ప్రజల్లోకి మోదీ సర్కారు విజయాలు

20 May, 2022 01:45 IST|Sakshi

30 నుంచి బీజేపీ ప్రచార కార్యక్రమాలు 

ఇది పూర్తయ్యాక ప్రధాని మోదీ బహిరంగ సభ! 

జూన్‌ 10 నుంచి మూడోవిడత పాదయాత్ర 

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలో ఎనిమిదేళ్ల నరేంద్రమోదీ ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లో ప్రచారం చేయడంతో పాటు, రాష్ట్రంలో కేసీఆర్‌ సర్కార్‌ హయాంలో వైఫల్యాలు, అమలుకాని హామీలను ఎండగట్టేందుకు రాష్ట్ర బీజేపీ సిద్ధమవుతోంది.

మే 30 నుంచి జూన్‌ 15వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా చేపడుతున్న విజయోత్సవాల్లో భాగంగా కేంద్రం వివిధ వర్గాలకు చేకూర్చిన ప్రయోజనాలు, వివిధ రంగాల్లో సాధించిన విజయాలు, గతంలో కాంగ్రెస్‌ పాలనతో పోల్చితే జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వంటివి ప్రధానంగా ప్రస్తావించనున్నారు. తెలంగాణ విషయానికొస్తే.. జూన్‌ మొదటివారం కల్లా రాష్ట్రంలో కేసీఆర్‌ పాలనలో వైఫల్యాలను ఎత్తిచూపాలని పార్టీ నిర్ణయించింది. 

జూన్‌ 1 నుంచి సంజయ్‌ పర్యటన 
మరోవైపు రాష్ట్రంలో నెలకు పది రోజుల పాటు రోజుకు రెండు లేదా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి బూత్‌ కమిటీల నియామక ప్రక్రియ పూర్తి చేసేలా కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా జూన్‌ 1 నుంచి 10 దాకా తొలివిడత పర్యటనను రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ చేపడుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని రాజకీయ పరిస్థితులు, టీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత ఏ మేరకుంది, ప్రధాన పార్టీలు, నాయకుల బలాబలాలు గురించిన సమాచారం సేకరణకు కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోనున్నట్టు పార్టీవర్గాల సమాచారం.

దీంతోపాటు జూన్‌ 10 నుంచి 30 దాకా మూడోవిడత పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఇలా ప్రతినెలా మొదటి పదిరోజులు శాసనసభా స్థానాల పరిధిలో పర్యటించి బూత్‌ కమిటీల నియామక కార్యక్రమాన్ని, మిగతా ఇరవై రోజులు ప్రజాసంగ్రామ యాత్రను నిర్వహించనున్నారు. ఆగస్టు కల్లా రాష్ట్రంలో మొత్తం పోలింగ్‌ బూత్‌లలో పార్టీ కమిటీల నియామకం పూర్తిచేసి, మొత్తం 34 వేల బూత్‌లలో 6.8 లక్షల మంది కార్యకర్తలను నియమించాక ప్రధాని మోదీ ముఖ్యఅతి«థిగా భారీ బహిరంగసభ నిర్వహించాలని రాష్ట్ర పార్టీ భావిస్తోంది.

మరిన్ని వార్తలు