ఇలా లాభం లేదు.. ఇంకా కృషి చేయాలి!

6 May, 2022 03:06 IST|Sakshi
పదాధికారుల సమావేశంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా. చిత్రంలో పొంగులేటి, మురళీధర్‌రావు, డీకే అరుణ, తరుణ్‌ఛుగ్, బండి, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, జితేందర్‌రెడ్డి, ఇంద్రాసేనారెడ్డి 

పశ్చిమబెంగాల్‌ పరిస్థితి ఇక్కడ పునరావృతం కావొద్దు 

పార్టీలో చేరికలకు తలుపులు తెరవండి 

మీకంటే పెద్ద నాయకులను చేర్చుకోండి 

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతిని సాక్ష్యాలతో బయటపెట్టండి 

పార్టీ బాగుంటేనే మీకూ గౌరవం, విలువ.. 

రాష్ట్ర నేతలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దిశానిర్దేశం

మహబూబ్‌నగర్‌ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  ‘‘తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే వాతావరణం ఉన్నా.. మీ కృషి ఏమాత్రం సరిపోదు. ఇలాగైతే కష్టం. అవకాశం మళ్లీ రాదు. వృథా చేసుకోవద్దు. పశ్చిమబెంగాల్‌లో కొన్ని తప్పులతో అధికారంలోకి రాలేకపోయాం. బెంగాల్‌ పరిస్థితి ఇక్కడ పునరావృతం కావొద్దు. చేరికలకు తలుపులు బార్లా తెరవండి. మీకంటే బలమైన, ప్రజల్లో ఆదరణ ఉన్న నాయకులను పార్టీలో చేర్చుకోండి..’’అని రాష్ట్ర నేతలకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారు.

కొత్తవారు వస్తే తమ కుర్చీ ఏమవుతుందోనని భయపడొద్దన్నారు. గురువారం మహబూబ్‌నగర్‌లోని భూత్‌పూర్‌లో రాష్ట్ర పదాధికారులు, జాతీయ కార్యవర్గసభ్యులు, జిల్లాలు, మోర్చాల అధ్యక్షులు, ముఖ్య నేతలతో జేపీ నడ్డా సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, నేతల తీరు, చేపట్టాల్సిన కార్యాచరణ గురించి సూచనలు చేశారు. 

అన్ని వర్గాలను సమీకరించండి 
దళితులు, ఇతర వర్గాల ప్రజలందరినీ సమీకరించాలని.. పార్టీ అధికారంలోకి వస్తే అండగా నిలుస్తామని భరోసా ఇవ్వాలని నడ్డా సూచించారు. ‘‘నా సంగతేంటి? అని స్వార్థంతో ఆలోచించకుండా పార్టీ విస్తరణకు, ప్రజల మద్దతు పొందేందుకు కృషి చేయండి. కాంగ్రెస్‌ ఇప్పుడు అక్కాతమ్ముళ్ల పార్టీగా మిగిలింది. ఆ పార్టీ వారిని రెండు చేతులా ఆహ్వానించండి.

మీ కంటే పెద్ద వారిని, ప్రజల్లో ఎక్కువ, ఆదరణ ఉన్న వారిని చేర్చుకోండి. పార్టీ బాగుంటేనే మీకు గౌరవం, విలువ. మీరు ఏదో దాచిపెడితే అది ఎవరికీ తెలియదని అనుకోవద్దు. ప్రతీ విషయాన్ని ప్రజలు, కార్యకర్తలు గమనిస్తుంటారు. ఫ్లెక్సీలో ఎవరి ఫొటో పెద్దగా, ఎవరిది చిన్నదిగా ఉంది. ఎవరి ఫొటో లేదు. ఎవరి పేరు ముందు, ఎవరిది వెనక వంటి అంశాలనూ గమనిస్తుంటారని గుర్తుంచుకోవాలి..’’అని స్పష్టం చేశారు. 

