22న సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటనలు

20 Mar, 2021 00:44 IST|Sakshi

పీఆర్సీ ఫిట్‌మెంట్‌ వెల్లడించే చాన్స్‌

ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంపు కూడా..

8వ తరగతి వరకు బడులు బంద్‌

అసెంబ్లీలో వెల్లడించనున్న సీఎం 

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 22న సోమవారం శాసనసభలో పలు కీలక ప్రకటనలు చేసే అవకాశముంది. బడ్జెట్‌ 2021–22పై శని, సోమవారాల్లో అసెంబ్లీలో అధికార, విపక్ష పార్టీల సభ్యులు చర్చించనున్నారు. తర్వాత సోమవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌ శాసనసభలో బడ్టెట్‌పై ప్రసంగిస్తారు. ప్రతిపాదనలకు సంబంధించి సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. ఇదే సమయంలో పలు కీలక ప్రకటనలు చేయనున్నారని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్సీ)కు సంబంధించిన ఫిట్‌మెంట్‌ శాతాన్ని ప్రకటించే అవకాశం ఉంది. 29 శాతం నుంచి 31 శాతం వరకు ఫిట్‌మెంట్‌ ప్రకటించే విషయమై పరిశీలన జరుపుతున్నట్టు సమాచారం. దీనికితోడు కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో పలు ముందుజాగ్రత్త చర్యలపైనా సీఎం కీలక నిర్ణయాలు వెలువరిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో వారం రోజులుగా కరోనా కేసులు గణనీయంగా బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో 8వ తరగతి వరకు తరగతి గది బోధనను నిలిపివేసే అంశంపై కేసీఆర్‌ ప్రకటన చేస్తారని సమాచారం. ఈ విద్యార్థులను వచ్చే విద్యా సంవత్సరంలో ఎలా ప్రమోట్‌ చేయాలన్న అంశంపైనా స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

పీఆర్సీకు ‘సాగర్‌’కోడ్‌ అడ్డంకి కాదు
ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ప్రకటనకు నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక కోడ్‌ అడ్డంకిగా మారదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. సాగర్‌ ఉప ఎన్నిక కోడ్‌ నల్లగొండ జిల్లా పరిధిలో మాత్రమే అమల్లో ఉంటుందని, మొత్తం రాష్ట్రానికి వర్తించదని చెబుతున్నాయి. రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ ముగిసిందని, పీఆర్సీ ప్రకటిస్తే ఓటర్లు ప్రభావితం కావడానికి అవకాశం లేదని అధికారులు అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ సడలించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తే.. ఎన్నికల కమిషన్‌ సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. నల్లగొండ ఎమ్మెల్సీ స్థానం ఫలితాలు శనివారం, హైదరాబాద్‌ ఎమ్మెల్సీ స్థానం ఫలితాలు ఆదివారం నాటికి వెల్లడికానున్నాయి. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు