మార్పు దిశగా ‘బండి’ కసరత్తు

20 Jul, 2022 00:36 IST|Sakshi

రాష్ట్ర బీజేపీలో మొక్కుబడిగా పనిచేస్తున్నవారి స్థానంలో కొత్తవారికి చాన్స్‌!

సంస్థాగతంగా పార్టీ పటిష్టానికి చర్యలు 

సగం దాకా పార్టీ జిల్లా అధ్యక్షులు, మోర్చాల మార్పునకు అవకాశం 

క్షేత్రస్థాయి నుంచి పార్టీని క్రియాశీలం చేసే కార్యాచరణకు శ్రీకారం  

సాక్షి, హైదరాబాద్‌: సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేయాలన్న జాతీయ నేతల ఆదేశంతో రాష్ట్ర బీజేపీ నాయకత్వం కార్యాచరణకు సిద్ధమైంది. రాష్ట్రంలో మొక్కుబడిగా పనిచేస్తున్న వారి స్థానంలో అంకితభావంతో పనిచేసే వారిని నియమించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగా అన్ని స్థాయిల్లో పార్టీ పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ చేపట్ట డంపై దృష్టి పెట్టినట్టు పార్టీ వర్గాల సమాచారం.

ఇందులో భాగంగా రాష్ట్ర పదాధికారులు మొదలుకొని రాష్ట్ర కార్యవర్గం, మోర్చాలు, జిల్లా అధ్యక్షులు ఇలా అన్ని స్థాయిల్లో అంకితభావం కొరవడిన వారిని త్వరలోనే మారుస్తారనే ప్రచారం సాగుతోంది. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర పార్టీ కార్యవర్గంలో, మోర్చాలలో (మొత్తం ఏడు మోర్చాలు) కొన్ని మార్పులతోపాటు సగం దాకా జిల్లా అధ్యక్షులను (పార్టీ నియమావళి ప్రకారం మొత్తం 38 జిల్లాలుగా రాష్ట్ర పార్టీ విభజన) మార్చే అవకాశాలున్నాయి.

పనితీరు, ఫలితాల సాధనే ప్రాతిపదిక
గత రెండేళ్లలో రాష్ట్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వివిధ ముఖ్యమైన బాధ్యతలు చేపట్టిన వారు వాటిని ఏ మేరకు సమర్థంగా నిర్వహించార న్న దాని ప్రాతిపదికన ఈ మార్పుచేర్పులు చోటుచే సుకోనున్నట్లు సమాచారం. పార్టీపరంగా చేపట్టిన కార్యక్రమాలు, వివిధ సమస్యలపై నిర్వహించిన ఆందోళనలు, ప్రజాసంగ్రామ యాత్రకు సహకా రం, బండి సంజయ్‌ చేపట్టిన పాదయాత్ర–1,2 దశల్లో చురుకుగా పాల్గొన్నారా? పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలకు జనసమీకరణ, ఇతర ఏర్పాట్లలో ఏ మేరకు నిమగ్నమయ్యారు తదితర అంశాల ఆధారంగా ఈ మార్పులు చేయనున్నట్టు తెలిసింది.

టీఆర్‌ఎస్‌ ఎత్తులకు పైఎత్తులు వేసేలా...
రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో టీఆర్‌ఎస్‌ ఎత్తుగడలను కనిపెట్టడంతోపాటు పోటాపోటీగా దూకుడుగా వ్యవహరించే వారికి అవకాశం లభించొచ్చని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా ఎప్పటికప్పుడు సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతోపాటు పోటాపోటీ కార్యక్రమాలు చేపట్టేలా రాష్ట్ర పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా కేంద్ర మంత్రులు, ఎంపీలు, ముఖ్య నేతలు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు వెళ్లారు.

అక్కడ పర్యటించిన నేతలు పోలింగ్‌ బూత్‌ స్థాయిలో పార్టీ పనితీరు, వివిధ మోర్చాల కార్యాచరణను అధ్యయనం చేశారు. దీనికి సంబంధించిన నివేదికలను రాష్ట్ర నాయకత్వానికి వారు అందించినట్లు సమాచారం. వారు ఆ నివేదికల్లో కీలకాంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ ఎందుకు బలోపేతం కాలేకపోయింది, స్థానిక నాయకులు పార్టీని విస్తరించడంపై ఎందుకు దృష్టి సారించలేకపోతున్నారు, ఏం చేస్తే అక్కడ పార్టీని బలోపేతం చేయొచ్చనే అంశాలపై బయటి ప్రాంతాల నేతలు అందజేసిన నివేదికలకు ప్రాధాన్యత ఏర్పడింది. వాటి ప్రాతిపదికన సంస్థాగతంగా మార్పుచేర్పులకు రాష్ట్ర నాయకత్వం చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు