నల్లచట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయండి: రేవంత్‌రెడ్డి

18 Feb, 2021 04:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  కేంద్రం తీసుకువచ్చిన నల్ల వ్యవసాయ చట్టాలను అమలు చేయబోమని రాష్ట్ర అసెంబ్లీలో వెంటనే తీర్మానం చేయాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ అనుముల రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ‘వ్యవసాయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలోని అంశం. కేంద్రం తెచ్చిన చట్టాలను అమలు చేయాలా వద్దా అన్నది రాష్ట్రాల ఇష్టం. నరేంద్రమోదీ ప్రభుత్వం తెచ్చిన నల్లచట్టాలు నిర్బంధ చట్టాలు కావు. అయినా మోదీకి అమ్ముడుపోయిన కేసీఆర్‌ ఈ చట్టాలను రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవి అమలైతే రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఉండవు. పంటకు గిట్టుబాటు ధర ఉండదు. కంపెనీలు రైతులను మోసం చేస్తే కోర్టులకు వెళ్లే అవకాశం ఉండదు. రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించే ఈ చట్టాలను వెంటనే వెనక్కి పంపాలి’అని రేవంత్‌ అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీలు మల్లు రవి, అంజన్‌కుమార్‌ యాదవ్, టీపీసీసీ అధికార ప్రతినిధి కౌశిక్‌చరణ్‌ యాదవ్‌లతో కలసి ఆయన మాట్లాడారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశాల మేరకు రైతు ఉద్యమానికి సంఘీభావంగా పదిరోజులపాటు ప్రజల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు.

అచ్చంపేటలో నిర్వహించిన రాజీవ్‌ రైతు భరోసా దీక్షలో అక్కడి రైతులు, కాంగ్రెస్‌ నేతల డిమాండ్‌ మేరకు పాదయాత్రగా మారిందని రేవంత్‌ చెప్పారు. కేంద్రం దుర్మార్గపు చర్యలను అడ్డుకుంటానని చెప్పిన సీఎం కేసీఆర్‌ ఇప్పుడు మోదీకి తలూపుతున్నారని, ఆయన నటనకు ఆస్కార్‌ అవార్డు ఇవ్వొచ్చని వ్యాఖ్యానించారు. పెద్ద రైతునని చెప్పుకునే కేసీఆర్‌కు రైతుల పక్షాన నిలిచే పెద్ద మనసు ఎందుకు రావడంలేదో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఎకరాకు 25 లక్షలు ఇస్తే గజ్వేల్‌లో కేసీఆర్‌కు ఉన్న వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్‌ను ఫార్మా రైతులకు ఇస్తారా అని ప్రశ్నిం చారు. భవిష్యత్తులో నిరుద్యోగ, రైతాంగ అంశాలే ఎజెండాగా, జై కిసాన్, జై జవాన్‌ నినాదంతో ముందుకెళ్తామని రేవంత్‌ చెప్పారు. కాగా, 10 రోజులుగా రైతాంగ సమస్యలపై పాదయాత్ర నిర్వహించిన రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీ కేడర్‌ అక్కున చేర్చుకుందని, ఆయన్ను తమ నాయకుడిగా గుర్తించిందని మాజీ ఎంపీ మల్లు రవి చెప్పారు. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు కూడా తమ జిల్లాల్లో పాదయాత్ర చేయాలని రేవంత్‌ను కోరుతున్నారని, దీనిపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.    

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమించాలి: భట్టి విక్రమార్క
ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్‌ వ్యవస్థను ప్రోత్సహిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఉద్యమించాలని సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క రైతులకు పిలుపునిచ్చారు. ఆయన చేపట్టిన పోరుబాట–పల్లెబాట యాత్ర బుధవారం నాగర్‌కర్నూల్‌ జిల్లానుంచి నల్లగొండ జిల్లా డిండి మండలం తవక్లాపూర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామంలో రైతులతో ముఖా ముఖి నిర్వహించారు. కేంద్ర ప్రభు త్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మద్దతు పలుకుతూ.. సీసీఐ కేం ద్రాలను ఎత్తివేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల ప్రజల సాగు, తాగునీటి సమ స్య పరిష్కారానికి చేపట్టిన డిండి ఎత్తిపోతల పథ కం పనులను రెండున్నరేళ్లలో పూర్తి చేస్తానన్న సీఎం మాట ఏమైందని ప్రశ్నించారు. ఎక్కడ ఉప ఎన్నికలు వస్తే అక్కడ అమలుకు వీలుకాని హామీలిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ హన్మంతరావు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే బాలూనాయక్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు