బండి పాదయాత్ర ఏర్పాట్లపై పార్టీ నిమగ్నం

11 Aug, 2021 02:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈనెల 24 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ చేపట్టనున్న పాద యాత్రకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై పార్టీ యంత్రాంగం దృష్టి పెట్టింది. మంగళవారం బీజేపీ కార్యాలయంలో పాదయాత్ర ప్రచార విభాగం, ప్రచార సామాగ్రి వితరణ విభాగం, అలంకరణ విభాగాలకు చెందిన ప్రముఖ్‌లతో పాదయాత్ర ప్రముఖ్‌ డాక్టర్‌ జి.మనోహర్‌రెడ్డి, సహ ప్రముఖ్‌ తూళ్ల వీరేందర్‌ గౌడ్‌ సమావేశమయ్యారు. వీటికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. పాద యాత్ర సాగనున్న మార్గంలో వసతి, రక్షణ, ప్రచార రథాలు, భోజన ఏర్పాట్ల కోసం స్థలాల పరిశీలనలో కమిటీ సభ్యులు నిమగ్నమయ్యారు. మొదటిదశ యాత్రలో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మంగళవారం ఈ సభ్యులు పర్యటించారు. పాదయాత్రలో గోల్కొండ కోట, ఆరె మైసమ్మ దేవాలయం, మొయినాబాద్‌ క్రాస్‌ రోడ్, చేవెళ్ల క్రాస్‌ రోడ్, వికారాబాద్, మోమి న్‌పేట, సదాశివపేట ప్రాంతాల్లో బహిరంగసభలకు అనువైన స్థలాలను పరిశీలించారు.  

మరిన్ని వార్తలు