బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.3,000  కోట్లు

19 Mar, 2021 08:55 IST|Sakshi

పీఎఫ్, సీసీఎస్‌ బకాయిల నుంచి మోక్షం

జీతాలకు ఇక ఢోకా లేనట్టే

కొత్త బస్సులు కొనేందుకు అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: బ్యాంకు అప్పు.. దానిపై పేరుకుపోయిన వడ్డీ.. సొంతానికి వాడుకోవటంతో పేరుకుపోయిన కార్మికుల భవిష్య నిధి, ఆర్టీసీ సహకార పరపతి సంఘం నిధులు, చమురు బిల్లులు, జీతాల భారం.. ఇలా ఎటుచూసినా సమస్యలతో ఆర్టీసీ కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ప్రభుత్వం గతేడాది కంటే మెరుగ్గా బడ్జెట్‌లో నిధులు ప్రతిపాదించి ఊరటనిచ్చింది. తాజా బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ. 1,500 కోట్లు ప్రతిపాదించారు. ఇవి కాకుండా బడ్జెటేతర నిధుల కింద మరో రూ. 1,500 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. వెరసి రూ. 3 వేల కోట్లు కేటాయించింది. ప్రస్తుతం సహకార పరపతి సంఘం పాలకమండలి ఆర్టీసీపై హైకోర్టులో కేసు దాఖలు చేసింది. బకాయిలు చెల్లించకుంటే చట్టపరంగా చర్యలు తప్పవని పీఎఫ్‌ యంత్రాంగం షోకాజ్‌ నోటీసులు పంపింది. ఇలాంటి విపత్కర పరిస్థితిలో వాటి బకాయిలు కొంత మేర తీర్చేందుకు ఆర్టీసీకి నిధులు అందనున్నాయి. 

కావాల్సింది రూ.5 వేల కోట్లు... 
కార్మికుల భవిష్య నిధి చెల్లించకపోతుండటంతో రూ. 1,200 కోట్లు పేరుకుపోయాయి. కార్మికులు పొదుపు చేసుకున్న సహకార పరపతి సంఘం బకాయిలు రూ. 850 కోట్లకు చేరుకున్నాయి. మరో రూ. 3 వేల కోట్లు బ్యాంకు అప్పులున్నాయి. వెరసి ఆర్టీసీకి రూ. 5 వేల కోట్లు కావాలి. బడ్జెట్‌లో ఇచ్చే నిధులు కాక రూ. 2,500 కోట్లు కావాలని ఆర్టీసీ ప్రభుత్వాన్ని కోరింది. అయితే ప్రభుత్వం రూ. 3 వేల కోట్లే కేటాయించింది. గత కొన్ని నెలలకు ఆర్టీసీ తన ఉద్యోగులకు నికర వేతనం మాత్రమే చెల్లిస్తోంది. ఆ మొత్తం నెలకు రూ. 120 కోట్లు అవుతుంది. అదే స్థూల వేతనం చెల్లించాలంటే ప్రతినెలా రూ.185 కోట్లు కావాలి. ఇప్పుడు నిధులు అందుబాటులో ఉంటే స్థూల వేతనం చెల్లించే అవకాశం ఉంటుంది. ఇక ఉన్నపళంగా వెయ్యి కొత్త బస్సులు కొనాల్సి ఉంది. వాటికి కొన్ని నిధులు ఖర్చు చేసుకునే అవకాశం ఉంటుంది. 

రూ. 1,500 కోట్లు పూచీకత్తు రుణానికి 
బడ్జెట్‌లో రూ.1,500 కేటాయిస్తూ మరో రూ. 1,500 కోట్ల బడ్జెటేతర నిధులుగా ప్రభుత్వం పేర్కొంది. ఆ రెండో మొత్తం బ్యాంకు నుంచి అప్పు తీసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చే పూచీకత్తుకు సంబంధించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అదే నిజమైతే అలా తీసుకునే మొత్తం తిరిగి ప్రభుత్వమే చెల్లించేలా ఉండాలని వారు కోరుతున్నారు. అంటే ఓ రకంగా గ్రాంటుగా ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఒప్పించాలని భావిస్తున్నారు. 

త్వరలో సీఎంతో భేటీ: మంత్రి పువ్వాడ 
ఆర్టీసీ కష్టాల్లో ఉన్న సమయంలో గతంలో ఎన్నడూ లేనట్టుగా రూ.3 వేల కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించటం ఎంతో శుభపరిణామమని, ఇందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఇప్పుడు ప్రతిపాదించిన నిధులను ఎలా ఖర్చు చేయాలన్న విషయంలో త్వరలోనే స్పష్టత వస్తుందని, ఇందుకోసం ముఖ్యమంత్రితో భేటీ అయి చర్చించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. రూ.3 వేల కోట్లు ప్రతిపాదించటం పట్ల అన్ని కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.  
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు