మునుగోడుపై బీజేపీ ‘ఫుల్‌ ఫోకస్‌’! షా, నడ్డాల పర్యవేక్షణలో ఎన్నికల వ్యూహరచన

30 Aug, 2022 01:38 IST|Sakshi

కచ్చితంగా గెలవాలన్న లక్ష్యంతో ఎన్నికల వ్యూహాలు 

గ్రామం నుంచి నియోజకవర్గస్థాయి వరకు కార్యాచరణ ప్రణాళిక 

ఎన్నికల ఇన్‌చార్జీలుగా వివేక్‌ వెంకటస్వామి, గంగిడి మనోహర్‌రెడ్డి? 

5, 6, 7 తేదీల్లో ఇక్కడే మకాం వేయనున్న తరుణ్‌ ఛుగ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉపఎన్నికపై బీజేపీ అధినాయకత్వం పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. కచ్చితంగా గెలిచి రాష్ట్రంలో పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణను నిరూపించుకోవాలని ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దుబ్బా క, హుజూరాబాద్‌ తరువాత మునుగోడులోనూ గెలవడం ద్వారా సీఎం కేసీఆర్, అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ గ్రాఫ్‌ క్రమంగా పడిపోతున్నదనే విషయం ప్రజలకు తేటతెల్లం చేయడానికి దోహదపడుతుందని అంచనా వేస్తోంది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బలంగా ముందుకెళ్లేందుకు, టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మునుగోడులో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచితీరాలని రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలను కేంద్రహోంమంత్రి అమిత్‌ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగానే అమిత్‌ షా, నడ్డాల పర్యవేక్షణలో ఎన్నికల వ్యూహరచన ఖరారు చేస్తున్నారు.  

పాదయాత్ర–4 సందర్భంగానూ పర్యవేక్షణ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆధ్వర్యంలో వచ్చే నెల 12 నుంచి మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో చేపడుతున్న ప్రజాసంగ్రామయాత్ర–4 ముగింపు సభను అదేనెల 22 లేదా 23 తేదీల్లో రంగారెడ్డి జిల్లా శివారు, మునుగోడుకు కాస్త దగ్గరగా ఉండే అబ్దుల్లాపూర్‌మెట్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. ఉప ఎన్నికల ప్రచారానికి ఊపు తెచ్చేందుకు ఈ సభలో అమిత్‌ షా లేదా నడ్డా పాల్గొనే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల సమాచారం.

మునుగోడుకు సంబంధించిన ప్రచార నిర్వహణపై నాయకత్వం పర్యవేక్షణకు అనువుగా ఉంటుందనే మల్కాజిగిరి ఎంపీ సీటు పరిధిలో పాదయాత్ర–4ను చేపడుతున్నట్టు చెబుతున్నారు. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గస్థాయి వరకు పకడ్బందీగా ముందుకెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.  

3 రోజులు ఇక్కడే మకాం వేయనున్న తరుణ్‌ ఛుగ్‌ 
వచ్చే నెల 5, 6, 7 తేదీల్లో రాష్ట్రంలో మకాం వేయనున్న ఆ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జీ తరుణ్‌ ఛుగ్‌ మునుగోడు ప్రత్యేక కార్యా చరణను ఖరారు చేయనున్నారు. మును గోడు సిట్టింగ్‌ ఎమ్మెల్యే, బీజేపీ తరఫున పోటీచేస్తున్న కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌ రెడ్డికి సన్నిహితుడిగా ఉన్న పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్‌ వివేక్‌ వెంకటస్వామిని ఈ ఎన్నికల ఇన్‌చార్జిగా నియమించనున్నారు.

ఈ స్థానం నుంచి గతంలో పోటీ చేసిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పాదయాత్ర ప్రముఖ్‌ డాక్టర్‌ గంగిడి మనోహర్‌రెడ్డిని కూడా మరో ఇన్‌చార్జీగా నియమించనున్నట్టు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలోని ప్రతీ మండలం, మున్సిపాలిటీలో ముగ్గురేసి రాష్ట్ర ముఖ్యనేతలను ఇన్‌చార్జీలుగా నియమిస్తున్నారు. ఈ జిల్లాకు చెందిన పార్టీ నాయకులతోపాటు మునుగోడుకు సంబంధం లేని బయటినేతలకు ముఖ్యమైన బాధ్యతలను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో వివిధ జిల్లాల మాజీ అధ్యక్షులు, కార్యదర్శులు, నేతలకు ఎన్నికల ప్రచారం, బూత్‌స్థాయి కమిటీల పర్యవేక్షణ, ఇతర కీలక బాధ్యతలు అప్పగించేలా కార్యాచరణ ఖరారైనట్లు పార్టీవర్గాల సమాచారం.    

మరిన్ని వార్తలు