్‌ వరకు (ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలు) మరో యాత్ర.. గోదావరి పేరిట భద్రాచలం నుంచి హైదరాబాద్‌ వరకు (ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్‌ జిల్లాలు) మరోయాత్రను ప్రారంభించనున్నారు.

ఈ మూడు యాత్రలు కూడా చివరిలో రంగారెడ్డి మీదుగా హైదరాబాద్‌కు చేరుకుంటాయి. మొత్తం 19 రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్ల పొడవున ఈ రథయాత్రలు సాగనున్నాయి. రాష్ట్ర ముఖ్య నేతలైన కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ లేదా బండి సంజయ్‌ల ఆధ్వర్యంలో ఇవి సాగే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్‌ 14న హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభతో ఈ యాత్రలను ముగించాలని పదాధికారుల భేటీలో నిర్ణయించారు.

మరిన్ని వార్తలు