హడావుడి లేకుండా అసెంబ్లీ సమావేశాలు షురూ..! 

8 Sep, 2020 02:22 IST|Sakshi
అసెంబ్లీలో థర్మల్‌ స్క్రీనింగ్‌ యంత్రం వద్ద టెంపరేచర్‌ చెక్‌ చేసుకుంటున్న మంత్రి కేటీఆర్‌

కరోనా ఆంక్షలతో సభకు తగ్గిన సందర్శకుల తాకిడి 

సాక్షి, హైదరాబాద్‌: సోమవారం ప్రారంభమైన శాసనసభ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ పరిసరాల్లో విభిన్న వాతావరణం కనిపించింది. ప్రజా ప్రతినిధులు, అధికారులు, పోలీసులు, మీడియా, సందర్శకులతో సందడిగా కనిపించే అసెంబ్లీ ప్రాంగణంలో ఈసారి కరోనా నేపథ్యంలో పెద్దగా హడావుడి కనిపించలేదు. మీడియా పాయింట్‌ ఎత్తివేయడం, లాబీలు, గ్యాలరీలోకి సందర్శకులకు అనుమతి ఇవ్వక పోవడంతో అసెంబ్లీ పరిసరాలు బోసిపోయాయి. మంత్రులు మినహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వ్యక్తిగత సిబ్బందిని కూడా అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించలేదు. సీఎం, స్పీకర్, మంత్రులు సహా అందరూ మాస్క్‌లతో సభకు హాజరు కాగా, సభలో భౌతిక దూరం పాటిస్తూ సమావేశాల్లో పాల్గొన్నారు. సభ లోపల, బయటా కరచాలనాలు, గుమి కూడటం వంటివి లేకుండా సమావేశం వాయిదా పడిన వెంటనే ఎవరికి వారుగా తిరుగుముఖం పట్టారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే వారికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అసెంబ్లీ ప్రాంగణంలో డయాగ్నస్టిక్‌ కేంద్రం ఏర్పాటు చేసి, అందరికీ పరీక్షలు నిర్వహించారు.

మాస్క్‌ పెట్టుకోండి.. దూరం పాటించండి  : స్పీకర్‌ పోచారం సూచనలు 
సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ సమావేశాలకు హాజరయ్యే సభ్యులంతా కరోనా నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. సోమవారం సభ ప్రారంభం కాగానే జాతీయ గీతాలాపన అనంతరం ఆయన సభ్యులకు పలు సూచనలు చేశారు. సభ్యులం తా సభకు హాజరయ్యే ముందు జ్వరాన్ని తనిఖీ చేసుకోవాలని.. జ్వరం, దగ్గు, జలుబు ఉంటే అది తగ్గేవరకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు. గాలి, వెలుతురు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్క్‌ పెట్టు కోవాలని, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, అనవసరంగా వేటినీ తాకరాదని స్పష్టంచేశారు. రోగనిరోధక శక్తి పెంచుకునేలా పౌష్టి కాహారం తీసుకోవాలని, అనారోగ్యం ఉన్నవారితో కలవరాదని చెప్పారు. నీటి సీసాలు పంచుకోరాదని, లిఫ్టు వాడొద్దని పోచారం సూచించారు.

చర్చలు సజావుగా జరిగేందుకు సహకరించాలి : మంత్రి వేముల
సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలపై శాసనసభ, మండలిలో అర్థవంతమైన చర్చలు జరిగేందుకు ప్రభుత్వ చీఫ్‌ విప్, విప్‌లు కీలక పాత్ర పోషించాలని శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సూచించారు. పలు అంశాలకు సంబంధించి స్వల్పకాలిక, లఘు చర్చలపై విప్‌లు అంశాల వారీగా సన్నద్ధం కావాలని తెలిపారు. సభ్యుల హాజరును పర్యవేక్షించాలని చెప్పారు. శాసనసభ, మండలిలో చీఫ్‌ విప్‌లు, విప్‌లతో సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో మంత్రి సమావేశమై చర్చించారు. సభను ఎన్ని రోజులైనా నిర్వహించేందుకు సీఎం సుముఖంగా ఉండడంతో అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో చీఫ్‌ విప్‌లు బోడకుంటి వెంకటేశ్వర్లు, దాస్యం వెంకటేశ్వర్లు, విప్‌లు భానుప్రసాద్‌రావు, ఎంఎస్‌ ప్రభాకర్, శాసనసభ విప్‌లు గంప గోవర్ధన్, గొంగిడి సునీత, బాల్క సుమన్, రేగ కాంతారావు, గువ్వల బాలరాజు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా