బేగంపేటలో మోదీ స్వాగత సభ?

25 May, 2022 01:26 IST|Sakshi

ఎయిర్‌పోర్టు ఆవరణలో నిర్వహణకు ఏర్పాట్లు 

అనుమతి కోరుతూ ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు లేఖ 

ఐఎస్‌బీ వార్షికోత్సవం కోసం రేపు నగరానికి ప్రధాని 

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెసేతర ప్రధానిగా ఎనిమిదేళ్ల పాలన పూర్తి చేసుకుని కొత్త రికార్డ్‌ను నెలకొల్పిన నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం పలకాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. 26న ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) 20వ వార్షికోత్సవం.. హైదరాబాద్, మొహాలీ క్యాంపస్‌లకు చెందిన పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాం స్నాతకోత్సవంలో ప్రధాని పాల్గొననున్నారు.  

పార్టీ ముఖ్య నేతలతో సమావేశం.. 
ప్రధాని మోదీకి సాదర స్వాగతంతో పాటు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, పదాధికారులు, ముఖ్యనేతలు, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నాయకుల పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏ కొంత సమయం చిక్కినా ఎయిర్‌పోర్టు లాంజ్‌లో మోదీతో రాష్ట్ర పార్టీ ముఖ్యులు సమావేశమయ్యే అవకాశముంది.

బేగంపేటలో ప్రధానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు స్వాగతం పలుకుతారు. అనంతరం ఎయిర్‌ పోర్టు పార్కింగ్‌ ప్లేస్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలకు అక్కడే ఏర్పాటు చేసే వేదికపై నుంచి లేదా ఏదైనా ఓపెన్‌ టాప్‌ జీప్‌ నుంచి ప్రధాని అభివాదం చేసేందుకు వీలుగా రాష్ట్ర పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. దీనికి అనుమతి కోరుతూ ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు లేఖ కూడా పంపించింది. దీనికి తప్పకుండా అనుమతి లభిస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆయన కాసేపు మాట్లాడే అవకాశం ఉందని పార్గీ వర్గాలు వెల్లడించాయి. 

8 ఏళ్ల పాలనను కీర్తిస్తూ హోర్డింగ్‌లు... 
హెచ్‌సీయూ నుంచి రోడ్డు మార్గాన ఐఎస్‌బీకి వెళ్లే దారిలో రోడ్డుకు ఇరువైపులా మోదీ స్వాగత ఫ్లెక్సీలు, తోరణాలు, 8 ఏళ్ల పాలనను కీర్తిస్తూ హోర్డింగ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ప్రజలు, కార్యకర్తలు జాతీయ జెండాలు, బీజేపీ జెండాలు ధరించి ఆహ్వానం పలికేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని ఇంకా విదేశీ పర్యటన నుంచి దేశానికి తిరిగి టరానందున, ఆయన హైదరాబాద్, చెన్నైకు సంబంధించిన మినిట్‌ టు మినిట్‌ ప్రోగ్రామ్, అధికారిక షెడ్యూల్‌ ఇంకా విడుదల కాలేదని అధికారవర్గాలు వెల్లడించాయి. 

ప్రధాని పర్యటన ఇలా..
♦26న మధ్యాహ్నం 1.25 గంటల ప్రాంతంలో ప్రధాని ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుంటారు.  
♦అక్కడే 15 నిమిషాలు ముఖ్యనేతలను కలుసుకుంటారు. పార్కింగ్‌లో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి పార్టీ కార్యకర్తలు, ప్రజలకు అభివాదం చేస్తారు.  
♦అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి వెళ్తారు. 
♦హెలిప్యాడ్‌లో దిగి రోడ్డు మార్గాన 2 కి.మీ. ఐఎస్‌బీకి ప్రయాణిస్తారు.  
♦మధ్యాహ్నం 2 నుంచి 3.15 గంటల మధ్య ఐఎస్‌బీ వార్షికోత్సవం తదితర కార్యక్రమాల్లో పాల్గొంటారు.  
♦సాయంత్రం 4 గంటలకు తిరిగి బేగంపేటకు చేరుకుని ప్రత్యేక విమానంలో చెన్నై వెళతారు.   

మరిన్ని వార్తలు