Hyderabad Gang Rape Case: సీబీఐ విచారణ జరిపించాల్సిందే.. 

4 Jun, 2022 03:10 IST|Sakshi

అత్యాచార ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: సామూహిక అత్యాచార కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఈ కేసులో హోంమంత్రి మనవడు, ఎంఐఎం ఎమ్మెల్యే, వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ కుమారులతోపాటు టీఆర్‌ఎస్‌ నాయకుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయని అన్నారు. వారందరిపై కేసుల్లేకుండా తప్పించాలని సీఎంవో నుంచి పోలీసులకు ఆదేశాలొచ్చాయని ఆరోపించారు.

ఈ మేరకు కేసును నీరుగార్చేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. గతనెల 28న జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఒక బాలికపై అత్యాచారం జరిగిందని, ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. శుక్రవారంరాత్రి బీజేపీ కార్యాలయంలో సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ ఇన్ని రోజులు గడిచినా సీఎం కేసీఆర్‌ స్పందించకపోవడం శోచనీయమని అన్నారు.

ఈ ఘటనను గోప్యంగా ఎందుకు ఉంచారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘పోలీసులు, ప్రభుత్వ తీరు వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతోంది. అత్యాచారాలకు, నేరస్తులకు హైదరాబాద్‌ అడ్డాగా మారింది. హోంమం త్రిపైనే ఆరోపణలొస్తుంటే, ట్విట్టర్‌ పిట్ట హోంమంత్రితోనే విచారణ జరిపించాలని ఆదేశిస్తారా? ట్విట్టర్‌ పిట్ట చెబితే తప్ప స్పం దించరా? దీనిని ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలపై మతంరంగు పులిమి ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. అత్యాచారానికి గురైన బాలికది ఏ మతమో మాకు ఇంతవరకు తెలియదు. బీజేపీ మానవతా దృక్పథంతో మాత్రమే స్పందిస్తోంది’అని వ్యాఖ్యానించారు.  

ఆ పార్టీ నిర్వహించిందెవరో.. 
జూబ్లీహిల్స్‌ పరిధిలోని ఆమ్నీషియా పబ్‌లో పార్టీ నిర్వహించిందెవరు, ఆ పార్టీకి బాధిత బాలికను పిలిచిందెవరు, అత్యాచారం చేసినవారు ఎవరెవరో స్పష్టంగా ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా పోలీసులు ఎందుకు స్పందించలేదని సంజయ్‌ ప్రశ్నించారు. ఎఫ్‌ఐఆర్‌లో నిందితుల పేర్లు ఎందుకు నమోదు చేయలేదని నిలదీశారు.

‘అత్యాచారం జరిగి 5 రోజులైనా నిందితులను ఎందుకు అరెస్ట్‌ చేయడంలేదు. బాలికపై అత్యాచారం జరిగితే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలి, మేజిస్ట్రేట్‌ ఎదుట వాంగ్మూలం రికార్డు చేయాలి. కానీ, ఇక్కడెందుకు ఆ పనిచేయడం లేదు? సీసీ ఫుటేజీలో అన్ని ఆధారాలు రికార్డై ఉన్నాయి. ఇన్ని రోజులపాటు సీసీ పుటేజీలు ఎందుకు దొరకలేదు? హైదరాబాద్‌లో మహిళలకు రక్షణ లేదా?’ అని నిలదీశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్లిప్తత వల్ల పోలీస్‌ వ్యవస్థ మీద రాష్ట్ర ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది’ అని సంజయ్‌ ధ్వజమెత్తారు.    

మరిన్ని వార్తలు