కిసాన్‌మోర్చా ముట్టడి ఉద్రిక్తం

30 Oct, 2021 02:49 IST|Sakshi
మహేష్‌యాదవ్‌ను పరామర్శిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 

పోలీసులతో తోపులాట.. పలువురికి గాయాలు  

వరిసాగుపై ఆంక్షలు వద్దంటూ కార్యకర్తల నిరసన

సాక్షి, హైదరాబాద్‌/రాంగోపాల్‌పేట: వరిసాగు చేయొద్దంటూ మంత్రులు సూచనలు చేయడం, కొన్ని జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీచేయడంపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. శుక్రవారం బీజేపీ కిసాన్‌మోర్చా చేపట్టిన వ్యవసాయ కమిషనరేట్‌ ముట్టడి ఉద్రిక్తతలకు దారితీసింది. కమిషనరేట్‌లో కి దూసుకెళ్లేందుకు యత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో పలువురు కార్యకర్తలు, నాయకులు గాయపడ్డారు.

గాయపడిన హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా అర్బన్‌ కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు మహేష్‌ యాదవ్, కామారెడ్డి జిల్లాకు చెందిన పాటిమీది గంగారెడ్డి తదితరులను ఆసుపత్రులకు తరలించారు. పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. గత ఏడేళ్లుగా కేంద్రం సహకారంతో ధాన్యం కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈసారి వరిసాగుపై ఆంక్షలు విధించడంలో కుట్ర దాగి ఉందని కిసాన్‌మోర్చా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు.

వ్యవ సాయ ఉచిత విద్యుత్‌ హామీ నుండి తప్పించుకోవడానికే సీఎం కేసీఆర్‌ ఈ ఆంక్షలు విధించారన్నారు. కార్యక్రమంలో కిసాన్‌మోర్చానేతలు గోలి మధుసూదన్‌రెడ్డి, పాపయ్య గౌడ్, పడమటి జగన్‌మోహన్‌ రెడ్డి , బునేటి కిరణ్, అంజన్నయాదవ్‌ పాల్గొన్నారు.  

ధాన్యం కొనొద్దని కేంద్రం చెప్పలేదు: సంజయ్‌ 
రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయొద్దని కేంద్రం ఎక్కడా చెప్పలేదని, అలాంటిదేమైనా ఉంటే బహి రంగ పరచాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సం జయ్‌ అన్నారు. లాఠీచార్జిలో గాయపడి సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుత్నున ఆ పార్టీ కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు మోహన్‌రెడ్డిని  పరామర్శించారు. అరెస్టు చేసిన కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 

అరుణ, విజయశాంతి ఖండన  
గతేడాది నియంత్రిత సాగు పేరిట రైతులను వం చించిన కేసీఆర్‌ ఈసారి నియంతగా ప్రవర్తిస్తూ నిర్బంధ వ్యవసాయం చేయాలని బెదిరిస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఒక ప్రకటనలో ఆరోపించారు. రైతులపక్షాన ఉన్న వారిపై లాఠీచార్జీ చేయడం అప్రజాస్వామికమని ఆ పార్టీ సీనియర్‌ నేత విజయశాంతి విమర్శించారు.  

మరిన్ని వార్తలు