తెలంగాణకు 16 స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు 

2 Oct, 2022 02:51 IST|Sakshi
అవార్డుతో మంత్రి కేటీఆర్‌

సాక్షి, న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో జరిగిన స్వచ్ఛతా కార్యక్రమాల్లో మంచి పురోగతి చూపిన నగరాలకు కేంద్రం స్వచ్ఛ సర్వేక్షణ్‌–2022 అవార్డులను అందజేసింది. శనివారం ఢిల్లీలోని తాల్‌కటోరా స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో అన్ని కేటగిరీల్లో కలిపి మొత్తం 160కిపైగా అవార్డులను ఇచ్చారు. అందులో తెలంగాణకు 16 స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు వచ్చాయి.

సౌత్‌జోన్‌ విభాగంలో తెలంగాణ 15 అవార్డులను కైవసం చేసుకోగా.. 100కుపైగా మున్సిపాలిటీలు/కార్పొరేషన్లు ఉన్న రాష్ట్రాల జాబితాలో 2990 స్కోర్‌తో 4వ ర్యాంకు సాధించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌ పురీ చేతుల మీదుగా మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్లు, రాష్ట్ర అధికారులు అవార్డులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీ రామారావు కూడా పాల్గొన్నారు. 

ఏ నగరానికి ఏ ర్యాంకు? 
దేశంలో లక్షకుపైగా జనాభా ఉన్న టాప్‌–100 పట్టణ స్థానిక సంస్థల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ 26వ ర్యాంకు, సిద్దిపేట 30వ ర్యాంకు, వరంగల్‌ 84వ ర్యాంకు, కరీంనగర్‌ 89వ ర్యాంకు సాధించాయి. లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న టాప్‌–100 పట్టణాల్లో బడంగ్‌పేట్‌ 86వ ర్యాంకు పొందింది. ఇక దేశంలోని కంటోన్మెంట్‌ బోర్డులకు ఇచ్చిన ర్యాంకుల్లో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ 4వ ర్యాంకు సా­ధించడంతోపాటు పౌరుల అభిప్రాయాలు తీసు­కొనే ఉత్తమ కంటోన్మెంట్‌ బోర్డుగా నిలిచింది. 

సౌత్‌జోన్‌ పరిధిలో రాష్ట్రానికి స్వచ్చ సర్వేక్షణ్‌ అవార్డులు ఇవీ..  
50వేలు– లక్ష జనాభా ఉన్న పట్టణాల కేటగిరీ 
1) పరిశుభ్రమైన నగరం: బడంగ్‌పేట్‌ 
2) వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం: కోరుట్ల 
3) స్వయం సమృద్ధి నగరం: సిరిసిల్ల 
25వేలు–50వేల మధ్య జనాభా కేటగిరీ 
1) పరిశుభ్రమైన నగరం: గజ్వేల్‌ 
2) వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం: తుర్కయాంజాల్‌ 
3) పౌరుల అభిప్రాయాలు తీసుకున్న నగరం: వేములవాడ 
15వేలు–25 వేల మధ్య జనాభా కేటగిరీ 
1) పరిశుభ్రమైన నగరం: ఘట్‌కేసర్‌ 
2) వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం: కొంపల్లి 
3) పౌరుల అభిప్రాయాలు తీసుకున్న నగరం: హుస్నాబాద్‌ 
4) స్వయం సమృద్ధి నగరం: ఆదిభట్ల 
15 వేలలోపు జనాభా కేటగిరీ 
1) పరిశుభ్రమైన నగరం: కొత్తపల్లి 
2) వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం: 
చండూరు 
3) పౌరుల అభిప్రాయాలు తీసుకున్న నగరం: 
నేరడుచెర్ల 
4) ఆవిష్కరణలు, ఉత్తమ పద్ధతులు 
అవలంబిస్తున్న నగరం: చిట్యాల 
5) స్వయం సమృద్ధి నగరం: భూత్పూర్‌  

మరిన్ని వార్తలు