ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారు

28 Sep, 2021 03:09 IST|Sakshi
ఇల్లంతకుంటలో ప్రజా సమస్యలు వింటున్న బండి సంజయ్‌ 

కేసీఆర్‌కు నిరుద్యోగుల ఉసురు తగులుతుంది

ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్‌

సిరిసిల్ల: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్, ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సోమవారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో మాట్లాడుతూ, విద్యావలంటీర్లను, ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించారని, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారి ఉసురు సీఎం కేసీఆర్‌కు తగులుతుందని విమర్శించారు.

బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం కేసీఆర్‌ను జైల్లో పెడతామన్నారు. చాలా పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే, సీఎం కేసీఆర్‌ తన బొమ్మను పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. దళితుల కోసం ప్రధాని మోదీ ‘స్టాండప్‌ ఇండియా’పథకాన్ని అమలు చేస్తున్నారని, పరిశ్రమల స్థాపనకు ఒక్కో దళితుడికి రూ.కోటి నుంచి రూ.5 కోట్ల వరకు ష్యూరిటీ, వడ్డీ లేకుండా రుణాలిచ్చే పథకాన్ని ప్రవేశపెట్టారని వివరించారు. దళితబంధు పథకాన్ని రాష్ట్రమంతటా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

కాగా, బతుకమ్మ పండుగను కూడా డిస్కో డ్యాన్స్‌లా చేశారని, బతుకమ్మ పండుగతో కవితకు ఏం సంబంధమని సంజయ్‌ ప్రశ్నించారు. ఎంఐఎం పార్టీ అంటే సీఎం కేసీఆర్‌కు వణుకుపుడుతుందని, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అనుమతి ఇస్తే, పాకిస్తాన్‌ వెళ్లి కాషాయ జెండా ఎగురవేస్తామన్నారు. కర్ణాటక ఎంపీ మునుస్వామి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు