ఒక్కసారి తిరస్కరిస్తే.. మళ్లీ నో కరోనా వ్యాక్సిన్‌!

21 Jan, 2021 01:16 IST|Sakshi

కీలకమైన మార్పులు చేసిన వైద్య, ఆరోగ్య శాఖ

ఒకరు రాకుంటే మరొకరికి టీకా..

తద్వారా ఆ రోజురాని వారిస్థానంలో మరొకరికి..

నేటి నుంచి అన్నిచోట్లా అమలు చేయాలని నిర్ణయం

తద్వారా వేగంగా వ్యాక్సినేషన్‌ పూర్తికి కార్యాచరణ

నేడు 35 వేలమందికి టీకాలు వేయాలని నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో అధికారులు కీలక మార్పులు చేశారు. జాబితాలో పేరుండీ నిర్దేశిత రోజున వ్యాక్సిన్‌ వేసుకోవడానికి ఎవరైనా నిరాకరిస్తే వారికి మరోసారి టీకా వేసే అవకాశం ఇవ్వరాదని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఎవరైనా వ్యాక్సిన్‌ వేసుకోవడానికి కేటాయించినరోజు రాకపోతే, అందుబాటులో ఉన్న ఇతర అర్హులైన వారికి వేయాలని, తద్వారా వేగంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని భావిస్తున్నారు.

ప్రస్తుతం వైద్య సిబ్బందికి వ్యాక్సిన్లు వేస్తున్న సంగతి తెలిసిందే. కానీ, చాలాచోట్ల ఆరోజు నిర్దేశించిన జాబితాలోని వారందరూ రావడంలేదు. కొన్నిచోట్ల 60 శాతం, మరి కొన్నిచోట్ల 70 శాతం మంది టీకాలకు వస్తున్నారు. మరికొందరు తీసుకోవ డానికి తిరస్కరిస్తున్నారు. దీంతో నిర్ణీత తేదీన వేయాల్సిన వ్యాక్సిన్‌ టార్గెట్‌ పూర్తి కావడం లేదు. ఫలితంగా లక్ష్యాన్ని చేరుకోవడం ఆలస్యమవుతోంది. ఉదాహరణకు ఈ నెల 19న 73,673మంది లబ్ధిదారులను లక్ష్యంగా నిర్దేశించగా 51,997 మందికే టీకాలు వేశారు. అంటే ఆరోజు వేయాల్సినవారిలో ఇంకా 21,676 మంది రాలేదు. అందుకే ఈ పరిస్థితికి చెక్‌ పెట్టాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. చదవండి: (వ్యాక్సిన్ ‌తీసుకున్న వ్యక్తి మృతి.. కేంద్ర ప్రభుత్వం ఆరా)

అప్పటికప్పుడు ఇతరుల పేర్లు నమోదు చేసి టీకా
నిర్ణీత కేంద్రంలో ఎంతమందికి టీకా వేయాలన్న వివరాల జాబితా సంబంధిత అధికారి వద్ద ఉంటుంది. కోవిన్‌ యాప్‌లో అవన్నీ నిక్షిప్తమై ఉంటాయి. ఎవరెవరికి ఎప్పుడు వేయాలో తేదీ, టైం స్లాట్‌ ప్రకారం లబ్ధిదారుల మొబైల్‌ ఫోన్లకు మెసేజ్‌లు వెళ్తాయి. ఆ ప్రకారం లబ్ధిదారులు వస్తారు. ఇది సాధారణంగా జరిగే వ్యాక్సినేష¯Œ  ప్రక్రియ. అయితే, చాలామంది గైర్హాజరుకావడం వల్ల లక్ష్యం నెరవేరడంలేదు. కాబట్టి గైర్హాజరైన వారి స్థానంలో అప్పటికప్పుడు అర్హులైన ఇతర లబ్ధిదారులకు టీకా వేస్తారు. అప్పటి కప్పుడు వారు అదేరోజు వ్యాక్సిన్‌ వేసుకు న్నట్లు కోవిన్‌ సాఫ్ట్‌వేర్‌లో వివరాలను నమోదు చేస్తారు. మున్ముందు ప్రైవేట్‌ ఆసుపత్రుల సిబ్బందికి టీకాలు వేసే టప్పుడు, ఫ్రంట్‌లై¯Œ  వర్కర్లకు కూడా ఇదే పద్ధతిని పాటిస్తారు. సాధారణ ప్రజలకు వేసేటప్పుడు కూడా ఇలాగే ఉండొచ్చని అంటున్నారు. ఇలా చేయకుంటే టార్గెట్‌ పూర్తికాక మానవ వనరులు, సమయం వృథా అవుతాయని భావిస్తున్నారు. 

తిరస్కరిస్తే మరోసారి టీకా వేయరు...
కరోనా టీకా వేసుకోబోమని ఎవరైనా వచ్చి తిరస్కరిస్తున్నట్లు చెబితే, దాన్ని కోవిన్‌ యాప్‌లో నమోదు చేస్తారు. అలా ఒకసారి తిరస్కరిస్తున్నట్లు యాప్‌లో నమోదైన తర్వాత మరోసారి వారికి టీకాలు వేసే అవకాశం లేదని అధికారులు వెల్లడించారు. యాప్‌ను ఆ విధంగా తీర్చిదిద్దుతారని చెబుతున్నారు. ఇదిలావుండగా ఇప్పటివరకు కోవిన్‌  సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలు పరిష్కారమైనట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం నుంచి 99.9 శాతం యాప్‌ ద్వారానే వ్యాక్సినేషన్‌ జరుగుతుందన్నారు. ఇప్పటివరకు మూడు రోజులపాటు వ్యాక్సినేషన్‌ను 50 శాతం యాప్‌ ద్వారా, మరో 50 శాతం మాన్యువల్‌ పద్ధతిలో నిర్వహించినట్లు పేర్కొన్నారు. గురువారం నిర్దేశించిన అన్ని కేంద్రాల్లో 35 వేలమందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.   

మరిన్ని వార్తలు