కేసీఆర్‌ ఒక్కరు పోరాడితేనే తెలంగాణ రాలేదు

5 Mar, 2023 05:48 IST|Sakshi

టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం  

హుజూరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక్కరు పోరాడితేనే తెలంగాణ రాష్ట్రం రాలేదని, సకల జనులు కలసికట్టుగా పోరాడితేనే తెలంగాణ స్వప్నం సాకారమైందని తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) అధ్యక్షుడు ఎం.కోదండరాం అన్నారు. శనివారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో తెలంగాణ బచావో సభకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. మిలియన్‌ మార్చ్‌ స్ఫూర్తితోనే హైదరాబాద్‌లో æమార్చి 10న తెలంగాణ బచావో సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సభలో వచ్చే సూచనల ఆధారంగా భవిష్యత్‌ కార్యాచరణను రూపొందిస్తామని ప్రకటించారు.

తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న వారు, తెలంగాణ అభివృద్ధిని కోరుకునే వారు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎలా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందో ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కుంభకోణం తేటతెల్లం చేస్తోందని తెలిపారు. కుంభకోణంలో తమ వాటా కోసం ఓ కుటుంబం ప్రయత్నించిందన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు భూకబ్జాలకు పాల్పడేందుకు ధరణి పోర్టల్‌ రూపొందించారని విమర్శించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌ చెప్పింది ఏంటి? ఇప్పుడు చేసేదేంటి? అని కోదండరాం ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చినప్పుడే ఆ పార్టీ తెలంగాణలో ఉనికి కోల్పోయిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీజేఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ముక్కర రాజు, పెద్దపల్లి జిల్లా కన్వీనర్‌ నర్సింగ్, ప్రధాన కార్యదర్శి స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు