నేటితో అసెంబ్లీసమావేశాలకు తెర!

16 Sep, 2020 04:02 IST|Sakshi

కోవిడ్‌ నేపథ్యంలో కుదించాలన్న యోచనలో ప్రభుత్వం 

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీ వానాకాల సమావేశాల షెడ్యూల్‌ను కుదిస్తూ, సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. బుధవారం జరిగే ఎనిమిదో రోజు సమావేశం ముగిసిన తర్వాత ఈ మేరకు ఉభయ సభలు వాయిదా పడే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచన మేరకు విపక్ష ఫ్లోర్‌ లీడర్లు అక్బరుద్దీన్‌ ఒవైసీ (ఎంఐఎం), మల్లు భట్టివిక్రమార్క (కాంగ్రెస్‌)తో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ మంగళవారం పలు దఫాలు సంప్రదింపులు జరిపారు. శాసనసభ వాయిదా పడిన అనంతరం స్పీకర్‌ సమక్షంలో విపక్ష శాసనసభాపక్ష నేతలతో ప్రభుత్వ ప్రతిపాదనపై చర్చ జరిగినట్లు తెలిసింది. బుధవారం ప్రశ్నోత్తరాలు, జీహెచ్‌ఎంసీ లఘు చర్చ ముగిసిన తర్వాత శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది. 

కరోనా నేపథ్యంలో... 
సమావేశాలను 28 వరకు నిర్వహించాలని తొలి రోజు జరిగిన ఉభయసభల బీఏసీ సమావేశాల్లో నిర్ణయించారు. సమావేశాలకు హాజరయ్యే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీడియా, పోలీసులు, మార్షల్స్, అసెంబ్లీ సిబ్బందికి నిరంతరం కోవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఎంఐఎం పార్టీకి చెందిన ఓ శాసనసభ్యుడితో పాటు పలువురు పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రతిరోజూ వివిధ కేటగిరీలకు చెందిన సుమారు 11 వందల మంది అసెంబ్లీకి హాజరవుతుండటంతో కరోనా విస్తరించే అవకాశం ఉందనే అంచనాకు ప్రభుత్వం వచ్చినట్లు తెలిసింది. కరోనా పరిస్థితుల్లో ఏ ఇతర రాష్ట్రంలోనూ అసెంబ్లీ సమావేశాలు ఒకటి రెండు రోజులకు మించకుండా నిర్వహించిన విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు..  

కృష్ణా జలాలపై చర్చించాలి: భట్టి 
అసెంబ్లీ సమావేశాల కుదింపు అంశంపై కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క స్పందిస్తూ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన అందిందన్నారు. అయితే కృష్ణా జలాల వివాదం, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించాలని తాము కోరినట్లు వెల్లడించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు