తెలంగాణ: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

7 Sep, 2020 01:42 IST|Sakshi

నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

కరోనా పరీక్షలు చేయించుకుంటేనే సభ్యులకు అనుమతి

సభలో భౌతిక దూరం పాటిస్తూ సీటింగ్‌ 

20 రోజులపాటు సభ జరిగే అవకాశం

తొలిరోజు బీఏసీ భేటీ

నేటి సాయంత్రం టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే శాసనసభ వర్షాకాల సమావేశాల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తామనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటన నేపథ్యంలో సభను సజావుగా నిర్వహించేందుకు అసెంబ్లీ యంత్రాం గం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ప్రధానంగా శాసనసభ సమావేశ మందిరంలోనూ, బయటా భౌతిక దూరానికి ప్రాధాన్యతిస్తూ సభ్యులు, ఇతరుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి, స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులతో పాటు సభ్యులందరికీ పార్టీలకతీతంగా కరోనా నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి చేశారు. దీంతో మూడు రోజులుగా అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మార్షల్స్, మీడియా ప్రతినిధులు, పోలీసులు, మంత్రుల పీఏలు, పీఎస్‌లు శాసనసభ ఆవరణలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు.

భౌతిక దూరానికి ప్రాధాన్యత...
శాసనసభ, మండలిలో భౌతిక దూరానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సీటింగ్‌ ఏర్పాట్లు చేశారు. 119 మంది సభ్యులున్న శాసనసభలో 45, శాసన మం డలిలో 40 మంది సభ్యుల కోసం ఎనిమిది సీట్లు అదనంగా ఏర్పాటు చేశారు. భౌతిక దూరం పాటిం చేలా విజిటర్స్‌ గ్యాలరీని మీడియా ప్రతినిధులకు కేటాయిస్తూ ఏర్పాట్లు చేశారు. శాసనసభ ఆవరణలో రద్దీని తగ్గించేందుకు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల వ్యక్తిగత సహాయకులకు అనుమతి నిరాకరించడంతో పాటు మీడియా, అధికారులకు జారీ చేసే పాస్‌ల సంఖ్యను భారీగా కుదించారు. 

సమావేశాల తీరుపై బీఏసీలో నిర్ణయం..
అసెంబ్లీ ప్రారంభం సందర్భంగా తొలిరోజు జరిగే బీఏసీ భేటీలో సమావేశాల నిర్వహణ తీరుతెన్ను లపై స్పష్టత రానుంది. సభను ఎన్ని రోజులు నడపాలి, రోజుకు ఎన్ని గంటలు నిర్వహించాలి, ఏయే అంశాలపై చర్చ జరగాలి అనే అంశాలపై బీఏసీలో చర్చ జరగనుంది. ప్రస్తుత సమా వేశాల్లో అత్యంత కీలకమైన రెవెన్యూ చట్టంతో పాటు, మరో నాలుగు బిల్లులు చర్చకు వచ్చే అవకాశం ఉంది. దివంగత మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ఇవ్వాలంటూ అసెంబ్లీ తీర్మానం చేయనుంది. 

తొలిరోజు సంతాప తీర్మానాలు
అసెంబ్లీ సమావేశాల తొలి రోజున శాసనసభ, శాసన మండలిలో పలు సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మృతికి సంతాపం ప్రకటిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉభయ సభల్లో తీర్మానం ప్రతిపాదిస్తారు. దివంగత దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి సంతాపం తెలిపే తీర్మానాన్ని కూడా సీఎం ప్రతిపాదిస్తారు. ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులు కావేటి సమ్మయ్య, జువ్వాది రత్నాకర్‌రావు, సల్లూరి పోచయ్య, పి.రామస్వామి, ముస్కు నర్సింహ, బి.కృష్ణ, సున్నం రాజయ్య, ఎడ్మ కిష్టారెడ్డి, మాతంగి నర్సయ్యకు సభ సంతాపం ప్రకటిస్తుంది. శాసనమండలిలోనూ మాజీ ఎమ్మెల్సీలు నంది ఎల్లయ్య, ఎస్‌.జగదీశ్వర్‌రెడ్డి మరణం పట్ల చైర్మన్‌ సంతాప తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు.

బీఏసీలో ప్రతిపాదించే అంశాలు
– కరోనా వ్యాప్తి, నివారణ, వైద్య సేవలు
– రాయలసీమ ఎత్తిపోతల పథకం
– భారీ వర్షాలు– పంట నష్టం
– శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రంలో ప్రమాదం
– కొత్త రెవెన్యూ చట్టం
– జీఎస్టీ అమల్లో అన్యాయం
– నియంత్రిత పద్ధతిలో సాగు
– రిజర్వేషన్లపై కేంద్ర వైఖరి
– పీవీ శత జయంతి ఉత్సవాలు

జాగ్రత్తలివీ...
– మాస్క్‌లు, కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకున్న వారికే అనుమతి
– ప్రవేశ ద్వారం వద్ద శరీర ఉష్ణోగ్రత కొలిచే పరికరాలు, శానిటైజర్ల ఏర్పాటు
– సభ్యులకు ఆక్సీమీటర్, శానిటరీ బాటిల్, మాస్క్‌లతో కూడిన కిట్లు
– జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు ఉంటే అనుమతి నిరాకరణ
– అసెంబ్లీ పరిసరాలు, మీటింగ్‌ హాళ్లలో రెండుసార్లు శానిటైజేషన్‌ 
– అసెంబ్లీ ఆవరణలో రెండు డయాగ్నస్టిక్‌ కేంద్రాలు, అంబులెన్స్‌లు
– మీడియా పాయింట్‌ ఎత్తివేత, గ్యాలరీలోకి సందర్శకులకు నో ఎంట్రీ
– ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల పీఏలు, వ్యక్తిగత సిబ్బందిని అనుమతించరు
– చర్చల సందర్భంగా ముఖ్య అధికారులకు మాత్రమే లోనికి అనుమతి

నేడు టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ...
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌ లో టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షం భేటీ కానుంది. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంపై టీఆర్‌ఎస్‌ఎల్పీ సంతాపం తెలుపుతుంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేస్తారు.  

మరిన్ని వార్తలు