మందు బాబులపైనే తెలంగాణ సర్కారు ఆశలు..!

ప్రతీకాత్మక చిత్రం

రూ.17 వేల కోట్లుగా ఎక్సైజ్‌ ఆదాయ అంచనాలు 

కేంద్ర పన్నుల్లో వాటాలపై తగ్గిన ఆశలు 

గతేడాది అంచనాల కంటే రూ.2,700 కోట్ల తగ్గింపు 

జీఎస్టీ, అమ్మకపు పన్నుల ఆదాయం రూ.57,500 కోట్లకు పెంపు 

గత బడ్జెట్‌తో పోలిస్తే 30 శాతం ఎక్కువ 

రూ.6 వేల కోట్లకుపైగా పెరిగిన రిజిస్ట్రేషన్ల పద్దు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర సర్కారు మద్యం అమ్మకాల ఆదాయంపై ఆశలు పెట్టుకున్నట్టుగా బడ్జెట్‌ లెక్కలు వెల్లడిస్తున్నాయి. గతేడాది ప్రతిపాదించిన రూ.16 వేల కోట్లకు అదనంగా రూ.1,000 కోట్లు కలిపి మొత్తం రూ.17వేల కోట్లు ఎక్సైజ్‌ డ్యూటీగా సమకూరుతుందని సర్కారు అంచనా వేసుకుంది. 2020–21లో కరోనాతో నెలన్నర రోజులు మద్యం అమ్మకాలు నిలిచిపోయినా రూ.16 వేల కోట్లు ఎక్సైజ్‌ డ్యూటీ వచ్చింది. వచ్చే ఏడాది మద్యం అమ్మకాలు మరింత పెరుగుతాయనే అంచనాతో అదనపు ఆదాయాన్ని లెక్క కట్టింది. 

కేంద్రం ఏమిస్తుందో..
మిగతా పన్ను ఆదాయాలను పరిశీలిస్తే కేంద్ర పన్నుల్లో వాటాపై రాష్ట్ర ప్రభుత్వానికి ఆశలు తగ్గినట్టు కనిపిస్తున్నా యి. 2020–21లో రూ.16,726 కోట్లు పన్నుల్లో వాటాగా వస్తాయని అంచనా వేసుకోగా.. కేవలం రూ.11,731 కోట్లే్ల అందాయి. దీంతో గతేడాది కంటే తక్కువగా పన్నుల్లో వాటా కింద రూ.13,990 కోట్లను మాత్రమే అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే రూ.2,726 కోట్లు తగ్గించుకుంది. 

మొత్తం పన్ను ఆదాయం పెంపు 
అన్ని రకాల పన్ను ఆదాయం కింద 2020–21తో పోలిస్తే 2021–22 బడ్జెట్లో రూ.7,600 కోట్లు ఎక్కువగానే వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. 2020–21లో పన్నులద్వారా రూ.85,300 కోట్లు సమకూరుతాయని భావించినా.. రూ.76,195 కోట్లే వచ్చాయి. అంచనా కంటే రూ.9వేల కోట్ల వరకు తగ్గాయి. ఈ సవరించిన ఆదాయంతో పోలిస్తే.. రూ.16వేల కోట్లు అదనంగా రూ.92,910 కోట్లు ఈసారి పన్నుల రూపంలో వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. 

జీఎస్టీ, సేల్స్‌ ట్యాక్స్‌ ఆదాయం కూడా.. 
జీఎస్టీ, అమ్మకపు పన్నుల రాబడులు కూడా పెరుగుతాయనే అంచనాతో సర్కారు ప్రతిపాదనలు చేసింది. 2020–21లో జీఎస్టీతో పాటు అమ్మకపు పన్ను కింద రూ.48,895 కోట్లురాగా.. ఈసారి రూ.57,500 కోట్లకు పెంచింది. 

పన్నేతర ఆదాయమూ భారీగానే.. 
పన్నేతర ఆదాయంలోనూ భారీ వృద్ధిని ప్రభుత్వం అంచనా వేసుకుంది. ఈసారి ఏకంగా రూ.30వేల కోట్లను పన్నేతర ఆదాయం కింద ప్రతిపాదించింది. 2020–21లో రూ. 30,600 కోట్లు పన్నేతర రాబడుల రూపంలో వస్తాయని అనుకున్నా.. కేవలం రూ.19,305 కోట్లకు మాత్రమే పరిమితమయ్యాయి. అయితే కరోనా నుంచి కోలుకున్నామనే అంచనాతో ఈసారి కూడా రూ.30,557 కోట్లు పన్నేతర ఆదాయం కింద చూపెట్టడం గమనార్హం. 

వామ్మో.. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ 
కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ విషయంగా ప్రభుత్వ అంచనాలు భారీగా ఉన్నాయి. 2021–22లో గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద ఏకంగా రూ.38,669.46 కోట్లు వస్తాయని అంచనా వేశారు. 2020–21 సంవత్సరానికి గాను ఈ పద్దు కింద రూ.10,525 కోట్లు అంచనా వేయగా.. కేంద్రం ఆ మేరకు నిధులిచ్చింది. ఈసారి అంచనాలు మూడు రెట్లు పెంచడం విశేషం. 2019–20లో కూడా గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద వచ్చింది రూ.11,598 కోట్లే. 

2021–22లో రెవెన్యూ రాబడులపై అంచనాలు (రూ.కోట్లలో) 
పన్ను రకం                                     2021–22 

కేంద్ర పన్నుల్లో వాటా                          13,990.13 
రాష్ట్ర పన్నుల ఆదాయం                       92,910 
ల్యాండ్‌ రెవెన్యూ                                           6.31 
అమ్మకపు, వాణిజ్య పన్నులు                57,500 
రాష్ట్ర ఎక్సైజ్‌                                       17,000 
ఇతర పన్నులు                                  18,403.69 
పన్నేతర ఆదాయం                             30,557.35 
గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌                               38,669.46 
మొత్తం                                           1,76,126.94 

చదవండి: తెలంగాణ బడ్జెట్‌: ‘గ్రేటర్’‌కు సర్కారు వారి పాట 

Author: కె. రామచంద్రమూర్తి
మరిన్ని వార్తలు