అంబేడ్కర్‌ రాజ్యాంగమంటే గిట్టదా?

8 Feb, 2022 01:51 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న బండి సంజయ్‌. చిత్రంలో రామచంద్రరావు తదితరులు 

కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజం 

రాజ్యాంగాన్ని తిరగరాయాలన్న కేసీఆర్‌పై చట్టపరంగా పోరాడాలి

సాక్షి, హైదరాబాద్‌: రాజ్యాంగాన్ని తిరగరాయా లన్న సీఎం కేసీఆర్‌పై న్యాయవాదులు చట్టపరంగా పోరాడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. అంబేడ్కర్‌ రాజ్యాంగ మంటే కేసీఆర్‌కు గిట్టదని, అందుకే కల్వకుంట్ల రాజ్యాంగం తీసుకురావాలనుకుంటున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో జరిగే అవినీతి బయటకు రావొద్దనే ఉద్దేశంతో ప్రజలను దారి మళ్లించేందుకు జరుగుతున్న కుట్రలో భాగమే ఇది అన్నారు.

అయితే కేసీఆర్‌ దారి మళ్లిస్తున్నా బీజేపీ మాత్రం ఆ ఉచ్చులో పడబోదన్నారు.ఏ రాజ్యాంగం మీద సీఎంగా ప్రమాణం చేశారో.. అదే రాజ్యాంగం ద్వారా మరో వ్యక్తి సీఎం కాకూడదని కేసీఆర్‌ భావిస్తున్నారని, అందుకే రాజ్యాంగాన్ని తిరగ రాయాలని అంటున్నారని సంజయ్‌ ధ్వజమెత్తారు. సోమవారం బండి సంజయ్‌ అధ్యక్షతన బీజేపీ లీగల్‌ సెల్‌ భేటీ జరిగింది. కేసీఆర్‌పై రాజ్యాంగ ధిక్కరణ, దేశద్రోహం వంటి కేసులు వేస్తామని మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచందర్‌రావు తెలిపారు.

మరిన్ని వార్తలు