క్షేత్రస్థాయిలో బలపడదాం 

23 May, 2022 01:12 IST|Sakshi

పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడంపై రాష్ట్ర బీజేపీ దృష్టి 

పోలింగ్‌ బూత్‌ కమిటీల ఏర్పాటుకు ‘బూత్‌ స్వశక్తీకరణ’ 

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తల నియామకం 

మోదీ ప్రభుత్వం అభివృద్ధి, కేసీఆర్‌ వైఫల్యాలపై రాష్ట్రవ్యాప్త ప్రచారం 

నేటి పదాధికారుల భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్న పార్టీ 

సాక్షి, హైదరాబాద్‌: పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడంపై రాష్ట్ర బీజేపీ దృష్టి కేంద్రీకరించింది. ఏడాదిన్నరలోగా అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో పోలింగ్‌ బూత్, సమన్వయ, ఇతర కమిటీల నియామక ప్రక్రియను పూర్తి చేసే చర్యలు చేపట్టింది. సోమవారం బండి సంజయ్‌ అధ్యక్షతన రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జుల సమావేశం జరగనుంది.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్, పార్టీ జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్‌జీ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ నేతలు డీకే అరుణ, లక్ష్మణ్, రాజాసింగ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నారు. పార్టీపరంగా చేపట్టనున్న కార్యక్రమాలను సమావేశంలో ఖరారు చేయనున్నారు.  

జూలై 31 కల్లా బూత్‌ కమిటీలు 
ఈ నెల 31 నుంచి జులై 31 వరకు రాష్ట్రంలో పోలింగ్‌ బూత్‌ కమిటీల నియామకం పూర్తి చేసేలా ‘బూత్‌ స్వశక్తీకరణ’కార్యక్రమం చేపట్టనున్నారు. బూత్‌ కమిటీల ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తిచేసేందుకు అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నారు. వీళ్లు నియోజకవర్గాల్లో పర్యటించి మండల, అసెంబ్లీ కన్వీనర్ల సమన్వయంతో నెల, నెలన్నరలో అన్ని పోలింగ్‌ బూత్‌లలో కమిటీ సభ్యులను నియమించనున్నారు.

కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై ‘సేవా, సుపరిపాలన, గరీబ్‌ కళ్యాణ్‌ యోజన’పేరిట వచ్చే నెల 1–15 తేదీల మధ్య రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలను సమావేశంలో నిర్ణయిస్తారు. ప్రజాసంగ్రామ యాత్ర–2పై సమీక్షతో పాటు వచ్చే నెల 23 నుంచి 20 రోజులు చేపట్టనున్న పాదయాత్ర–3పై చర్చిస్తారు.  

కార్యకర్తలతో భారీ సభ 
కేంద్రంలోని మోదీ సర్కారు 8 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ కార్యకమాలపై వచ్చే నెల 1 నుంచి 15 దాకా ప్రచార కార్యక్రమాలను పార్టీ నిర్వహించబోతోంది. 8 ఏళ్ల టీఆర్‌ఎస్‌ సర్కారు వైఫల్యాలు, అప్రజాస్వామిక విధానాలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావదినం సందర్భంగా రాష్ట్ర సర్కారు వైఫల్యాలపై తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులతో హైదరాబాద్, వరంగల్‌లలో సమావేశాలు నిర్వహించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు.

జిల్లా, మండల స్థాయిల్లో ఇలాంటి భేటీలు నిర్వహించాలని అనుకుంటున్నారు. అలాగే వచ్చే నెల 6 నుంచి 16 దాకా రోజుకు రెండు, మూడు అసెంబ్లీ స్థానాల పరిధిలో సంజయ్‌ పర్యటించి పోలింగ్‌ బూత్‌ కమిటీ సభ్యుల నియామక ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. సెప్టెంబర్‌ 17న మోదీ జన్మదినం, హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలింగ్‌ బూత్‌ కమిటీ సభ్యులు, కార్యకర్తలతో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రధానిని ఆహ్వానించాలని సంజయ్‌ భావిస్తున్నారు.    

మరిన్ని వార్తలు