పోలీసులపై ప్రివిలేజ్‌ కమిటీకి..

29 Nov, 2022 02:34 IST|Sakshi
ఆదివారం రాత్రి జగిత్యాలలో తనను అడ్డుకున్న డీఎస్పీ ప్రకాశ్‌పై బండి సంజయ్‌ ఆగ్రహం  

పార్లమెంట్‌కు ఫిర్యాదు చేయాలని ఎంపీ బండి సంజయ్‌ యోచన

పోలీసుల తీరుపై బీసీ కమిషన్‌ను ఆశ్రయిస్తామంటున్న అనుచరులు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు బండి సంజయ్‌ మళ్లీ పోలీసులపై పార్లమెంటు ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేయాలని యోచి స్తున్నట్టు తెలిసింది. ఒక ఎంపీగా, ప్రజాప్రతినిధిగా ప్రజలను కలిసేందుకు వెళ్తున్న తనను పోలీసులు శాంతిభద్రతల సమస్య పేరిట పదే పదే అడ్డుకుంటున్నారని సంజయ్‌ మండిపడుతున్నారు. తాజాగా భైంసాకు వెళ్తున్న సమయంలో జగిత్యాల పోలీసు లపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిజానికి గతంలో ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఒకసారి, ఈ ఏడాది జనవరిలో మరోసారి పోలీసుల తీరుపై సంజయ్‌ పార్లమెంటు ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేశారు. దాంతో పలువురు పోలీసు అధికారులు ఢిల్లీ వెళ్లి కమిటీ ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు జగిత్యాల జిల్లా పోలీసులపై ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి.

ఇక బండి సంజయ్‌ను అకారణంగా వేధిస్తున్నారని ఆయన అనుచరులు బీసీ కమిషన్‌ను ఆశ్రయించనున్నట్టు వివరించాయి. అయితే ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించడమే తప్ప.. తమకు ఎలాంటి వ్యక్తిగత కక్షలు ఉండవని, తమపై ఫిర్యాదు చేస్తే లాభమేంటని కొందరు పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

కేంద్రానికి మేం సహకరించట్లేదా?: మంత్రి గంగుల
శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ పోలీసులు మంచి ప్రతిభ కనబరుస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. పోలీసులపై పదే పదే ఆరోపణలు, ఫిర్యాదులు చేయడం వారి ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే చర్యగా భావిస్తున్నామన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు టీఆర్‌ఎస్‌ నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నప్పుడు తాము సహకరించడం లేదా అని ప్రశ్నించారు. పోలీసు లపై పంతాలకు పోవడం తగదన్నారు.

మరిన్ని వార్తలు