24న చలో ఢిల్లీ.. పార్లమెంట్‌ ముట్టడి 

20 Nov, 2022 03:31 IST|Sakshi
అభివాదం చేస్తున్న కృష్ణయ్య, ఇతర నేతలు 

కాచిగూడ: దీర్ఘకాలికంగా, అపరిష్కృతంగా ఉన్న బీసీల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 24వ తేదీన చలో ఢిల్లీ పార్లమెంట్‌ ముట్టడి కార్యక్రమాన్ని వేలాదిమందితో నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, వైఎస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన శనివారం కాచిగూ డలో ఏర్పాటు చేసిన జాతీయ బీసీ సంఘాల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లా డారు.

చట్ట సభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయంతం చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్‌ఆర్‌సీపీ రెండేళ్ల కితమే పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టిందని ఈ బిల్లుకు మద్దతుగా 14 పార్టీలు మద్దతు ఇచ్చాయని తెలిపారు.

కానీ బీజేపీ మద్దతు ఇవ్వకపోవడంతో బిల్లు పాస్‌ కాలేదన్నారు. బీసీలంతా తమ వర్గానికి చెందిన ప్రధాని నరేంద్రమోదీపై ఆశలు పెట్టుకున్నారని, ఆయన హయాంలో బీసీ బిల్లు పెట్టకపోతే చరిత్ర క్షమించదని హెచ్చరించారు. కార్యక్రమంలో నీలం వెంకటేష్, సి.రాజేందర్, అంగిరేకుల వరప్రసాద్, అనంతయ్య, రాజ్‌కుమార్, నిఖిల్, రాజు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు