TS Assembly: భారతమాత గుండెకు గాయమవుతోంది.. బీజేపీ జాతీయ జెండానే మారుస్తుందంటా?: కేసీఆర్‌ ఫైర్‌

12 Sep, 2022 15:20 IST|Sakshi

Updates..

►  తెలంగాణ శాసనమండలి  రేపటికి వాయిదా

 తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా

 కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17న అధికారికంగా తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరపాలి. ఉత్సవాలు గర్వపడేలా ఉండాలి.. గాయపడేలా ఉండకూడదు. వరద నష్టంపై సభలో చర్చ జరపాలి. అవసరమైతే మరో రెండు రోజులు సభ కొనసాగించాలి. కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి. దీని కోసం సభ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి.

11: 40 AM

►  కేంద్రం తెచ్చిన విద్యుత్‌ చట్టంపై సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. తలసరి విద్యుత్‌ వినియోగం ప్రగతి సూచికగా ఉంటుంది. కేంద్రం తెలంగాణకు భయంకరమైన అన్యాయం చేసింది. విభజన చట్టంలోని అనేక అంశాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. సీలేరు పవర్‌ ప్రాజెక్ట్‌ సహా 7 మండలాలను లాగేసుకున్నారు. కేంద్ర కేబినెట్‌ తొలి భేటీలోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ గొంతు నులిమింది. మోదీకి ఎన్నిసార్లు చెప్పినా కర్కశంగా వ్యవహరించారు. మోదీ ఫాసిస్టు ప్రధాని అని ఆనాడే చెప్పాను. విద్యుత్‌ అంశం ఉమ్మడి జాబితాలో ఉంది. ప్రజాస్వామ్యంలో అధికారం అంటే బాధ్యత. 

కేంద్రం ఇచ్చిన గెజిట్‌లో మోటర్లకు మీటర్లు పెట్టాలని ఉంది. మీటర్లు లేకుండా ఒక్క కనెక్షన్‌ కూడా ఇవ్వొదని బిల్లులో చెప్పారు. విద్యుత్‌ సంస్కరణల ముసుగుతో రైతులను దోచుకునే ప్రయత్నం జరుగుతోంది. కేంద్రం తెస్తున్న విద్యుత్‌ సంస్కరణ అందరికీ తెలియాలి. విద్యుత్‌ బిల్లును బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ఎలా సమర్ధిస్తున్నారో ఆలోచించుకోవాలి. రఘునందన్‌ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష సభ్యులపై మూక దాడులు చేస్తున్నారు. ప్రధాని నరేం‍ద్ర మోదీ.. రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు. 

ఆర్టీసీని అమ్మేయాలని నాకు కేంద్రం నుంచి నోటీసులు వస్తున్నాయి. కేంద్రం లెటర్ల మీద లెటర్లను నాకు పంపిస్తోంది. ఆర్టీసీని అమ్మేస్తే వెయ్యికోట్లు బహుమతి ఇస్తామంటున్నారు. కేంద్రం అన్నీ అమ్మేస్తోంది. దీనికి సంస్కరణలు అని అందమైన పేరు పెట్టారు. విద్యుత్‌, వ్యవసాయ రంగాన్ని షావుకార్లకు అప్పగించాలని మోదీ సర్కార్‌ చూస్తోంది. 

మమ్మల్ని కూలగొడతామని చెబుతున్నారు. అంటే మీకు పోయే కాలం వచ్చింది. అందరూ కలిస్తే మీరు ఉంటారా?. షిండేలు, బొండేలు అని ఎవరిని బెదిరిస్తున్నారు. హిట్లర్‌ వంటి వారే కాలగర్బంలో​ కలిసిపోయారు. వీళ్లను దేవుడు కూడా కాపాడలేడు. భారతమాత గుండెకు గాయమవుతోంది. జాతీయ జెండానే మార్చేస్తామని చెబుతున్నారు. ఏక పార్టీనే ఉంటుందని చెప్తున్నారు. కేంద్రం తీరుతో ఆహార భద్రత ప్రమాదంలో పడింది. రాజ్యాంగ వ్యవస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. 

10:25 AM

 కేంద్రం విద్యుత్‌ సంస్కరణల చట్టంపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది.      

 కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ పోచారం తీరస్కరించారు. 

 శాసనసభలో 7 బిల్లులు ప్రవేశపెట్టిన ప్రభుత్వం. బిల్లులపై రేపు(మంగళవారం) చర్చ చేపడతామని స్పీకర్‌ పోచారం తెలిపారు. 

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 6న సమావేశమై వాయిదా పడిన తెలంగాణ శాసనసభ, శాసన మండలి వానాకాలం సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సభను ప్రారంభించారు.  

మరిన్ని వార్తలు