అవినీతిని సాక్ష్యాధారాలతో బయటపెట్టండి! 
‘‘కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయింది. ప్రాజెక్టుల్లో అవినీతి కట్టలు తెంచుకుంది. కాళేశ్వరంలో ఎంతస్థాయిలో అక్రమాలు జరిగాయో మీరు అధ్యయనం చేసి సాక్ష్యాలు, ఆధారాలతో బయట పెట్టగలిగారా? కేంద్రం నుంచి తెలంగాణకు ఎన్నిరకాల నిధులు, ఏయే పద్ధతుల్లో వచ్చాయో ప్రజలకు వివరించారా? కేంద్ర నిధుల దుర్వినియోగం లెక్కలు తీశారా? పీఎం ఆవాస్‌ యోజనను కాదని డబుల్‌ బెడ్రూం ఇళ్లు అంటూ టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఏ విధంగా వ్యవహరించిందో ప్రజలకు చెప్పండి. నిర్లక్ష్యం వద్దు. కష్టపడి, ఇష్టపడి పనిచేస్తేనే ప్రతిఫలం ఉంటుంది’’అని నడ్డా స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ నెలవారీ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని.. పార్టీ ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

50శాతమే సిద్ధమవుతున్నట్టు ఉంది! 
ఎన్నికల్లో గెలవాలంటే వంద శాతం పనిచేయాలని.. రాష్ట్రంలో పార్టీ నాయకుల పరిస్థితి చూస్తే 50శాతమే ప్రజలను కలుస్తున్నట్టు ఉందని నడ్డా పేర్కొన్నారు. పేదలు, దళితులు, ఇతర అణగారిన ప్రజలను కలుపుకొని వెళ్తేనే మంచి ఫలితాలు వస్తాయని స్పష్టం చేశారు. ‘‘అంతా ఇప్పటినుంచే పేదలుండే బస్తీల్లోకి వెళ్లండి. వారి సమస్యల పరిష్కారానికి కృషిచేయండి. నేను మళ్లీ తెలంగాణకు వచ్చేప్పటికీ ఈ పనులన్నీ చేస్తున్నామని నాకు చెప్పగలగాలి.

పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా.. ముందస్తు ప్రణాళిక లేకుండా పర్యటన చేయకండి. ఏం మాట్లాడాలో ముందే సిద్ధంకండి’’అని సూచించారు. పార్టీ రాష్ట్ర చీఫ్‌ బండి సంజయ్‌ ఎండను సైతం లెక్కచేయకుండా పాదయాత్ర చేస్తున్నారని అభినందించారు. కాగా.. పోలింగ్‌ బూత్‌ స్థాయి కమిటీల విషయంలో తెలంగాణ వెనుకబడి ఉందని.. వాటి బలోపేతంపై దృష్టిపెట్టాలని పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌ నేతలకు సూచించారు.

సమావేశంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర చీఫ్‌ బండి సంజయ్, సీనియర్‌ నేతలు మురళీధర్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, వివేక్‌ వెంకటస్వామి, ఎంపీలు బాపురావు, ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, ఎం.రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

రాహుల్‌ సభ స్పాన్సర్‌ టీఆర్‌ఎస్సే: బండి సంజయ్‌ 
వరంగల్‌లో కాంగ్రెస్‌ నిర్వహిస్తున్న రాహుల్‌ బహిరంగసభ ముమ్మాటికీ టీఆర్‌ఎస్‌ స్పాన్సర్డ్‌ సభేనని బీజేపీ రాష్ట్ర చీఫ్‌ బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. బీజేపీకి పెరుగుతున్న ప్రజాదరణ, పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందనను ఓర్వలేక రాహుల్‌తో పోటీ సభ పెట్టించారని విమర్శించారు. కాగా భూత్పూర్‌ బహిరంగ సభలో పాల్గొనేందుకు జేపీ నడ్డా గురువారం మధ్యాహ్నం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఆయనకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తరుణ్‌చుగ్, ఇతర సీనియర్‌ నేతలు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. 

మరిన్ని వార్తలు