-

నవంబర్‌లో ‘ప్రజాసంగ్రామ యాత్ర’

19 Oct, 2021 01:54 IST|Sakshi

రెండోదశ పాదయాత్రకు బీజేపీ జాతీయ నాయకత్వం పచ్చజెండా వచ్చేనెల 10 తర్వాత చేపట్టే అవకాశ

సాక్షి, హైదరాబాద్‌: రెండో దశ ‘ప్రజాసంగ్రామ యాత్ర’కు రాష్ట్ర బీజేపీ సన్నద్ధమవుతోంది. వచ్చే నెల 10 తర్వాత నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పాదయాత్రకు సంబంధించి జాతీయ నాయకత్వం నుంచి ఆమోదం లభించినట్లు సమాచారం. ఏర్పాట్లకు సంబంధించి వివిధ కమిటీల పునర్‌ వ్యవస్థీకరణ, మొత్తం యాత్రలో ఉండగలిగే నేతలు, ప్రజల దృష్టిని ఆకర్షించేలా వినూత్న కార్యక్రమాల రూపకల్పనపై పార్టీపరంగా కసరత్తు ఊపందుకుంది.

నవంబర్‌లో జరిగే పార్లమెంటు సమావేశాలను దృష్టిలో ఉంచుకుని పాదయాత్ర షెడ్యూల్‌ ఖరారు చేయనున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ఆగస్టు 28 నుంచి అక్టోబర్‌ 2 వరకు తొలిదశ పాదయాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ 17న ‘హైదరాబాద్‌ విమోచన దినోత్సవం’ సందర్భంగా నిర్మల్‌ సభా వేదికగా తెలంగాణలో మొత్తం ఐదు విడతల్లో ప్రజాసంగ్రామ యా త్ర చేపట్టనున్నట్లు బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఎన్నికల వరకు సన్నద్ధంగా.. 
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమ యం ఉన్నందున అప్పటిదాకా పాదయాత్ర, ఇతర కార్యక్రమాల రూపంలో పార్టీ అధ్యక్షుడు మొదలు కుని వివిధ స్థాయిల నేతలు, కార్యకర్తలు, అను బంధ విభాగాలు భాగస్వాములయ్యేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.  తొలిదశ పాదయాత్రలో కీలకంగా వ్యవహరించిన ముఖ్యనేతలు ఇటీవల ఢిల్లీ వెళ్లి జాతీయ నాయకత్వానికి ఆయా అంశాలను వివరించి, రెండోదశ యాత్రకు సూత్రప్రాయ అంగీకారం తీసుకున్నారు. ఈ సందర్భంగా  జాతీయ స్థాయిలోని పాదయాత్ర పర్యవేక్షకులు పలు సూచనలు చేసినట్లు సమాచారం. 

తొలిదశ లోటుపాట్లను అధిగమిస్తూ.. 
తొలిదశ పాదయాత్రలోని లోటుపాట్లు అధిగమించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. మొదటిదశ పాదయాత్ర జరిగిన తీరుపై జాతీయపార్టీ తరఫున పర్యవేక్షించిన ఆరుగురు సభ్యుల సాంకేతిక బృందం పార్టీ నాయకత్వానికి నివేదిక సమర్పించింది. తొలివిడత యాత్రకు స్పందన బాగానే ఉన్నా రెండోదశ మరింత విస్తృతంగా చేపట్టేలా పలు సూచనలు చేసింది.

గ్రామీణ ప్రాంత ప్రజలను కలుసుకుని, సమస్యలు తెలుసుకుని, బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందనే దానిపై స్పష్టతనిస్తూ సాగాలని సూచించింది. యాత్ర సాగుతున్న రూట్‌లోని నియోజకవర్గాల్లోని పార్టీ కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని, ఈ సందర్భంగా ఇతర పార్టీల ముఖ్యమైన నేతలను చేర్చుకునేందుకు ప్రాధాన్యమివ్వా లని సూచనలు చేసినట్లు సమాచారం.   

మరిన్ని వార్తలు