సీఎంగా ఎన్నుకుంది గూండాయిజం చేయడానికా? 

26 Jan, 2022 02:57 IST|Sakshi

ఎంపీ అర్వింద్‌పై దాడిని ఖండించిన బండి   

నల్లగొండ: ఎంపీగా తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ధర్మపురి అర్వింద్‌పై టీఆర్‌ఎస్‌ గూండాలు, కార్యకర్తలు రాళ్లతో దాడి చేయడం, బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నానికి పాల్పడడం దుర్మార్గమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. సీఎంగా కేసీఆర్‌ను ఎన్నుకున్నది గూండాయిజం చేయడానికా? పాలించడానికా? అని నిలదీశారు. సంజయ్‌ మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ అర్వింద్‌పై దాడిని తీవ్రంగా ఖండించారు.

దాడి గురించి నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు, డీజీపీకి ఫోన్‌ చేసినా ఎత్తలేదని, డీజీపీకి తెలిసే దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. అర్వింద్‌ సీఎం ఫామ్‌హౌస్‌కో, ప్రగతిభవన్‌కో పోలేదని, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తుంటే దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. అర్వింద్‌పై దాడిని కేంద్ర నాయకత్వానికి, పార్లమెంట్‌ ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఉద్యోగం రాక ముత్యాల సాగర్‌ ఆత్మహత్య చేసుకున్నాడని, ఇది ప్రభుత్వ హత్యేనన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీఓను సవరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఇప్పటికి 40 మంది ఉపాధ్యాయ, ఉద్యోగులు చనిపోయినట్లు సంఘాలు తెలిపాయన్నారు. తెలంగాణకు నెంబర్‌వన్‌ ద్రోహి కేసీఆర్‌ అని సంజయ్‌ ఆరోపించారు. ఉద్యమ కాలంలో దొంగ దీక్షలు చేయడంతోపాటు పార్లమెంట్‌లో తెలంగాణ ఏర్పాటు సందర్భంగా ఓటింగ్‌కు హాజరు కాలేదని, కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ స్కామ్‌లకు పాల్పడ్డారని తెలిపారు. వాటిపై సీబీఐ విచారణ కూడా జరిగిందన్నారు. కేసీఆర్‌ పతనానికి కౌంట్‌డౌన్‌ మొదలైందని, ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని చెప్పారు. విలేకరుల సమావేశంలో బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు మనోహర్‌రెడ్డి, రజని, చంద్రశేఖర్, శ్రీనివాస్‌గౌడ్, భరత్, ప్రేమేందర్‌రెడ్డి, చింతా సాంబమూర్తి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు