4 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

2 Oct, 2021 02:08 IST|Sakshi

సోమవారానికి సభ వాయిదా  7 వరకు సమావేశాలు కొనసాగే అవకాశ

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ నాలుగు బిల్లులను శుక్రవారం ఆమోదించింది. గృహ నిర్మాణ మండలిని రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థగా గుర్తించడంతోపాటు ముగ్గురు సభ్యులను నామినేట్‌ చేసేలా సవరించిన తెలంగాణ గృహ నిర్మాణమండలి (సవరణ) బిల్లు–2021ను గృహ నిర్మాణమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రతిపాదించగా సభ ఆమోదించింది. కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ద్వారా అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (ఎఫ్‌ఆర్‌ఐ), హార్టీకల్చర్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల అనుబంధాన్ని అనుమతించేందుకు ఉద్దేశించిన ఉద్యాన విశ్వవిద్యాలయ సవరణ బిల్లు– 2021ని కూడా సభ ఆమోదించింది.

జాతీయ న్యాయ శాస్త్ర అధ్యయనాలు, పరిశోధనల అకాడమీ విశ్వవిద్యాలయం (నల్సార్‌)లో తెలంగాణ విద్యార్థుల కోటాను 20 నుంచి 25 శాతానికి పెంచడంతోపాటు ఈ 25 శాతం కోటాలో బీసీలు, ఈబీసీలకు రిజర్వేషన్లు కల్పించే నల్సార్‌ సవరణ బిల్లు–2021కు సైతం శాసనసభ ఆమోదం తెలిపింది. తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం–2018లోని కొత్త గ్రామాల ఏర్పాటు, ఏదైనా గ్రామం విస్తీర్ణాన్ని పెంచడం లేదా తగ్గించడం, పేరు, హద్దుల మార్పునకు ఉద్దేశించిన పంచాయతీరాజ్‌ సవరణ బిల్లులోని పేరుమార్పు నిబంధనలపై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. పేరుమార్పు నిబంధనను తొలగించాలని పట్టుబట్టడంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది.

పేరుమార్పు నిబంధనపై నిరసన తెలుపుతున్నట్లు అక్బరుద్దీన్‌ ప్రకటించగా సవరణ బిల్లును ఆమోదించినట్లు స్పీకర్‌ ప్రకటించారు. శుక్రవారం మరో రెండు బిల్లులు సభ ముందుకు వచ్చాయి. తెలంగాణ వస్తుసేవల పన్ను సవరణ బిల్లును మంత్రి హరీశ్‌రావు ప్రతిపాదించారు. రాష్ట్ర పర్యాటకులు, ప్రయాణికులపై దళారీతనం, దుష్ప్రవర్తనను నివారించే బిల్లును హోంమంత్రి మహమూద్‌ అలీ సభలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ బిల్లుల ఆమోదం తర్వాత శాసనసభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ పోచారం ప్రకటించారు. కాగా, వర్షాల మూలంగా సెప్టెంబర్‌ 28, 29, 30 తేదీల్లో శాసనసభ సమావేశాలకు విరామం ప్రకటించడంతో ఈ నెల 7 వరకు సమావేశాలను పొడిగించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. అయితే దీనిపై ఈ నెల 5న జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.   

మరిన్ని వార్తలు