అసెంబ్లీ సమావేశాలు షురూ 

25 Sep, 2021 04:16 IST|Sakshi
ఇటీవల మృతిచెందిన మాజీ ఎమ్మెల్యేలకు నివాళులర్పిస్తున్న సీఎం కేసీఆర్‌. మంత్రులు, శాసనసభ్యులు 

జాతీయ గీతాలాపనతో ప్రారంభం 

ఇటీవల చనిపోయిన మాజీ ఎమ్మెల్యేలకు నివాళి 

సభ ముందుకు పలు పత్రాలు 

పావుగంట పాటు కార్యక్రమాలు.. సోమవారానికి వాయిదా 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ ఎనిమిదో విడత సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తొలుత జాతీయ గీతాలాపన చేసి సమావేశాలను మొదలుపెట్టారు. సుమారు పావుగంట పాటు జరిగిన తొలిరోజు కార్యక్రమాల్లో.. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పత్రాలు, నివేదికలను సమర్పించారు. తర్వాత ఇటీవలికాలంలో మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు నివాళి అర్పించారు. అనంతరం సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. 

రెండు ఆర్డినెన్సులు.. 
తెలంగాణ హౌజింగ్‌ బోర్డు ఆర్డినెన్స్‌ (2021)ను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, కొండా లక్ష్మణ్‌ బాపూజీ హార్టికల్చర్‌ యూనివర్సిటీ ఆర్డినెన్స్‌ 2021ని సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి శాసనసభకు సమర్పించారు. ఇక రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ మూడో వార్షిక నివేదికను తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ట్రాన్స్‌కో, డిస్కమ్‌లకు సంబంధించిన వార్షిక నివేదికలను మంత్రి జగదీశ్‌రెడ్డి; టూరిజం అభివృద్ధి సంస్థ తొలి వార్షిక నివేదికను మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌; తెలంగాణ సమగ్ర శిక్షణా కార్యక్రమం వార్షిక నివేదికను మంత్రి సబితా ఇంద్రారెడ్డి సభకు అందజేశారు. 

తొమ్మిది మందికి నివాళి 
ఇటీవల మరణించిన తొమ్మిది మంది మాజీ ఎమ్మెల్యేలకు నివాళి అర్పిస్తూ శాసనసభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. మాజీ ఎమ్మెల్యేలు కుంజా బుజ్జి (భద్రాచలం), అజ్మీరా చందూలాల్‌ (ములుగు), కేతిరి సాయిరెడ్డి (హుజూరాబాద్‌), కుంజా భిక్షం (బూర్గంపాడు), మేనేని సత్యనారాయణరావు (కరీంనగర్‌), మాచర్ల జగన్నాథం (వర్ధన్నపేట), బుగ్గారపు సీతారామయ్య (బూర్గంపాడు), చేకూరి కాశయ్య (కొత్తగూడెం/పాల్వంచ) మృతిపట్ల సంతాపం ప్రకటించింది.

శాసనసభ్యులుగా వారి రాజకీయ ప్రస్థానం, సేవలను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తుతించారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. నివాళి అనంతరం సభను సోమవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. 

ఇద్దరు కొత్త సభ్యులతో మండలి 
శుక్రవారం ఉదయం 11 గంటలకు మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌రెడ్డి సభకు పరిచయం చేశారు. మండలి ప్యానెల్‌ వైస్‌ చైర్మన్లుగా నారదాసు లక్ష్మణరావు, సయ్యద్‌ అమీనుల్‌ జాఫ్రీలను నియమిస్తున్నట్టు ప్రకటించారు. ఇటీవల మరణించిన ఉమ్మడి ఏపీ మాజీ ఎమ్మెల్సీలు పి.లింబారెడ్డి, టి.లక్ష్మారెడ్డి, హెచ్‌ఏ రెహ్మాన్, ఆర్‌.ముత్యంరెడ్డిలకు నివాళిగా మండలి రెండు నిమిషాలు మౌనం పాటించింది. తర్వాత రెండు ఆర్డినెన్సులు, పలు నివేదికలను మండలి ముందు ఉంచినట్టు చైర్మన్‌ ప్రకటించారు. సోమవారం ఉదయానికి సభను వాయిదా వేశారు. 

మరిన్ని వార్తలు