Telangana: ఇంటర్‌ విద్యార్థులకు శుభవార్త.. ఆ నిబంధన సడలింపు 

5 Mar, 2022 03:14 IST|Sakshi

40 మార్కుల నిబంధన సడలింపు 

ఉన్నత విద్యామండలి నిర్ణయం 

TS EAMCET 2022 Eligibility Criteria: ఇంటర్‌ విద్యార్థులకు శుభవార్త. కనీస మార్కులతో ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులైనవారిని ఎంసెట్‌ ర్యాంకులకు అర్హులుగా ప్రకటించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. దీనివల్ల ప్రస్తుతం ఇంటర్‌ రెండో ఏడాది పరీక్షలు రాస్తున్న ప్రతి ఒక్కరికీ ఎంసెట్‌కు అర్హత లభిస్తుంది. వాస్తవానికి ఇంటర్‌లో కనీసం 40 మార్కులు వస్తేనే ఎంసెట్‌ ద్వారా ఇంజనీరింగ్‌ సీటు సంపాదించే వీలుంది.

కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా ఈ నిబంధనను సడలించారు. టెన్త్‌ పరీక్షలు లేకుండానే గతేడాది ఇంటర్‌ ఫస్టియర్‌కు విద్యార్థులు ప్రమోట్‌ అయ్యారు. వీరికి గత మార్చిలో కూడా ఫస్టియర్‌ పరీక్షలు నిర్వహించలేదు. అయితే, ఆ తర్వాత అక్టోబర్‌లో వీళ్లందరికీ పరీక్షలు పెట్టారు. కానీ, కేవలం 49 శాతం మంది విద్యార్థులే ఉత్తీర్ణులయ్యారు. దీనిపై విద్యార్థుల్లో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. ఆన్‌లైన్‌ క్లాసులు అర్థం కాకపోవడంతో తాము పరీక్షలు సరిగా రాయలేకపోయామని నిస్సహాయత వ్యక్తం చేశారు.

కొంతమంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటంతో ప్రభుత్వం ఫస్టియర్‌ విద్యార్థులందరినీ కనీస మార్కులతో పాస్‌ చేసింది. ప్రస్తుతం వీళ్లు ఏప్రిల్‌లో సెకండియర్‌ పరీక్షలు రాయాల్సి ఉంది. ఫస్టియర్‌ అనుభవాలను పరిగణనలోనికి తీసుకుంటే, ఎక్కువ మంది 40 మార్కులు సాధించడం కష్టమనే అంచనాలు తెరమీదకొస్తున్నాయి. దీంతో 35 మార్కులతో ఉత్తీర్ణులైతే ఎంసెట్‌ ద్వారా సీటు పొందే అవకాశం కల్పించాలని తాజాగా నిర్ణయించారు. త్వరలో ఉన్నత విద్యామండలి దీనిపై చర్చించి నిర్ణయం ప్రకటించే వీ లుంది. ఇదే క్రమంలో జూన్‌ ఆఖరులోగా ఎంసెట్‌ తేదీలను ఖరారు చేయాలని భావిస్తోంది.    

మరిన్ని వార్తలు