పారిశ్రామిక రంగానికి రూ.3,077 కోట్లు

19 Mar, 2021 08:17 IST|Sakshi

రాయితీలు, ప్రోత్సాహకాలకే 2,500 కోట్లు

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు1,130 కోట్లు

చేనేత కార్మికుల సంక్షేమానికి 338 కోట్లు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ 2021–22లో పారిశ్రామిక రంగానికి రూ.3,077 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ఏడాది పారిశ్రామిక రంగ కేటాయింపుల్లో సింహభాగం రూ.2,500 కోట్లు పరిశ్రమల రాయితీలు, ప్రోత్సాహకాలే ఉండటం గమనార్హం. గతేడాది 2020–21 వార్షిక బడ్జెట్‌తో పోలిస్తే ఈ ఏడాది పారిశ్రామిక రంగ కేటాయింపులు రూ.1,079 కోట్ల మేర పెరి గాయి. కాగా ఈ ఏడాది పారిశ్రామిక రంగ కేటాయింపుల్లో జీతభత్యాలు, వాహనాలు, కార్యాలయాల నిర్వహణ తదితరాల కోసం నిర్వహణ పద్దు కింద రూ.330.96 కోట్లు కేటాయించారు. ప్రగతి పద్దు పేరిట పరిశ్రమల విభాగంతో పాటు ఇతర అనుబంధ శాఖలకు రూ.1,616.31 కోట్లు, ఎస్సీ, ఎస్టీ స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ కింద సుమారు మరో రూ.1,130 కోట్లు కేటాయించారు.

విద్యుత్, ఎస్‌జీఎస్టీ, నైపుణ్య శిక్షణ, స్టాంప్‌ డ్యూటీ, భూ బదలాయింపు, పెట్టుబడి రాయితీ తదితరాలకు సంబంధించి రాష్ట్రంలోని వివిధ కేటగిరీలకు చెందిన సుమారు 3 వేల మంది పారిశ్రామికవేత్తలకు రూ.2,800 కోట్ల మేర రాయితీలు, ప్రోత్సాహ కాలకు సంబంధించిన బకాయిలు ఉన్నాయి. గతేడాది బడ్జెట్‌లో రాయితీలు, ప్రోత్సాహకాల బకాయిలు చెల్లించేందుకు 1,500 కోట్లు కేటాయించినా అరకొర చెల్లింపులే జరిగాయి. ప్రస్తుత బడ్జెట్‌లో పారిశ్రామిక రాయితీలు, ప్రోత్సాహకాల కోసం రూ.2,500 కోట్లు కేటాయించడంతో పారిశ్రామికవేత్తలకు మరీ ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్వాహకులకు ఊరట దక్కనుంది.

ప్రతిష్టాత్మక పార్కుల ప్రస్తావన లేదు..
రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్‌ ఐపాస్‌లో భాగంగా 14 ప్రధాన రంగాల కోసం ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్‌) జహీరాబాద్, హైదరాబాద్‌ ఫార్మాసిటీ, వరంగల్‌ కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కు కోసం వేలాది ఎకరాల భూమిని సేకరించింది. వీటితో పాటు పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం పలు పర్యాయాలు లేఖలు రాసింది. అయితే ప్రస్తుత రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో నిమ్జ్‌లో భూసేకరణకు రూ.2 కోట్లు కేటాయించగా, ఇతర పారిశ్రామిక పార్కుల ప్రస్తావన కనిపించలేదు. నిర్వహణ పద్దు, రాయితీలు పోగా పారిశ్రామిక రంగానికి చేసిన కేటాయింపుల్లో అనుబంధ శాఖలైన చేనేత, మౌలిక వసతులు, పెట్టుబడులు, చక్కెర, గనులు, భూగర్భ వనరుల శాఖకు నామమాత్రంగా నిధులు దక్కాయి. ప్రస్తుత బడ్జెట్‌లో నేత కార్మికుల కోసం రూ.338 కోట్లు ప్రతిపాదించగా ఇందులో నేత కార్మికులకు ఆర్థిక సాయం కోసం రూ.141.42 కోట్లు, చేనేత, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి రూ.226.76 కోట్లు కేటాయించారు.

ఐటీ రంగానికి రూ.360 కోట్లు..
ఐటీ రంగంలో ఎగుమతుల వృద్ధి రేటు విషయంలో దేశ సగటు 8.09 శాతంతో పోలిస్తే రాష్ట్రంలో వృద్ధిరేటు 17.93 శాతంగా ఉంది. ఐటీ, స్టార్టప్‌లకు హబ్‌గా పేరొందిన హైదరాబాద్‌లోని కొంపల్లి, కొల్లూరు, శంషాబాద్, ఉప్పల్, పోచారం తదితర కొత్త ప్రాంతాలకు ఐటీ రంగం విస్తరిస్తోంది. మరోవైపు ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో ఐటీ టవర్లు మనుగడలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ రంగానికి కొత్త ప్రాంతాలకు విస్తరించ డంతో పాటు ఐటీ రంగంలో మౌలిక వసతులు మెరుగుపర్చేందుకు రూ.360 కోట్లను ప్రస్తుత వార్షిక బడ్జెట్‌లో ప్రతిపాదించారు.
పారిశ్రామిక రంగానికి కేటాయింపుల స్వరూపమిదీ..

      కేటగిరీ                                                     కేటాయింపు(రూ.కోట్లలో)
గ్రామీణ చిన్న తరహా పరిశ్రమలు                                    1,379.40
భారీ, మధ్య తరహా పరిశ్రమలు                                       70.90 
స్టేట్‌ సెక్టార్‌స్కీమ్స్‌                                                      12.06
మౌలిక వసతులు, పెట్టుబడులు                                    29.55
చక్కెర శాఖ                                                              1.62
గనులు, భూగర్భ వనరులు                                          122.76
ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధులు                                         501.58
ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధులు                                       628.30
నిర్వహణ పద్దు                                                          330.96
      మొత్తం                                                               3,077  

మరిన్ని వార్తలు