బీజేపీ ధర్నా .. టీఆర్‌ఎస్‌ ర్యాలీ

15 Nov, 2022 04:32 IST|Sakshi
 బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకులు ఘర్షణ పడకుండా తోసివేస్తున్న పోలీసులు  

మునుగోడులో ఉద్రిక్తత 

గొల్ల, కురుమల ఖాతాల ఫ్రీజింగ్‌ తొలగించాలన్న రాజగోపాల్‌ 

లక్ష మందితో ప్రగతిభవన్‌ ముట్టడిస్తామని హెచ్చరిక 

మునుగోడు: నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో సోమవారం దాదాపు 3 గం. పాటు ఉద్రిక్తత నెలకొంది. ఉదయం 11 గంటల సమయంలో.. గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా ప్రభుత్వం బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేసిన నగదు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ధర్నా చేసేందుకు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సిద్ధమయ్యారు.

ఇదే సమయంలో ఇటీవలి ఉప ఎన్నికలో విజయం సాధించిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తన విజయోత్సవ సంబరాల్లో భాగంగా బైక్‌ ర్యాలీగా చండూరుకు వెళ్లేందుకు ఏర్పాట్లుచేసుకున్నారు. ఈ విషయం తెలిసిన పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి బైక్‌ ర్యాలీ వెళ్లిన తర్వాత ధర్నా చేసుకోవాలని బీజేపీ నేతలకు సూచించారు. అందుకు అంగీకరించిన రాజగోపాల్‌రెడ్డి కాస్త ఆలస్యంగా మునుగోడుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

అయితే అప్పటికే ధర్నాకు తరలివచ్చిన బీజేపీ నాయకులు భారీగా అంబేడ్కర్‌ చౌర స్తాలో గుమిగూడి నినాదాలు చేస్తూ నృత్యా లు ప్రారంభించారు. 12 గంటల సమయంలో నారాయణపురం మండలం నుంచి ర్యాలీగా వచ్చిన ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ సమయంలో ఇరుపార్టీల నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ తమ పార్టీ జెండాలను ఊపారు. ఒక దశలో ఒకరి జెండాలు మరొకరి జెండాలకు తగలడంతో ఉద్రిక్తత నెలకొంది. దాదాపు 30 నిమిషాలకు పైగా చౌరస్తాలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. చివరకు పోలీసులు వారిని నెట్టివేశారు.  

హామీలు అమలు చేసేవరకు ఉద్యమాలు 
మునుగోడు నియోజకవర్గంలోని 7,600 మంది గొల్ల, కురుమల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన నగదు ఇవ్వకుంటే లక్ష మందితో ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని రాజగోపాల్‌ రెడ్డి హెచ్చరించారు. సోమవారం బీజేపీ ధర్నాలో ఆయన మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో గొల్ల, కురుమలకు నగదు జమ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. వాటిని డ్రా చేసుకునే వీలులేకుండా ఖాతా లను ఫ్రీజ్‌ చేయించారని ఆరోపించారు.

టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేస్తే నగదు బదిలీ చేస్తామని చెప్పి.. గెలిచిన తరువాత మాట మార్చుతున్నారని విమర్శించారు. మునుగోడు ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారని, టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేయకపోతే ఆసరా పెన్షన్లు, రైతు బంధు రద్దు చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ నాయకులు ఇచ్చిన హామీలను అమలుచేసే వరకు తాను ఉద్యమాలు చేస్తానని, అవసరమైతే తన ప్రాణాలు సైతం త్యాగం చేస్తానని రాజగోపాల్‌ అన్నారు.  

పీఎస్‌కు తరలింపు.. విడుదల
ఎమ్మెల్యే వెళ్లిన తర్వాత వచ్చిన రాజగోపాల్‌రెడ్డి దాదాపు 2.30 గంటల పాటు ధర్నా చేశారు. దీంతో మునుగోడు–నల్లగొండ, మునుగోడు–చౌటుప్పల్‌ ప్రధాన రహదారులకు వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ధర్నాకు గంట పాటు సమయం ఇచ్చిన పోలీసులు ఆ తర్వాత విరమించాల్సిందిగా రాజగోపాల్‌రెడ్డితో పాటు బీజేపీ నాయకులను కోరారు. కానీ కలెక్టర్‌ వచ్చి హామీ ఇచ్చే వరకు ధర్నా విరమించబోమని వారు భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో వారిని బలవంతంగా స్టేషన్‌కు తరలించిన పోలీసులు ఆ తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. 

మరిన్ని వార్తలు