Telangana Budget 2022-23: పల్లెకు తగ్గని ప్రాధాన్యత 

8 Mar, 2022 03:55 IST|Sakshi

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.29,586 కోట్లు 

ఆసరా పెన్షన్లకు రూ.11,728 కోట్లు 

సాక్షి, హైదరాబాద్‌:  బడ్జెట్‌లో ఈసారి కూడా పల్లెకు పట్టం కట్టారు. గత కొన్నేళ్లుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని కొనసాగించారు. గతేడాది ఈ శాఖకు రూ.29,271 కోట్లు కేటాయించగా, 2022–2023 బడ్జెట్లో రూ.29,586.06 కోట్లు ప్రతిపాదించారు. క్షేత్రస్థాయిలో నిత్యం ప్రజలతో సంబంధాలు కొనసాగించే పంచాయతీరాజ్‌ సంస్థల పటిష్టానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్న విషయం విదితమే. తాజా బడ్జెట్‌లోనూ అదే దృష్టిని, ప్రాధాన్యతను ప్రభుత్వం కొనసాగించింది.

పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టే వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు బడ్జెట్‌లో రూ.3,330 కోట్లు ప్రతిపాదించారు. ఆసరా పింఛన్ల కోసం రూ.11,728 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం వివిధ కేటగిరీల కింద 38.41 లక్షల మంది లబ్ధిదారులు ఆసరా పింఛన్లు పొందుతున్నారు. వృద్ధులు, వితంతువులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు, నేత, గీత కార్మికులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులకు నెలకు రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 చొప్పున ఇస్తున్నారు. 57 ఏళ్ల అర్హత వయసుతో దరఖాస్తు చేసుకున్న వారందరికీ 2022–23 ఆర్థిక సంవత్సరంలో చెల్లించే ఏర్పాటు చేస్తామని చెబుతున్నా దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.  

ఎస్టీ పంచాయతీ భవనాలకు నిధులు 
గిరిజన, ఆదివాసీ గ్రామ పంచాయతీలకు సొంత పంచాయతీ భవనాల నిర్మాణం నిమిత్తం ఒక్కోదానికి రూ.25 లక్షల చొప్పున మొత్తం రూ.600 కోట్లు ప్రభుత్వం కేటాయిస్తోంది. ఎస్టీ నివాస ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం కోసం ఎస్టీఎస్‌డీఎఫ్‌ నుంచి రూ.1,000 కోట్లు ప్రతిపాదించింది. పావలా వడ్డీ రుణాల కోసం రూ. 187 కోట్లు, మిషన్‌ భగీరథ అర్బన్‌ కింద రూ.800 కోట్లు కేటాయించింది.

మరిన్ని వార్తలు